Mahabharatham – 1 : Bhishma’s vow
“కురు” మహారాజు పేరుతో “కౌరవ వంశం” ఏర్పడింది. పాండవులు .. కౌరవులు “కురు” వంశానికి చెందినవారే. అయితే ధృతరాష్ట్రుడి తనయులైన 100 మందిని ధార్తరాష్ట్రులుగా, “పాండురాజు” కుమారులైన ఐదుగురిని పాండవులుగా భావించేవారు. ఆ తరువాత ధృతరాష్ట్రుడి కుమారులు మాత్రమే కౌరవులుగా పిలవబడ్డారు. కురు వంశంలో ఎంతోమంది వీరయోధులు .. త్యాగ పురుషులు కనిపిస్తారు. అలాంటి కురు వంశంలో “శంతనుడు” ఒకరు. కౌరవ వంశానికి చెందిన శంతన మహారాజు “హస్తినాపురం” అనే రాజ్యాన్ని ధర్మ బద్ధంగా పరిపాలిస్తూ ఉంటాడు.
ఒక రోజున విహారానికి వెళ్లిన శంతనుడు .. అక్కడ మానవ రూపంలోని “గంగ”ను చూసి మనసు పారేసుకుంటాడు. “గంగ” అందచందాలకు ఆకర్షితుడైన ఆయన, ఆమెను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఒక మహారాజుగా చనువు తీసుకుని తన మనసులోని మాటను ఆమెకి చెబుతాడు. ఆయనతో కలిసి ఉండటానికి ఆమె కొన్ని షరతులను విధిస్తుంది. ఆమెపట్ల గల వ్యామోహంతో శంతన మహారాజు అందుకు అంగీకరిస్తాడు. ఆ ఇద్దరి కలయిక కారణంగా కలిగినవాడే “దేవవ్రతుడు”. యుక్తవయసులోకి దేవవ్రతుడు అడుగుపెట్టిన తరువాత, శంతన మహారాజుకి అతణ్ణి అప్పగించి “గంగ” వెళ్లిపోతుంది.
అనేక యుద్ధ విద్యలను అభ్యసించిన దేవవ్రతుడు .. పరిపాలన వ్యవహారాలలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఒక రోజున ఆయన తన తండ్రి విచారంగా ఉండటం గమనిస్తాడు. తన తండ్రి “సత్యవత” అనే ఒక యువతిని ఇష్టపడ్డాడనీ, ఆమెను వివాహమాడాలనే ఆలోచన చేశాడనే విషయాన్ని తెలుసుకుంటాడు. సత్యవతి తండ్రి .. తన కూతురి సంతానానికే రాజ్యాధికారం దక్కాలనే షరతు పెట్టాడనీ, ఆ విషయాన్ని గురించే తన తండ్రి వేదన చెందుతున్నాడని దేవవ్రతుడికి అర్థమవుతుంది. దాంతో ఆయన ఉన్నపళంగా బయల్దేరి సత్యవతి తండ్రి అయిన “దాశరాజు”ను కలుసుకుంటాడు.
సత్యవతి విషయంలో తన తండ్రికి .. దాశరాజుకి మధ్య జరిగిన సంభాషణను గురించి దేవవ్రతుడు ప్రస్తావిస్తాడు. శంతన మహారాజుతో తాను మాట్లాడిన మాటల్లో న్యాయం ఉందని అంటాడు దాశరాజు. రాజ్యాన్ని ఏలే వారసుడు ఉన్న వ్యక్తికి తాను ఎలా పిల్లను ఇస్తానని ప్రశ్నిస్తాడు. శంతన మహారాజుకి తాను వారసుడినే అయినా, తను రాజ్యాధికారాన్ని చేపట్టనని మాట ఇస్తాడు దేవవ్రతుడు. “ఈ రోజున నువ్వు ఈ మాట అంటున్నావు .. రేపటి రోజున నీ పిల్లలలకు రాజ్యకాంక్ష ఉండదనే నమ్మకం ఏమిటి?” అని అడుగుతాడు దాశరాజు.
ఒక్క నిమిషం పాటు దేవవ్రతుడు ఆలోచన చేస్తాడు. తన తండ్రి ఆనందంగా ఉండాలి .. అలా ఉండాలంటే ఆయన జీవితంలోకి అర్ధాంగిగా “సత్యవతి” అడుగుపెట్టాలి. అందుకు దాశరాజు అంగీకరించాలంటే సత్యవతి గర్భాన జన్మించిన వారికే రాజ్యాధికారం దక్కాలి. రాజ్యాధికారాన్ని త్యాగం చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నాడు .. కానీ, భవిష్యత్తులో తన సంతానం కారణంగా సత్యవతి పుత్రులకు ఇబ్బంది కలుగుతుందనే దూరాలోచనను దాశరాజు చేస్తున్నాడు. అంతే .. ఆ క్షణంలోనే దేవవ్రతుడు ఒక నిర్ణయానికి వస్తాడు. తాను ఎప్పటికీ పెళ్లిచేసుకోననీ, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని “ప్రతిజ్ఞ” చేస్తాడు. భీషణ ప్రతిజ్ఞ చేయడం వల్లనే “దేవవ్రతుడు” “బీష్ముడు”గా ప్రసిద్ధి చెందాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక : పంచమవేదమైన “మహాభారతం”ను తర్వాతి కాలంలో ఎంతోమంది రచయితలు,కవులు తమదైన శైలిలో ఆవిష్కరించి మరింత సారవంతం చేశారు. వాటిల్లో మేము విన్నవి .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Mahabharatham – 1 : Bhishma’s vow
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.
