వేంకటేశ్వరస్వామి ప్రకృతి ప్రేమికుడిగా కనిపిస్తాడు. అందుకే చుట్టూ పచ్చదనం ఉన్న కొండలపై ఆయన ఎక్కువగా ఆవిర్భవిస్తూ ఉంటాడు. అలా స్వామివారు కొండపై వెలసిన మరో క్షేత్రమే “అమ్మపేట”. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పరిథిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఈ గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉండగానే దూరంగా కొండపై ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. సాధారణంగా కొండ అంటే అనేక బండరాళ్ల సముదాయంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా భారీస్థాయిలో ఉన్న కొన్ని బండరాళ్లతోనే ఈ కొండ ఏర్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఒక్కో బండరాయి పొడవును .. వెడల్పును ఒక చోట ఉండి మొత్తాన్ని చూడలేం. ఆ స్థాయిలో బండరాళ్లు ఉంటాయి. కొండపై భాగంలో చాలా పొడవైన బండరాయి వేదికగా .. మరో బండరాయి పైకప్పుగా ఉండగా ఆ మధ్యలో శయన ముద్రలో వేంకటేశ్వరస్వామి వెలిశాడు. వెలిగొండ వేంకటేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. వందల సంవత్సరాల క్రితం స్వామివారు ఒక భక్తుడికి స్వప్నంలో దర్శనమిచ్చి తాను ఇక్కడ వెలిసినట్టుగా ఆనవాళ్లు చెప్పాడట. అలా ఇక్కడి స్వామివారు వెలుగులోకి వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు.
ఇక ఈ కొండపైకి చేరుకోవడానికి మెట్లదారి మాత్రమే ఆధారం. మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా అటు .. ఇటు కావాలని కట్టిన గోడల మాదిరిగా బండరాళ్లే ఉండటం భగవంతుడి లీలావిశేషమే అనిపిస్తుంది. చుట్టూ పంటపొలాల మధ్య ఎవరో ప్రత్యేకంగా తెచ్చిపెట్టినట్టుగా ఈ కొండ ఒక్కటే కనిపిస్తుంది. ఈ కొండను కాస్త దూరం నుంచి పరిశీలనగా చేస్తే .. ఏనుగు ఆకారంలో కనిపిస్తుంది .. సరిగ్గా తల పైభాగంలో ఆలయం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంటుంది. ఇక ఇక్కడ ప్రత్యేకంగా విమానం ఆకారంలో ఒక శిల కనిపిస్తుంది. ఈ విమాన శిలపై స్వామివారు విహరిస్తారనేది భక్తుల నమ్మకం.
కొండ దిగువ భాగంలోనే స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించే మంటపం కనిపిస్తుంది. మరో వైపున స్వామివారికి కైంకర్యాలకు ఉపయోగించే తీర్థజలం దర్శనమిస్తూ ఉంటుంది. రెండు కొండరాళ్ల మధ్యలో వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే, భక్తులు వంగుతూ లోపలికి వెళ్లవలసి ఉంటుంది. శయన ముద్రలో ఉన్న స్వామివారి మూర్తి 6 అడుగులపైనే ఉంటాడు. ఆయన శయనించిన ప్రదేశం కూడా ఇరుకుగా కాకుండా విశాలంగానే ఉంటుంది. తులసిమాలలతో స్వామివారికి నిత్యం చేసే అలంకారం అద్భుతంగా ఉంటుంది.
సీతారాములు భద్రగిరికి వెళుతూ ఇక్కడ కొంతసేపు విశ్రమించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. అందుకు నిదర్శనంగా ఇక్కడ సీతమ్మవారి పాదాల ముద్రను చూపిస్తారు. సీతమ్మవారి పాదధూళిచే పవిత్రమైన కావడం వల్లనే ఈ క్షేత్రానికి “అమ్మపేట” అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ప్రతి ఏడాది “చైత్ర శుద్ధ పౌర్ణమి” రోజున స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అలాగే రథ సప్తమి రోజున స్వామివారికి ప్రత్యేక సేవలు జరుపుతారు. ఈ రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ధన్యులవుతుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన సకల శుభాలు చేకూరుతాయనేది భక్తుల విశ్వాసం.
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.