పరమశివుడు ఆవిర్భవించిన పరమపవిత్రమైన క్షేత్రాలలో పంచారామాలు .. పంచభూత క్షేత్రాలు దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటి పంచభూత క్షేత్రాలలో జంబుకేశ్వర ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. సదాశివుడు “జలలింగం”గా ఆవిర్భవించిన ఈ క్షేత్రం తమిళనాడులోని “తిరుచినాపల్లి”కి సమీపంలో వెలుగొందుతోంది. కావేరీ నదీ తీరంలోని ఈ క్షేత్రానికి “జంబుకేశ్వరం” అనే పేరు రావడానికి గల కారణంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం శంభుడు అనే ఒక మహర్షి శివుడిని గురించి ఈ ప్రదేశంలో కఠోర తపస్సును చేయడం ఆరంభించాడు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఆయన తపస్సుకు మెచ్చిన సదా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. స్వామి దర్శన భాగ్యం తనని నిత్యం కలిగేలా అనుగ్రహించమని ఆ మహర్షి కోరతాడు. అయితే తాను ఆ ప్రదేశంలోనే లింగ రూపంలో ఆవిర్భవిస్తాననీ, జంబూ వృక్షమై తనని నిత్యం దర్శించమని శివుడు అనుగ్రహిస్తాడు. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా కనిపించే జంబూ వృక్షమే ఆ మహర్షి అని స్థలపురాణం చెబుతోంది.

ఈ కారణంగానే ఈ క్షేత్రానికి జంబుకేశ్వరమనే పేరు వచ్చింది. జంబుకేశ్వర లింగం చుట్టూ నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. అందువల్లనే దీనిని జల లింగంగా చెబుతుంటారు. పొడవైన ప్రాకారాలు .. ఎత్తైన గోపురాలు .. విశాలమైన మంటపాలు ఇవన్నీ చూస్తే ఈ క్షేత్ర వైభవం ఎంతటిదో అర్థమవుతుంది. క్రీ.శ. 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆ తరువాత ఎంతోమంది రాజుల ఏలుబడిలో ఈ క్షేత్రం మరింతగా అభివృద్ధి చెందుతూ వచ్చిందనేది స్పష్టమవుతుంది.

ఇక్కడి ప్రాంగణంలోని మరో ప్రత్యేకమైన ఆలయంలో అఖిలాండేశ్వరి అమ్మవారు పూజలందుకుంటూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారు ఉగ్రరూపిణిగా ఉండటం గమనించిన ఆది శంకరులవారు ఆమెను శాంతమూర్తిగా మార్చినట్టు చెబుతారు. స్వామివారు ఇక్కడ లింగరూపంలో ఆవిర్భవించినప్పుడు అఖిలాండేశ్వరి అమ్మవారు ప్రత్యక్షంగా సేవించినట్టు స్థలపురాణం చెబుతోంది. అందువలన అర్చకులు ఇప్పుడు కూడా ఒక పూజా వేళలో స్త్రీ మాదిరి వస్త్రధారణ చేసుకుని ప్రత్యేకమైన పూజను నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన పూజను నిర్వహించే తీరు విశేషంగా ఉంటుంది.

ఒక వైపున ఆధ్యాత్మికత .. మరో వైపున చరిత్ర పెనవేసుకునిపోయిన ఈ క్షేత్రాన్ని దర్శించడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ శివరాత్రికి ప్రత్యేక ఉత్సవాలు .. సేవలు నిర్వహిస్తారు. ఆ రోజున స్వామివారి దర్శనం కోసం భక్తులు విశేషమైన సంఖ్యలో తరలి వస్తారు. ఇక్కడికి అత్యంత సమీపంలోనే శ్రీరంగం రంగనాథ స్వామి క్షేత్రం ఉంది. కావేరి నదీ తీరంలో శివకేశవులు అత్యంత సమీపంలో ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలుగా ఇవి విలసిల్లుతున్నాయి. ఎంతో వైభవాన్ని సంతరించుకున్న హరి హరుల క్షేత్రాలను వెంట వెంటనే దర్శించుకో గలగడం భక్తులు తమ భాగ్యంగా భావిస్తారు. భక్తిభావ పరిమళాలను ఆస్వాదిస్తూ తరిస్తారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి చేరుకోవడానికి బస్సు .. రైలు మార్గాలు ఉన్నాయి.

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.