Ugadi Rasi Phalalu 2023 “శోభకృతు” నామ సంవత్సర ఉగాది సందర్బంగా పన్నెండు రాశుల వారికి నూతన తెలుగు సంవత్సరాదిలో జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం వార్షిక రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రాశి వారికి ఆదాయం –5 వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–1 గా ఉంటుంది.

ఈ ఏడాది గురువు జన్మరాశి సంచారం సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అయితే కొన్ని ఒత్తిడులు, ఆరోగ్యపరంగా చికాకులు ఎదురైనా స్వల్పంగానే ఉంటాయి.

ఇక అక్టోబర్‌ వరకు గురు, రాహువుల కలయిక వల్ల కలిగే గురు ఛండాల యోగం వల్ల మానసికంగా అశాంతి. కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు.

మీ నైపుణ్యాన్ని నిరూపించుకుని సమర్థతతో గౌరవాన్ని సంపాదించుకునే అవకాశాన్ని గురువు ఇస్తాడు.

ఇక శని లాభస్థానంలో సంచారం మీకు సర్వలాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు అధుపులో ఉంచుకుంటారు. అలాగే, దుబారా ఖర్చులను తగ్గించుకుని పొదుపు మార్గాలు పాటిస్తారు.

అక్టోబర్‌ వరకు జన్మరాహువు, సప్తమంలో కేతువు కారణంగా మానసిక ఆందోళన. భార్యాభర్తల మధ్య సయోధ్యకు ఇబ్బంది కలుగవచ్చు. వీరు పరస్పర అవగాహనతో మసలుకోవడం మంచిది. తదుపరి పరిస్థితులు చక్కబడతాయి.

ఇక ఆదాయానికి ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. స్థిరాస్తులను సమకూర్చుకోవడంలో ముందుంటారు. అలాగే, వారసత్వ ఆస్తులు కొన్ని పొందే సూచనలున్నాయి.

కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపంలో పెడతారు.

విద్యార్థులు ఎన్నడూ లేని విధంగా ఫలితాలు పొందబోతున్నారు. వీరికి ఎడాపెడా అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

సమాజసేవ, ధార్మిక కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం అధికంగా ఉంటుంది. ఏ కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ విశ్రాంతి తీసుకోరు. అంత పట్టుదలతో ఉంటారు. మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి.

మహిళలకు అన్నింటా విజయాలు చేకూరతాయి. వీరు ఖరీదైన నగలు కొనుగోలు చేస్తారు.

వ్యాపార, వాణిజ్య రంగాల వారు లాభాల స్థాయిని పెంచుకునేందుకు తగిన వ్యూహాలు, పట్టుదలతో ముదుకు సాగుతారు. వీరి ప్రయత్నాలు సఫలమవుతాయి.

ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. అలాగే, వీరి సమర్థనీయమైన పని తీరుని అధికారులు ప్రశంసిస్తారు. కొందరికి పదోన్నతులు కలుగవచ్చు.

వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. అనూహ్యంగా పెట్టుబడులు సమకూరతాయి.

పారిశ్రామికవేత్తలు మునుపటి కంటే మరింత చురుగ్గా అడుగులు వేస్తారు. కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు.

రాజకీయవేత్తలకు పదవులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.

చిత్రపరిశ్రమ వారు చేజారిన అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. వీరికి కొన్ని అవార్డులు రావచ్చు.

అయితే జూన్‌ నుండి శని వక్రగతిలో సంచారం వల్ల నాలుగు నెలలు కొన్ని హఠాత్పరిణామాలు, ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. దైవ బలం మీకు తోడుగా నిలుస్తుంది.

ద్వితీయార్ధంలో వివాహ యత్నాలు కలసి వస్తాయి.

చైత్రం, వైశాఖం, ఆషాఢం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

పరిహారాలు…నిత్యం హనుమాన్‌ ఛాలీసా, ఆదిత్య హృదయం పఠనం చేయాలి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

వీరికి ఆదాయం –14, వ్యయం–11, రాజపూజ్యం 5, అవమానం–1 గా ఉంటుంది.

వీరికి ఈ ఏడాది సమస్థాయిలో ఫలితాలు ఉంటాయి.

గురువు ఏప్రిల్‌ వరకు అత్యంత శుభుడు. తదుపరి సాధారణ ఫలితాలు ఇస్తాడు.

అలాగే, శని మొత్తమంతా శుభఫలితాలు ఇస్తాడు. రాహుకేతువులు అక్టోబర్‌నుండి శుభదాయకమైనవిగా ఉంటాయి.

హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు కొన్ని పునఃపరిశీలించుకోవలసి ఉంటుంది.

సౌఖ్యం కోసం అధిక మొత్తంలో ధనఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మీకు అనుకూలంగా మారతాయి.

ద్వితీయార్ధంలో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు తిరిగి కొనసాగిస్తారు. అలాగే, పెద్ద వాహనాలు కొనుగోలు చేసే వీలుంది.

ధార్మిక సంస్థలు, కార్యక్రమాలకు విరివిగా విరాళాలు అందజేస్తారు.

ప్రయత్న లోపం లేకుండా విద్యార్థులు చేసే కృషి ఎంతో ఉపకరిస్తుంది. వారికి విశేష యోగదాయకమైన కాలమని చెప్పాలి.

ఇతరుల పట్ల అణకువగా, సామరస్యంగా మెలుగుతూ కార్యాలను చక్కదిద్దుకుంటూ వెళ్లడం ఉత్తమం.

ప్రధమార్థంలో ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించి ఖర్చులకు సిద్ధపడాలి. అయితే క్రమేపీ స్వస్థత చేకూరుతుంది.

ఇతర దేశాలకు ప్రయాణాలు సాగిస్తారు. కొందరికి విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు రావచ్చు.

కళాకారులకు ఈ ఏడాది అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి. వీరిపై పడిన అభాండాల నుండి బయటపడతారు.

వ్యాపార, వాణిజ్యవేత్తలు తమ సంస్థల విస్తృతి కోసం మరింత కృషి చేస్తారు. పెట్టుబడులకు ఎటువంటి లోటు లేకుండా జరిగిపోతుంది. మరో వైపు లాభాలు కూడా రెట్టింపు కాగల అవకాశం.

ఉద్యోగస్తులు తమపై పడిన భారాన్ని తగ్గించుకునేందుకు తాపత్రయపడతారు. కొందరికి విశేష పేరు రాగలదు. సహచరులు అందించిన నమ్మకం వీరిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది.

రాజకీయవేత్తలు, పారిశ్రామిక రంగం వారి చిరకాల కోరిక నెరవేరవచ్చు. అయితే ప్రధమార్థంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

వివాహాది శుభకార్యాలు ద్వితీయార్థంలో కలసివస్తాయి.

వ్యవసాయదారులు మునుపటి కంటే లాభపడతారు.

వైద్యులు, సాంకేతిక రంగంలోని వారిలో మరింత భరోసా ఏర్పడుతుంది.

మహిళలకు యోగదాయకంగా గడుస్తుంది. కొంత కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు తీరతాయి.

జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు కలిసి వచ్చేవి. మిగతావి సామాన్యం.

వీరు అక్టోబర్‌ వరకూ రాహు, కేతువులకు జపాలు వంటి పరిహారాలు చేయాలి. అలాగే, దుర్గామాతకు ఎక్కువగా పూజాదికాలు నిర్వహించాలి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

వీరికి ఆదాయం –2, వ్యయం–11, రాజపూజ్యం–2 అవమానం–4 ఉంటుంది.

వీరికి గ్రహాలన్నీ సంవత్సరమంతా అనుకూలమే.

వీరు ఏ కార్యక్రమం చేపట్టినా వెనుదిరగకుండా విజయాలు సాధిస్తారు.

మీరు వద్దన్నా కొందరు ఆప్తులు సహాయపడతారు.

కొన్ని కలలు నిజం చేసుకుంటారు.

ఆదాయం గతంకంటే మరింతగా మెరుగుపడుతుంది.

రావలసిన బాకీలు చాలా వరకూ వసూలవుతాయి.

తరచూ శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

మీ పట్ల ద్వేషంతో ఉన్న వారు కూడా స్నేహహస్తం అందిస్తారు.

ఆస్తి వ్యవహారాలలో తుది ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

వాహనాలు, ఇళ్లు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

వివాహ యత్నాలు ఫలించి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

తండ్రి తరఫు నుండి ధన, ఆస్తి లాభ సూచనలు ఉండవచ్చు.

నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు దక్కే అవకాశం.

ఒక ఊహించని వ్యక్తి ద్వారా మీకు మేలు జరుగుతుంది.

వ్యాపారాలలో పెట్టుబడులకు ఢోకాలేదు. లాభాలు విశేషంగా అందుతాయి. ముఖ్యంగా ఆయిల్, ఇనుము, మత్స్య, వ్యాపారాలు మరింత లాభిస్తాయి.

ఉద్యోగాలలో మీ పై మోపబడిన అభియోగాలు తొలగుతాయి. ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. పదోన్నతులు, తదనంతరం బదిలీలు ఉంటాయి.

పారిశ్రామిక, సాంకేతికవర్గాల వారు విజయాలు సాధిస్తారు. పడిన శ్రమ వృథా కాదు.

వైద్యులు, న్యాయవాదులు, పరిశోధకులకు శుభదాయకమే.

కళాకారుల సుదీర్ఘ ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి. వీరి సంకల్ప బలం ఫలితంగా శుభదాయకంగా ఉంటుంది. గతంలో చేజారిన అవార్డులు దక్కించుకుంటారు.

వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభదాయకమే.

రాజకీయవర్గాలకు ద్వితీయార్ధంలో కొన్ని పదవులు వరించవచ్చు.

విద్యార్థులు శ్రమ పడ్డా ఆశించిన ఫలితాలే దక్కుతాయి. కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.

మహిళలకు ఆనందోత్సాహల మధ్య సంతోషదాయకంగా గడుపుతారు.

తరచూ కొద్దిపాటి రుగ్మతలు ఇబ్బంది కలిగించవచ్చు. అయితే వెనువెంటనే ఉపశమనం లభిస్తుంది.

చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్య మాసాలు విశేషంగా కలసి వస్తాయి. మిగతావి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

వీరు ప్రతి శనివారం సుందరకాండ పారాయణ చేయడం మంచిది.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

వీరికి ఆదాయం –11 వ్యయం–8, రాజపూజ్యం–5 అవమానం–4 గా ఉంటుంది.

ఈ రాశి వారి పై అష్టమశని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేవలం గురు బలమే వీరికి శ్రీ రామరక్ష అని చెప్పవచ్చు. అలాగే రాహు, కేతువులు కూడా సమపాళ్లలో ఫలితాలు ఇస్తారు.

కొన్ని విషయాలలో భావోద్వేగాలకు లోనవుతారు. అయితే పుణ్యక్షేత్రాల సందర్శనంతో ఉపశమనం కలుగుతుంది.

బంధువులు, కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.

అష్టమ శని ఫలితంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉండాలి. అలాగే, ప్రతి కార్యక్రమంలోనూ మరింత జాగ్రత్తలు పాటించాలి.

ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా నష్టపోయే అవకాశాలున్నాయి.

గురు బలం వల్ల ఆదాయానికి లోటు లేకుండా జీవితాన్ని నడిపిస్తారు. అలాగే, శుభకార్యాలకు ఖర్చులు చేయాల్సి వస్తుంది.

చర, స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలలో చురుకుదనం కనిపిస్తుంది. మీ ప్రయత్నాలకు మిత్రుల నుండి సహాయసహకారాలు అందుతాయి.

వ్యాపార, వాణిజ్యవేత్తలు కొత్త సంస్థల ఏర్పాటును విరమించడం మంచిది. ఉన్నవాటితోనే సంతృప్తి చెందడం అవసరం. అలాగే, లాభాలు ఆశించినమేర కనిపించవు.

బ్యాంకు రుణాలు వంటి వాటి వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.

ఉద్యోగులకు మరింత పనిభారంతో పాటు, పైస్థాయి వారి అజమాయిషీ పెరుగుతుంది. ద్వితీయార్ధంలో పదోన్నతులు తద్వారా బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా ముందుకు సాగితే అనుకున్న విజయాలు సాధించవచ్చు. వీరికి విరివిగా విదేశీ పర్యటనలు సాగిస్తారు.

రాజకీయవర్గాలకు మొదట్లో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నా ద్వితీయార్థంలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

కళాకారులు ఈ సంవత్సరం కొంత భిన్నమైన వైఖరితో అందరినీ ఆకట్టుకుంటారు. ఏ చిన్న అవకాశమైనా వదులుకోకుండా మౌనంగా స్వీకరించడం మంచిది.

రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. అనుకున్న పెట్టుబడుల్లో కొంత జాప్యం తప్పదు. పంటల పరిరక్షణకు తీసుకునే చర్యల ద్వారా అధిక వ్యయం.

విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం అంతంత మాత్రమే. అయితే విద్యాకారకుడైన గురువు అనుకూలస్థితి వీరికి ఉపకరిస్తుంది.

న్యాయ, వైద్య, పరిశోధనారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు.

చైత్రం, వైశాఖం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలిస్తాయి. మిగతావి సాధారణంగా ఉండవచ్చు.

వీరు శనికి తైలాభిషేకం, జపాలు చేయించాలి. అలాగే, ఆంజనేయ స్వామిని విరివిగా పూజించడం మంచిది.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

వీరికి ఆదాయం –14, వ్యయం–2, రాజపూజ్యం–1 , అవమానం–7 గా ఉంటుంది.

వీరు గురు బలం కలిగి ఉంటారు. ఇక శని,అక్టోబర్‌ నుండి రాహు, కేతువులు అనుకూలించరు.

ఆర్థికంగా ఉన్నతస్థితి పొందినా ఏదో ఖర్చు ఎదురవుతూనే ఉంటుంది.

విద్యాధికులై ఎంతటి పోటీపరీక్షలోనైనా అవలీలగా విజయం సాధిస్తారు. ఇతరులకు సలహాలు ఇచ్చే స్థాయికి చేరుకుని ఉత్సాహంగా గడుపుతారు.

వివాహాది శుభకార్యాలు నిర్వహణపై సంబంధిత వ్యక్తులతో చర్చలు సాగిస్తారు.

మీ శుభ సంకల్పాలు నెరవేరే సమయం. అయితే కొంత శ్రమ తప్పకపోవచ్చు.

ఇంటి నిర్మాణాలు ద్వితీయార్ధంలో కలసివస్తాయి.

శని ప్రభావం, అక్టోబర్‌ నుండి రాహు, కేతువుల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు మరింత అప్రమత్తంగా మెలగాలి. త్వరితగతిన వైద్యసేవలు పొందడం మంచిది.

భార్యాభర్తల మధ్య కలహాలు తీవ్రంగా మారి కొంత ఎడబాటు తప్పకపోవచ్చు.

మీతో సన్నిహితంగా మెలిగిన వారై శత్రువులుగా మారి ఇబ్బందులు పెట్టేందుకు యత్నిస్తారు. ఎప్పటికప్పుడు వీటిపై దృష్టి అవసరం.

వ్యాపార, వాణిజ్యవేత్తలు ఎంత కష్టపడినా మీ అంచనాలకు తగినంత లాభాలు అందుకోలేరు. పెట్టుబడుల్లోనూ భాగస్వాములు సహకరించకపోవచ్చు.

ఉద్యోగస్తులు విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, కర్తవ్యాలు నెరవేరుస్తూ ముందుకు సాగాలి.

రాజకీయవేత్తలు, పారిశ్రామికవర్గాల వారు తమకు తామే సమస్యలు సృష్టించేకునే వీలుంది. తొందరపాటు వీడడం మంచిది.

వైద్యులు, శాస్త్రవేత్తలు గుర్తింపు పొందినా ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటారు.

కళాకారులకు పరీక్షా సమయం. వీరు తీసుకునే నిర్ణయాలపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

వ్యవసాయదారులకు మొదటి పంట కలసి వస్తుంది.

మహిళలు కుటుంబ సభ్యుల వైఖరితో కొంత విసుగుచెంది మౌనం పాటిస్తారు.

చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు సానుకూలం. మిగతావి సాధారణంగా ఉంటాయి.

వీరు శనీశ్వరునికి పరిహారాలు. రాహు కేతువులకు అక్టోబర్‌నుండి పరిహారాలు చేయాలి.

అలాగే, దుర్గాదేవి స్తోత్రాలు, ఆంజనేయ దండకం పఠించాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

వీరికి ఆదాయం –2, వ్యయం–11 రాజపూజ్యం–4 అవమానం–7 గా ఉంటుంది.

వీరికి శని మినహా గ్రహాల స్థితిగతులు అంతగా అనుకూలం కాదు.

గురువు ఏప్రిల్‌నుండి అష్టమ స్థితి సంచారం, రాహువుతో కలయిక మరింత క్లిష్టంగా ఉండే అవకాశం. ఇక శని సంచారం శుభ ఫలితాలు ఇస్తుంది.

మొత్తం మీద వీరు కొన్ని శుభాలు పొందినా అధికంగా ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుంది.

నిరుద్యోగ యువతకు శుభ పరిణామాలు. ఉద్యోగలాభం.

ఆదాయపరంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నా ఏదో విధంగా అవసరాలు తీరతాయి. అయితే అప్పులు కూడా చేస్తారు.

బంధువులు, స్నేహితుల మనోభావాలను గుర్తించి మసలుకోవడం అవసరం. ఎవరికీ ఇబ్బంది కలిగించని విధంగా నిర్ణయాలు తీసుకోండి.

ఒక పరిచయస్తుని ద్వారా అందిన సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది.

బియ్యం మిల్లులు, ఫైనాన్స్‌రంగంలోని వారికి అనుకూల పరిస్థితులు. వీరికి అన్ని విధాలా కలసి వస్తుంది.

ఇంటి నిర్మాణాల్లో జాప్యం లేకుండా పూర్తికి కృషి చేస్తారు.

ఏప్రిల్‌ – అక్టోబర్‌ మధ్య కాలంలో అష్టమంలో గురుఛండాల యోగం వల్ల ప్రతి వ్యవహారంలోనూ తొందరలేకుండా ముందుకు సాగాలి.

ఆరోగ్యం పై అత్యధిక శ్రద్ధ వహించడం మంచిది. ముఖ్యంగా శిరస్సు, ఉదరం, నరాల బలహీనత వంటి రుగ్మతలు బాధపెట్టవచ్చు.

వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలు అందుకున్నా ఏదో ఒక సమస్య వెంటాడుతునే ఉంటుంది. భాగస్వాములతోనే విభేదాలు రావచ్చు.

ఉద్యోగస్తులు విధుల పట్ల అప్రమత్తంగా మెలుగుతూ చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. వీరిపై నిఘా పెరిగే సూచనలు.

పారిశ్రామికవేత్తలు, రాజకీయవర్గాలు సమస్యలతోనే గడుపుతారు. మధ్యలో కొంత ఆశలు చిగురించినా అంతగా సంతృప్తినివ్వవు.

కళారంగం వారు అవకాశాలు చేజేతులా పోగొట్టుకుంటారు. ఇతరుల విషయాలలో జోక్యం వల్ల విమర్శలు ఎదుర్కొంటారు.

సాంకేతిక రంగం, వైద్యులు, శాస్త్రవేత్తలకు కొంతలో కొంత నయంగా ఉంటుంది.

వ్యవసాయదారులకు రెండు పంటలూ సామాన్యంగా ఉంటాయి.

విద్యార్థులు శ్రమతో కొన్ని విజయాలు అందుకుంటారు.

మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.

జ్యేష్ఠం, ఆషాఢం, మార్గశిరం, పుష్యమాసం అనుకూలం. మిగతావి సాధారణంగా ఉంటాయి.

వీరు శని, గురువు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం మంచిది.

ఇక సుందరకాండ పారాయణ, చండీ పారాయణ ఊరటనిస్తాయి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

వీరికి ఆదాయం –14, వ్యయం–11, రాజపూజ్యం–7, అవమానం–7 గా ఉంటుంది.

ఏప్రిల్‌ నుండి గురుసంచారం, అక్టోబర్‌నుండి రాహువు సంచారం అనుకూలం. శని సంచారం మిశ్రమంగా ఉంటుంది.

చిత్రవిచిత్రమైన రీతిలో వ్యవహారాలు చక్కదిద్దుతారు.

గురు బలం వల్ల అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది.

పరపతి, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.

శ్రమాధికమైనా లెక్కచేయక కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా విశేషంగా అభివృద్ధి కనిపిస్తుంది.

దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఊరట చెందుతారు.

ఉద్యోగార్ధులు ఉద్యోగాలు దక్కించుకుంటారు.

ఇంట శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఖరీదైన వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు.

శనిసంచారం కొంత ప్రతికూలతగా ఉండవచ్చు.

బంధువులతో అకారణంగా విభేదాలు రావచ్చు. అలాగే, సంతానరీత్యా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి.

ఈ రాశికి చెందిన అవివాహితులు కొందరికి ప్రేమ వివాహాలు జరుగవచ్చు.

కొన్ని న్యాయపరమైన సమస్యలు తీరతాయి.

విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. మరింత శ్రద్ధ అవసరం.

వ్యాపార, వాణిజ్యవేత్తలు పాత ఒప్పందాలు రద్దు చేసుకుని కొత్త భాగస్వాములతో జతకడతారు. లాభనష్టాలు సమతుల్యంగా ఉంటాయి.

ఉద్యోగస్తులకు విశేష గుర్తింపు లభిస్తుంది. వీరికి పదోన్నతులు లభించవచ్చు.

పారిశ్రామిక, శాస్త్రవేత్తలకు శుభదాయకమైన కాలం.

కళాకారులకు మరిన్ని అవకాశాలు అవలీలగా దక్కుతాయి.

రాజకీయవేత్తలకు ప్రజాదరణ పెరుగుతుంది. వీరికి అనూహ్యమైన ఆహ్వానాలు రాగలవు.

వ్యవసాయదారులు రెండుపంటలూ లాభపడతారు.

ఆషాఢం, శ్రావణం, మార్గశిరం, మాఘమాసాలు సానుకూలమైనవి. మిగతావి సాధారణంగా ఉంటాయి.

వీరు శనీశ్వరునికి, రాహువునకు పరిహారాలు చేయించుకోవడం మంచిది. అలాగే, నిత్యం శివనామ స్మరణ చేయాలి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

వీరికి ఆదాయం –5, వ్యయం–5, రాజపూజ్యం –3 అవమానం–3 గా ఉంటుంది.

వీరికి అర్ధాష్టమ శని ప్రభావం మినహా, మిగతా గ్రహాలన్నీ అనుకూల ఫలితాలు ఇస్తాయి. గురుని శుభత్వం వల్ల ఆర్థిక రంగంలో విశేష ప్రగతి ఉంటుంది.

సంతానపరంగా సౌఖ్యం, వారికి ఉద్యోగ లాభాలు సంతోషం కలిగిస్తాయి.

మీ సామర్ధ్యాన్ని, నైపుణ్యతను పదిమందీ గుర్తించే సమయం.

ఆపదలో ఉన్న వారు కోరిందే తడవుగా అన్ని విధాలా చేయూతనిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది.

బంధువులతో ప్రేమానుబంధాలు పెరుగుతాయి.

చర, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

ఎన్నడూ ఊహించని వారితో పరిచయాలు ఏర్పడతాయి.

గృహం, వాహనాలు కొంటారు.

రాహుకేతువుల ప్రభావం మిశ్రమ ఫలితాలు అందిస్తుంది.

ఇక అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మనోనిబ్బరం తగ్గుతుంది.

చేసే పనుల్లో ఆటంకాలు, జాప్యం.

ఏ విషయంలోనూ ఏకాగ్రత లేకపోవడంతో ఇబ్బందిపడతారు.

ఆరోగ్య విషయాలలో అత్యంత జాగరూకత పాటించాలి.

విద్యార్థులకు అవకాశాలు అసంతృప్తి కలిగిస్తాయి.

వ్యాపార, వాణిజ్యవేత్తలకు ప్రధమార్ధంలో అధిక లాభాలు, ద్వితీయార్థంలో మిశ్రమంగా ఉంటుంది. పెట్టుబడులకు ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు.

ఉద్యోగస్తులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నా ఆకస్మిక బదిలీలు తప్పకపోవచ్చు, లేదా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు సొంత ఆలోచనలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

కళాకారులు తమ ప్రతిభను చాటుకునే సమయం ఆసన్నమైంది.

కొన్ని పురస్కారాలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి.

వ్యవసాయదారులు రెండుపంటలపై లాభాలు గడిస్తారు.

వైద్య, శాస్త్ర రంగాల వారు విశేష గుర్తింపుతో పాటు, ప్రజ్ఞాపాటవాలు చాటుకుంటారు.

శ్రావణం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి మిశ్రమంగా ఉంటాయి.

వీరు శనీశ్వరునికి, రాహుకేతువులకు పరిహారాలు చేయించాలి. ఇక ఆంజనేయ దండకం పఠనం, నృసింహస్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తాయి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

వీరికి ఆదాయం –8 వ్యయం–11, రాజపూజ్యం–6 , అవమానం–3 గా ఉంటుంది.

వీరికి అక్టోబర్‌ నుండి అర్ధాష్టమ రాహుదోషం మినహా మిగతా గ్రహాలన్నీ అనుకూలం.

వీరికి అన్ని విధాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది.

ఆర్ధికంగా విశేషంగా కలసివస్తుంది. ఎంతోకాలంగా ఒక వ్యక్తి వద్ద ఉండి పోయిన సొమ్ము అందవచ్చు.

విరివిగా దానధర్మాలు, విరాళాలు అందిస్తారు.

సంతాన అభివృద్ధితో ఉత్సాహంగా గడుపుతారు. వారి మనస్సుకు నచ్చిన నిర్ణయాలు తీసుకుని మీ ప్రేమాభిమానాలు చాటుకుంటారు.

బంధువుల తోడ్పాటుతో ఎటువంటి కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు.

శని సంచారం కూడా లాభిస్తుంది.

కొత్త నిర్మాణాలు చేపట్టి చురుగ్గా సాగిస్తారు.

కుటుంబ విషయాలలో చిక్కులు, సమస్యలు వీడతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తరచూ తీర్థయాత్రలు పయనమవుతారు.

మీలో పట్టుదల, ధైర్యసాహసాలు పెరిగి కార్యదీక్షకు సమాయత్తమవుతారు.

నూతన ఉద్యోగాలు లభిస్తాయి.

విద్యా సంస్థల నిర్వహాకులకు గతేడాది కంటే మరింత ప్రగతిదాయకంగా ఉంటుంది.

విద్యార్థులకు ఏ పరీక్షలోనైనా విజయమే సిద్ధిస్తుంది.

ఇంట శుభకార్యాలు జరిపించడంలో ముందుంటారు.

ప్రధమార్ధంలో ఆశ్చర్యకరమైన ఒక సమాచారం మనస్సును హత్తుకుంటుంది.

స్థిరాస్తులను వృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేస్తారు.

సామాజిక గౌరవం పెరిగి కీర్తిగడిస్తారు.

వాహనాలు, నగలు కొనుగోలు చేస్తారు.

వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీల్లో దూసుకువెళతారు. ముఖ్యంగా ఐరన్, సిమెంట్, నిర్మాణరంగాల వారికి విశేషంగా లాభిస్తుంది.

ఉద్యోగస్తులు ఈతి బాధలు, ఒత్తిడుల నుండి బయటపడతారు.

పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల చిరకాల నిరీక్షణ ఫలిస్తుంది. కొత్త సంస్థల ఏర్పాటు దిశగా సాగుతారు.

రాజకీయవేత్తలకు ఊహించని పదవీయోగం. ప్రజాదరణ పెరుగుతుంది.

కళాకారులు అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. కొందరికి అవార్డులు సైతం రావచ్చు.

వ్యవసాయదారులకు రెండు పంటలలోనూ లాభాలు అందుతాయి.

వైద్య, శాస్త్ర రంగాల వారు తమ నిబద్ధతను చాటుకుంటారు.

మహిళలకు మానసిక ఉల్లాసం పెరుగుతుంది.

అక్టోబర్‌ నుండి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే, తల్లి తరఫు వారితో వివాదాలు. మానసిక ఆందోళన. స్థాన మార్పులు.

చైత్రం, వైశాఖం, భాద్రపదం, ఆశ్వయుజం, మాఘ మాసాలు సానుకూలం. మిగతావి సాధారణంగా ఉంటాయి.

వీరు చండీ పారాయణ పఠించాలి. అలాగే, రాహు జపం, హోమం నిర్వహించడం మంచిది.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)

వీరికి ఆదాయం –11, వ్యయం–5, రాజపూజ్యం–2 , అవమానం–6 గా ఉంటుంది.

వీరికి ఏప్రిల్‌ నుండి అర్థాష్టమంలో గురువు సంచారం. అలాగే, అక్టోబర్‌ వరకు అర్ధాష్టమ రాహువు, ఏల్నాటి శని ప్రభావం మీ పై కనిపిస్తుంది.

ఏ పని చేపట్టాలన్నా ఏకాగ్రతి లోపించి మధ్యలో విరమిస్తుంటారు.

మానసికంగా ఆందోళన తద్వారా చికాకులు.

కుటుంబ సభ్యులు, మిత్రులతో స్నేహపూర్వకంగా మసలుకుంటూ వివాదాలకు దూరంగా ఉండాలి.

తరచూ దూర ప్రయాణాలతో అలసట చెందుతారు.

ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.

తల్లి ఆరోగ్యం పై కూడా శ్రద్ధ చూపాలి.

ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి అప్పుల కోసం అన్వేషణ సాగిస్తారు.

ఎంత తెచ్చినా లేనిపోని ఖర్చులతో ఇబ్బంది పడతారు.

గురుసంచారం మిశ్రమ ఫలాలు ఇస్తుంది.

కొత్త ఇంటి నిర్మాణాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

రియల్‌ ఎస్టేట్‌ రంగం వారు ఎక్కువగా లాభపడతారు.

కుటుంబంలో కొన్ని సమస్యలు తీరే సమయం.

తల్లిదండ్రుల నుండి స్థిరాస్తి లేదా కొంత ధనలాభాలు ఉండవచ్చు.

ఇక శని, మరో వైపు రాహు ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ భయాందోళనలు, ఆలోచనల పై ఒక నిర్ణయానికి రాలేరు.

మనోనిబ్బరం పెంచుకుని ముందుకు సాగడం ఉత్తమం.

నిరుద్యోగులు ఎంత కృషి చేసినా చిన్నపాటి ఉద్యోగాలతోనే సరిపెట్టుకోవాలి.

వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యమైన లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడరాదు.

ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలున్నాయి. అలాగే, విధుల పట్ల అంకితభావంతో ఉండడం మంచిది.

పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలకు లేనిపోని సమస్యలు ఎదురుకావచ్చు.

కళాకారులు అందిన మంచి అవకాశాలు కూడా కోల్పోతారు.

విద్యార్థులకు శ్రమాధిక్యంతో ఫలితాలు అందుతాయి.

రాజకీయవేత్తలకు పరీక్షా కాలమే. కొన్ని విచారణలు ఎదుర్కొనే సమయం.

ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడం మంచిది.

వ్యవసాయదారులు ఉత్పత్తులు పెరిగినా తగిన గిట్టుబాటు లేక ఇబ్బందులు పడతారు.

మహిళలకు కుటుంబ సభ్యులతో మాటపడతారు.

అక్టోబర్‌ నుండి రాహు సంచారం కొంత ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తీరతాయి.

వైశాఖం, జ్యేష్ఠం, ఆశ్వయుజం, కార్తీక మాసాలు విశేషంగా కలసివస్తాయి. మిగతావి సాధారణంగా ఉంటాయి.

వీరు శని, రాహువులకు జపాలు, ఇతర పరిహారాలు చేయాలి. అలాగే, గురునికి కూడా కొద్దిపాటి పరిహారాలు అవసరం.

ఆంజనేయ దండకం, దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తాయి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

వీరికి ఆదాయం–11 , వ్యయం–5, రాజపూజ్యం–2 , అవమానం–6 గా ఉంటుంది.

గురు సంచారం అంత కలసి రాదు. జన్మరాశిలో శని సంచారంతో ఏల్నాటి శని ప్రభావం కలిగినా కుంభరాశి కావడం వల్ల మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఇక రాహువు అక్టోబర్‌వరకూ శుభత్వం ఇస్తాడు. మొత్తానికి వీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొవలసి ఉంటుంది.

కుటుంబంలో మీ మాటను కాదనలేకపోయినా వారిలో అసంతృప్తి కనిపిస్తుంది.

వివాదాలకు మరింత దూరంగా ఉండడం మంచిది.

ఆర్థికంగా కొంత నియంత్రణ, ఖర్చులు అదుపు చేసుకోవడం మంచిది.

ఎక్కువ శ్రమ పడితే కొంత ఫలితం కనిపిస్తుంటుంది.

శని సంచారం ఈ ఏడాది అనుకూలం.

ఆచితూచి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి.

జూన్‌, నవంబర్‌ మధ్య మాత్రం శని తీవ్ర ప్రభావం చూపవచ్చు.

ముఖ్యంగా ఈకాలంలో ధనిష్ఠ, శతభిషం నక్షత్రాల వారు మరింత అప్రమత్తంగా మెలగాలి.

వాహనాలు విషయంలో తొందరపాటు అసలు వద్దు.

రాహుకేతువులు ప్రథమార్థంలో శుభదాయమైన ఫలితాలు ఇస్తారు.

నిరుద్యోగులు తమ అన్వేషణ తీవ్రతరం చేసి ఎట్టకేలకు విజయం సాధిస్తారు.

స్థిరాస్తులు కొనుగోలులో మొదట్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి మీకే సొంతం కాగలవు.

వ్యాపార, వాణిజ్యవేత్తలు కృషికి తగిన లాభాలు పొందుతారు. ఇనుము, ఐరన్, బంగారం వ్యాపారులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

ఉద్యోగస్తులు బాధ్యతలు పెరిగి కొంత విరక్తి చెందే అవకాశాలున్నాయి. అయితే పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంచుకుని సాగితే విజయాలు సిద్ధిస్తాయి.

పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తల శ్రమ ఇతరులకు ఉపయోగపడుతుంది.

రాజకీయవేత్తలపై ఒత్తిడులు పెరుగుతాయి. వీరికి కొన్ని పదవులు సైతం చేజారవచ్చు.

కళాకారులకు ద్వితీయార్థంలో అనుకూలిస్తుంది.

వ్యవసాయదారులు మనోనిబ్బరంతో నష్టాలు అధిగమిస్తారు.

విద్యార్థులకు శ్రమ మరింత పెరుగుతుంది.

ఆరోగ్యం పై నిర్లక్ష్యం వీడి ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి.

చైత్రం, జ్యేష్ఠం, కార్తీకం, మార్గశిర మాసాలు అనుకూలించగా, మిగతావి సామాన్యఫలితాలు ఉంటాయి.

వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, గురునికి జపాలు, రాహుకేతువులకు పరిహారాలు చేయడం మంచిది.

సుబ్రహ్మణ్యారాధన శుభకరం.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

వీరికి ఆదాయం –8, వ్యయం–11, రాజపూజ్యం–1, అవమానం–2 గా ఉంటుంది.

వీరికి ఏల్నాటి శని ప్రారంభమైనా మూర్తిమంతం చేత శుభకారకుడే. అలాగే, ధనస్థానంలో గురు సంచారం విశేష లాభదాయకంగా ఉంటుంది.

కీర్తిప్రతిష్ఠలు పెరిగి సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

అన్ని వ్యవహారాలలోనూ చురుగ్గా అడుగులు వేస్తారు.

ఆత్మవిశ్వాసానికి పట్టుదల తోడై మీరు అనుకున్నది సాధిస్తారు.

మీ మంచితనం ఇతరులను సైతం ప్రభావితం చేస్తుంది.

ధనాదాయానికి లోటులేకున్నా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి.

ఆరోగ్యం మరింత మెరుగుపడి ఉత్సాహం పెరుగుతుంది.

శత్రువులు కూడా మీపట్ల సానుకూలత వ్యక్తం చేస్తారు.

మీలోని ప్రతిభకు తోడు వాగ్ధాటితో విజయాలు సాధిస్తారు.

బంధువులు, ఆత్మీయులతో సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపడతాయి.

సంతానం విషయంలో మీ ఆశలు నెరవేరతాయి.

విద్యార్థులకు నూతనోత్సాహం, ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు.

అక్టోబర్‌ నుండి రాహు,కేతువుల ప్రభావం వల్ల కొత్త సవాళ్లు, సమస్యలు ఎదురై కొంత ఇబ్బంది పడతారు.

చర, స్థిరాస్తుల కొనుగోలు పై కొంత సందిగ్ధత నెలకొన్నా ద్వితీయార్థంలో సత్ఫలితాలు పొందుతారు.

అవసరమైతేనే ప్రయాణాలు సాగించడం మంచిది.

ఆరోగ్యం పై కొంత శ్రద్ధ అవసరం.

వ్యాపార, వాణిజ్యవేత్తల యత్నాలు సామాన్యంగా ఫలిస్తాయి. వీరు భాగస్వాముల చర్యలతో కొంత కలత చెందుతారు. కొత్త పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు.

ఉద్యోగస్తులు విధులలో నిబద్ధత చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు.

పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి.

రాజకీయవర్గాల వారు కొన్ని వివాదాలలో చిక్కుకున్నా మనోధైర్యంతో బయటపడే అవకాశం.

కళాకారులు, వైద్య రంగాల వారికి ద్వితీయార్థంలో శుభదాయకంగా ఉంటుంది.

వ్యవసాయదారులకు రెండో పంట అనుకూలిస్తుంది.

మహిళలు లక్ష్యాలు సాధించే దిశగా ముందడుగు వేస్తారు.

వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మార్గశిర మాసాలు విశేషంగా కలసి వస్తాయి. మిగతావి సామాన్యం.

ఇక వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, రాహుకేతువులకు పరిహారాలు చేయడం మంచిది.

రుద్రాభిషేకం, నరసింహస్వామి ఆరాధన మంచిది.

Ugadi Horoscope content by Vakkantham Chandramouli’s Janmakundali.com

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Categorized in: