సత్యభామకు ఇచ్చిన మాట మేరకు దేవలోకం నుంచి “పారిజాతవృక్షం” తీసుకురావడానికి సత్యభామ సమేతుడై కృష్ణుడు బయల్దేరతాడు. సత్యభామ సమేతంగా కృష్ణుడు తమ లోకానికి రావడం పట్ల దేవేంద్రుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ దంపతులను సాదరంగా ఆహ్వానిస్తాడు. దేవేంద్రుడు ఆ దంపతులను తన సింహాసనంపై కూర్చుండబెడతాడు. అప్సరసలు తమ నాట్యంతో ఆ దంపతులను ఆనదింపజేయడానికి తమవంతు ప్రయత్నం చేస్తారు. విందు వినోదాల తరువాత శ్రీకృష్ణ సత్యభామలు దేవమాత అయిన “అదితి” దర్శనం చేసుకుంటారు.
శ్రీకృష్ణుడిని .. సత్యభామను అదితి ఎంతో ఆత్మీయంగా పలకరిస్తుంది. వాళ్లు రావడం అమరలోకం చేసుకున్న అదృష్టమని అంటుంది. శ్రీకృష్ణ సత్యభామలు అదితికి వినయంగా నమస్కరించుకుని, గతంలో ఆమె దగ్గర నుంచి నరకాసురుడు బలవంతంగా లాక్కున్న కుండలాలను ఆమెకి తిరిగి అప్పగిస్తారు. ఆ కుండలాలను చూడగానే ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. నరకాసురుడిని అంతం చేయడమే కాకుండా తనకి ఎంతో ప్రీతిపాత్రమైన కుండలాలను అతని నుంచి తీసుకొచ్చినందుకు ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది .. కృష్ణుడిని అభినందిస్తుంది.
అమరలోక విశేషాలను తిలకించవలసిందిగా శ్రీకృష్ణ సత్యభామలను దేవేంద్రుడు కోరతాడు. అలాగేనని చెప్పి వాళ్లు అక్కడి నుంచి బయల్దేరతారు. ముందుగా నందన ఉద్యానవనం వైపు అడుగులు వేస్తారు. నందనోద్యానవనం చూడగానే సత్యభామ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం .. పారిజాత సుమాల నుంచి వెదజల్లుతున్న పరిమళాలు ఆమెకి చిత్రమైన అనుభూతిని కలిగిస్తాయి. తప్పనిసరిగా ఆ వృక్షము తన ఉద్యానవనంలో ఉండవలసిందేనని ఆమె భావిస్తుంది.
అతిథిలుగా వచ్చిన తాము దేవేంద్రుడికి ఒక మాట చెప్పేసి, పారిజాతవృక్షమును తీసుకువెళ్లడం సరైందని సత్యభామతో కృష్ణుడు చెబుతాడు. అందుకు సత్యభామ నిరాకరిస్తుంది. ఆ పారిజాత వృక్షమును “శచీదేవి” ఎంత అపురూపంగా చూసుకుంటుందో తాను ప్రత్యక్షంగా చూశానని అంటుంది. అందువలన తాము అడిగినా ఇవ్వడానికి ఆమె అంగీకరించక పోవచ్చునని చెబుతుంది. కనుక గుట్టు చప్పుడు కాకుండా పారిజాత వృక్షాన్ని తీసుకుని వెళ్లడమే మంచిదని అంటుంది. ఆమె మాటల్లోనూ నిజం లేకపోలేదని కృష్ణుడు భావిస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.