Ramayanam – 67 : Rama’s agony
భద్రుడు చెప్పిన మాటలు వినగానే రాముడి మనసు కకావికలం అవుతుంది. ఏడాది పాటు పరాయిచోట ఉన్న భార్యను రాముడు కనుక ఏలుకున్నాడు అనే మాటలు, ఆయన హృదయాన్ని శూలాల మాదిరిగా పొడుస్తూ ఉంటాయి. బాధతో ఆయన తల్లడిల్లిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఏదో తాగేసి అలా మాట్లాడి ఉంటాడనీ, ఆ మాటలను పట్టించుకోవద్దని భద్రుడు ప్రాధేయపడతాడు. ఆయన ఆజ్ఞను శిరసా వహించడం కోసమే తను ఆ మాటను చెప్పవలసి వచ్చిందని అంటాడు. తనని మన్నించమని కోరతాడు.
ఆ మాట అన్నది ఒక వ్యక్తి మాత్రమే కావొచ్చు, కానీ అది జనంలో నుంచి వచ్చినట్టే లెక్క. అందువలన ఆ మాటను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది అని రాముడు అంటాడు. వెంటనే తన సోదరులను తన మందిరానికి పంపించమని చెబుతాడు. ఉన్నపళంగా రమ్మని రాముడు కబురు చేయడంతో, వెంటనే ఆయన మందిరానికి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు చేరుకుంటారు. తమని అత్యవసరంగా పిలిపించిన కారణమేమిటని అడుగుతారు. రాముడు అదోలా ఉండటం చూసి ఏం జరిగిందని ఆలోచిస్తుంటారు.
భద్రుడి ద్వారా తాను విన్న మాటను సోదరులతో చెబుతాడు రాముడు. ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్న వ్యక్తి రాజుగా పనికిరాడని చెబుతాడు. అందువలన తాను రాజుగా కొనసాగాలని అనుకోవడం లేదని అంటాడు. ముగ్గురిలో ఎవరైనా ఒకరు సింహాసనం అధిష్ఠించి అయోధ్యను పాలించమని కోరతాడు. సీత అగ్నిపునీత అనే విషయం ప్రజలకి తెలియదు గనుక వాళ్లు అలా మాట్లాడుకుంటూనే ఉంటారనీ, ఈ మాట రాజ్యమంతా ప్రచారమయ్యే వరకూ తాను సింహాసనంపై ఉండటం సరికాదని చెబుతాడు.
అయోధ్య రాజుగా రాముడే కొనసాగాలనీ, తమకి అంతటి శక్తి సామర్థ్యాలు లేవని లక్ష్మణ భరత శ్శత్రుఘ్నులు అంటారు. సింహాసనంపై రాముడి లేని అయోధ్యను తాము మళ్లీ చూడాలని అనుకోవడం లేదని చెబుతారు. అందువలన అయోధ్యను, సింహాసనాన్ని త్యజించే ఆలోచన మాత్రం చేయవద్దని కోరతారు. ఎవరో ఏదో అన్నారని ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవద్దని అంటారు. రాముడి సేవకులుగా ఉండటమే తమకి ఆనందాన్ని ఇస్తుందనీ, తమని రాజుగా చేసే ఆలోచన చేయవద్దని చెబుతారు.
అయోధ్య సింహాసనాన్ని వదలని క్షణాన తాను తన సీతను వదిలివేయవలసి ఉంటుందనే అభిప్రాయాన్ని రాముడు వ్యక్తం చేస్తాడు. ఆ మాట వినగానే ఆయన ముగ్గురు సోదరులు ఉలిక్కిపడతారు. సీత వ్యక్తిత్వాన్ని సందేహించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తారు. తన సీత ఎలాంటిదో తనకి తెలుసనీ, కానీ ఆమె తనతోనే ఉంటే లోక నిందను భరించవలసి వస్తూనే ఉంటుందని రాముడు అంటాడు. రాజుగా పరిపాలనా పరమైన నిందలు భరించడం వేరు, కానీ ఈ నింద తమ వంశాన్ని వెంటాడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తాడు. అందువలన సీతను అడవులలో దింపేసి రమ్మని లక్ష్మణుడిని ఆజ్ఞాపిస్తాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 67 : Rama’s agony
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.