Pushpagiri

సాధారణంగా ఒక క్షేత్రంలో శివుడు .. మరో క్షేత్రంలో కేశవుడు కొలువైన క్షేత్రాలలో కంటే, ఈ ఇద్దరూ కొలువైన క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఇక హరిహరులిద్దరూ కలిసి నదీ తీరంలో ఆవిర్భవిస్తే అలాంటి క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవని అంటారు. అలా శివకేశవులు “పెన్నా నదీ” తీరంలో వెలసిన పుణ్యక్షేత్రంగా “పుష్పగిరి”(Pushpagiri) కనిపిస్తుంది. ఇది కడపకి సమీపంలో విలసిల్లుతున్న పరమ పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ కొండపై చెన్నకేశవ స్వామి – సంతాన మల్లేశ్వరుడు కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు.

ఇక కొండ దిగువన గ్రామం ఉంటుంది .. ఈ గ్రామంలో వైద్యనాథేశ్వర స్వామి – కామాక్షిదేవి ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయంలో గోపురాలు .. విమాన గోపురాలు .. ప్రాకార మంటపాలు అంతా కూడా శిల్పకళా చాతుర్యంతో ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. చాళుక్యులు .. విజయనగర రాజుల కాలంలో ఈ క్షేత్రం మరింత వైభవాన్ని సంతరించుకున్నట్టుగా స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. ఎంతోమంది రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా చెబుతారు.

ఈ క్షేతరానికి పుష్పగిరి అనే పేరు రావడానికిగల కారణంగా ఆసక్తికరమైన ఒక కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. శ్రీరాముడు .. రావణుడిని సంహరించడానికి వెళుతూ, ఇక్కడ కొన్ని రోజుల పాటు విశ్రమించాడట. ఆ సమయంలో రాముడు ఇక్కడి వైద్యనాథేశ్వరస్వామిని నిత్యం వివిధ రకాల పూలతో పూజించాడట. అలా పూజించిన పూలను మరునాడు నదిలో వదిలేవాడట. ఆ పూలరాశి ఒక కొండంత కావడంతో, దానిని పుష్పగిరి అని పిలిచేవారని అంటారు. అలా ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.

ఇక గ్రామంలోని కామాక్షి అమ్మవారి ఆలయాన్ని ఆదిశంకరులవారు దర్శించినట్టుగా చెబుతారు. ఆదిశంకరులవారు అమ్మవారిని పూజించి ఇక్కడ “శ్రీ చక్రం” ప్రతిష్ఠించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి మొదలు .. వైశాఖ శుద్ధ సప్తమి వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ రోజుల్లో ఇటు చెన్నకేశవస్వామి … అటు సంతాన మల్లేశ్వరుడు ఇద్దరూ కూడా వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు.

ఈ ఆలయాలు మాత్రమే కాకుండా పుష్పగిరిలో ఎక్కడ చూసిన చిన్న .. చిన్న ఆలయాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైన అనేక విశేషాలను మనతో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంటాయి. ఇక్కడి నిర్మాణాలు చూస్తేనే వాటి ప్రాచీన వైభవం ఎలాంటిదనేది మనకి అర్థమైపోతుంటుంది. శ్రీరాముడి పాద స్పర్శ తో పునీతమైన నేల ఇది. ఆదిశంకరులవారు నడయాడిన పుణ్యభూమి ఇది. ఎంతోమంది ప్రభువులు .. భక్తులచే సేవించబడిన క్షేత్రం ఇది. అలాంటి ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2024 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2024 – Panchangam – App on Apple App Store