పరపురుషులను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్న ఆ స్త్రీ, తన పట్ల అజామీళుడు ఆసక్తిని చూపుతుండటం గమనిస్తుంది. తాను పుట్టిపెరిన వాతావరణం వేరు .. తనకి గల అలవాట్లు వేరు. అయినా తానంటే ఆయన ఇష్టపడుతుండటం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన అలవాట్లు .. అభిరుచుల గురించి తెలిసే ఆయన ముందుకురావడంతో, ఆయనతో కలిసి జీవించడానికి ఆమె సిద్ధపడుతుంది. అప్పటి నుంచి అజామీళుడు ఆమెతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటాడు.ఈ విషయం తెలిసి ఊళ్లో గుసగుసలు మొదలవుతాయి.

కొన్ని రోజుల తరువాత అజామీళుడి తల్లిదండ్రులకు ఈ విషయం తెలుస్తుంది. భార్యకు కూడా ఆయన సంగతి అర్థమవుతుంది. ఆమె ఆ విషయమై ఆయనను ఏమీ అడగదు. తప్పుచేసినవాడిగా తనముందు ఆయన నిలబడటం తాను చూడలేనని ఆమె అనుకుంటుంది. తల్లిదండ్రులు మాత్రం సున్నితంగా ఆ విషయాన్ని గురించి ఆయన దగ్గర ప్రస్తావిస్తారు. తమకి గల పరువు ప్రతిష్ఠలను గురించిన ఆలోచన చేయమని చెబుతారు. బంగారంలాంటి ఇల్లాలి మనసును బాధపెట్టొద్దని అంటారు.

అజామీళుడు తాను చేస్తున్నది తప్పు అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోతాడు. ఇంట్లోని వాళ్లంతా తనని దోషిలా చూస్తున్నారని అసహనానికి లోనవుతాడు. అప్పటి నుంచి ఇంటికి పోవడం మరింత తగ్గిస్తాడు. ఆయన ధోరణికి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతారు. భర్త ప్రేమానురాగాలకు .. చివరికి ఆయన సేవలకు కూడా దూరమైన భార్య కన్నీళ్లతో రోజులు వెళ్లదీస్తూ ఉంటుంది. కాలం గడిచిపోతుంటుంది .. అజామీళుడికి ఆ స్త్రీ వలన సంతానం కలుగుతుంది. ఆ పిల్లవాడికి ఆయన “నారాయణ” అనే పేరు పెడతాడు.

తను మనసు పడిన స్త్రీ .. ఆమెతో తాను కోరుకున్న జీవితం. దారి తప్పి నడుచుకుంటున్న తనని చూసి నలుగురూ నవ్వుకుంటున్నా పట్టించుకోని తీరుతో కాలం గడుస్తూ ఉంటుంది. భగవంతుడి పట్ల భక్తికీ .. పూజకు ఆయన దూరమై చాలాకాలమే అవుతుంది. అలాగే మునుపటి గౌరవ మర్యాదలకు తాను దూరమై కూడా చాలా కాలమే అవుతోంది. అంతేకాదు జీవించడంలో తాను ధర్మం తప్పేసి కూడా చాలాకాలమే అవుతోంది. తనకి అన్నీ తెలుస్తూనే ఉన్నాయి .. కానీ తాను ఆ స్థానం నుంచి దూరం కాలేకపోతున్నాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.