మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. ధర్మము ఎలా ఉంటుంది అంటే .. అందుకు నిదర్శనంగా శ్రీరాముడిని చూపించవచ్చని సాక్షాత్తు వాల్మీకి మహర్షి సెలవిచ్చారు. అలాంటి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రమే “భద్రాచలం”. శ్రీరాముడు వెలసిన అత్యంత శక్తిమంతమైన .. ప్రాచీనమైన క్షేత్రాలలో ఇది ఒకటి. అడుగుపెట్టడంతోనే రాముడు అనుగ్రహించే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలలో ఇది ఒకటి. అలాంటి ఈ క్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగొందుతోంది.
శ్రీరాముడి సాక్షాత్కారం కోసం గోదావరీ నదీ తీరంలో భద్రుడు కొన్ని ఏళ్లపాటు తపస్సు చేస్తూ ఉంటాడు. రామావతార పరిసమాప్తి అనంతరం శ్రీరాముడు తిరిగి శ్రీమహావిష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. అయినా భూలోకాన భద్రుడి తపస్సు కొనసాగుతూనే ఉంటుంది. ఆయన తపస్సు తీవ్రత వైకుంఠాన్ని తాకుతుంది. తన భక్తుడికి త్వరగా దర్శనం ఇవ్వాలనే ఆత్రుతలో స్వామివారు శంఖు చక్రాలను తారుమారుగా ధరించి శ్రీ మహావిష్ణువుగా భద్రుడి ఎదుట ప్రత్యక్షమవుతాడు. తనకి రామావతార దర్శన భాగ్యం కల్పించమని భద్రుడు ప్రార్ధిస్తాడు. అలాగే తన శిరస్సున సీతా లక్ష్మణ సమేతంగా కొలువై ఉండవలసిందిగా కోరతాడు.
స్వామి ఆ భక్తుడికి సీతాలక్ష్మణ సమేతంగా దర్శనం ఇవ్వడమే కాకుండా .. కొండగా మారిపోయిన భద్రుడి శిరస్సున కొలువవుతాడు. ఆ భక్తుడికి దర్శనం ఇచ్చినట్టుగానే ఇక్కడి శ్రీరాముడు .. విష్ణుమూర్తిలా నాలుగు భుజాలను కలిగి ఉంటాడు. శంఖు చక్రాలను తారుమారుగా ధరించే దర్శనమిస్తూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు శ్రీ రాముడిగా ఆవిర్భవించిన కారణంగానే ఇక్కడి స్వామివారిని “రామనారాయణుడు” అనే పేరుతోను భక్తులు కొలుస్తుంటారు. ఆ తరువాత కాలంలో ఈ మూర్తులు అడవిలోని ఆ కొండపై పూజభిషేకాలకు దూరంగా ఉండిపోతాయి.
అప్పుడు స్వామివారు “పోకల దమ్మక్క” అనే భక్తురాలి స్వప్న దర్శనమిచ్చి తన విగ్రహాల జాడను తెలియజేస్తాడు. అప్పుడు అది నిజామ్ నవాబు ఏలుబడిలో ఉన్న ప్రాంతం. ఆ ప్రభుత్వ ఆధీనంలో కంచర్ల గోపన్న తహశీల్దార్ గా ఉంటాడు. ఆయనకి స్వప్నంలో కనిపించిన రాముడు .. తనకి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు జరిపించవలసిందిగా ఆదేశిస్తాడు. నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న .. స్వామివారి ఆనతి మేరకు రంగంలోకి దిగుతాడు. పోకల దమ్మక్క సంరక్షణలో ఉన్న సీతారామలక్ష్మణులు దర్శనం చేసుకుంటాడు.
శ్రీరాముడి ఆలయ నిర్మాణ విషయాన్ని ఆ చుట్టుపక్కల గ్రామలవారందరికీ వివరించి, అందరి సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణాన్ని పూనుకుంటాడు. డబ్బు సరిపోకపోవడంతో ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను తాలూకు ధనాన్ని ఖర్చు చేస్తాడు. అదే డబ్బుతో స్వామివారికి .. అమ్మవారికి ఆభరణాలు చేయిస్తాడు. విషయం తెలుసుకున్న నవాబు ఆయనను గోల్కొండ కోటలోని కారాగారంలో బంధిస్తాడు. అప్పుడు రాముడు .. లక్ష్మణుడితో కలిసి వచ్చి లక్ష బంగారు మొహరీలు చెల్లించి గోపన్నను విడుదల చేయిస్తాడు. తాను రాముడికి దాసుడనని చెప్పుకున్న గోపన్న .. రామదాసుగానే చరిత్రలో నిలిచిపోయాడు.
విశేషమైన పర్వదినాల్లో ఇక్కడి స్వామివారికి ప్రత్యేకమైన ఉత్సవాలు .. సేవలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున ఇక్కడ జరిగే కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు .. పట్టు వస్త్రాలు సమర్పించబడతాయి. భద్రాచలానికి అన్ని ముఖ్య పట్టణాల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు .. ఈ చుట్టు పక్కల రామాయణ ఘట్టాలతో ముడిపడిన అనేక ప్రదేశాలను చూసి తరించవచ్చు.
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.