నదీ స్నానం చేయడానికి వెళ్లిన దుర్వాసుడు రాకపోవడంతో, ద్వాదశి వేళ మించిపోతుంటుంది. దాంతో అలా అతిథి కోసం నిరీక్షిస్తూ ఉంటే ద్వాదశి గడిచిపోతుందనీ .. వ్రతభంగము అవుతుందని మిగతా పెద్దలు చెబుతారు. ఏడాదికాలం పాటు చేసిన వ్రతానికి ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని అంటారు. అలా అని చెప్పేసి తాను భోజనం చేస్తే, దుర్వాసుడిని అవమానించినట్టే అవుతుందని అంబరీషుడు అంటాడు. అయితే భోజనం చేయకుండా కాసిన్ని మంచినీళ్లు తాగవచ్చనీ, అలా చేయడం వలన వ్రత భంగం కాదనీ .. అతిథిని అవమానపరిచినట్టుగా కూడా కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.

పండితులు చెప్పిన ఆ మాటను గురించి అంబరీషుడు ఆలోచన చేస్తాడు. ద్వాదశి ఘడియలు ముగిసేలోగా మంచినీళ్లు తీసుకోవడం వలన వ్రత ఫలితం దక్కుతుంది. అంతే కాకుండా దుర్వాసుడిని అవమాన పరిచినట్టుగా కాదు. అందువలన ఆ విధంగా చేయడం మంచిదేనని అనుకుంటాడు. వ్రతభంగం కాకూడదనే ఉద్దేశంతో కాసిన్ని మంచినీళ్లు తాగుతాడు. అలా ఆయన మంచినీళ్లు తాగుతుండగానే దుర్వాస మహర్షి వస్తాడు. తాను నదీ స్నానానికి వెళ్లి రావడం ఆలస్యం కాగానే ఆకలికి ఆగలేక, వెంటనే నీళ్లు తీసుకున్నాడని కోపంతో రగిలిపోతాడు.

ద్వాదశి ఘడియలు మించిపోతున్నాయనే ఉద్దేశంతో .. వ్రతభంగం కాకూడదనే ఆలోచనతో పండితులు చెప్పిన మేరకు కాసిన్ని నీళ్లు తాగానని అంబరీషుడు చెబుతాడు. ఆ మాటలకు దుర్వాసుడు శాంతించకపోగా, ఇది కచ్చితంగా తనని అవమానపరచడమేనని అంటాడు. ఒక వ్యక్తి పట్ల గౌరవమర్యాదలు లేకపోయినప్పుడే అతని గురించి ఎదురుచూడటం జరగదంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. తన పట్ల చులకన భావం ఉండటం వల్లనే ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా మంచినీళ్లు సేవించడం చేశాడని అంటాడు.

ఆయనను అవమానపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదనీ, కేవలం వ్రతభంగం కాకూడదనే ఉద్దేశంతోనే అలా చేశానని అంబరీషుడు చెబుతాడు. పండితుల సూచనమేరకే అలా చేశానని అంటాడు. అందువలన తన పరిస్థితిని అర్థం చేసుకుని, భోజనానికి సిద్ధంకమ్మని కోరతాడు. ఆ మాట వినగానే దుర్వాసుడు మరింత మండిపడతాడు. ఇంతగా అవమానపరిచి భోజనం చేయమనడం సరైనదని కాదని అంటాడు. తనని భోజనానికి పిలిచి అవమానపరిచినందుకు ఆయన తగిన శిక్షను అనుభవించక తప్పదంటూ “కృత్య” అనే రాక్షసిని సృష్టిస్తాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.