అమృతం కోసం దేవతలు .. దానవులు ఎంతో శ్రమించారు. క్షీరసాగరం నుంచి విషం వెలువడగా దానిని నేరేడు పండులా చేసి పరమశివుడు తన కంఠాన నిలుపుకున్నాడు. ఇక మంథరగిరి పర్వతం సముద్ర గర్భంలోకి జారిపోకుండా శ్రీమహా విష్ణువు కూర్మ అవతారాన్ని ధరించి .. తన వీపు భాగాన్ని మోపు చేశాడు. అలా ఉద్భవించిన అమృతం అసురుల చేతికి చిక్కితే ప్రమాదమని భావించిన శ్రీమహావిష్ణువు .. మోహిని అవతారాన్ని ధరిస్తాడు. మోహిని సౌందర్యం చూసి ముగ్ధులైన అసురులు, ఆమె అందరికీ అమృతాన్ని సమానంగా పంచుతానని అంటే అంగీకరిస్తారు.
అలా అమృత కలశాన్ని చేజిక్కుంచుకున్న మోహిని, తన వయ్యారాలతో వాళ్ల దృష్టిని మరల్చి దేవతలకి మాత్రమే అమృతం దక్కేలా చేస్తుంది. మోహిని సౌందర్యం గురించి విన్న పరమశివుడు ఆమెను చూడడానికి అక్కడికి చేరుకుంటాడు. ఆయనను ఆటపట్టించాలనే ఉద్దేశంతో మోహిని వయ్యారాలు ఒలకబోస్తూ నడక వేగం పెంచుతుంది. ఇంతటి లావణ్యాన్ని కలిగిన ఈ స్త్రీ ఎవరై ఉంటారా అనుకుంటూ మోహినీని శివుడు అనుసరిస్తాడు. అలా భూలోకానికి వెళ్లిన మోహిని ఒక ప్రదేశానికి వెళ్లి వెనుదిరిగి శివుడిని చూసి నవ్వుతూ విష్ణుమూర్తిగా మారిపోతుంది.
అది విష్ణుమాయ అనే విషయం శివుడికి అర్థమైపోయి అక్కడే ఆగిపోతాడు. విష్ణుమూర్తి తాను ఆగిన ప్రదేశంలోనే జగన్మోహిని కేశవస్వామిగా శిలా రూపంలోకి మారిపోతాడు. పరమశివుడు కూడా తాను నుంచున్న ప్రదేశంలోనే లింగ రూపంలోకి మారిపోతాడు. అలా శివకేశవులు ఆవిర్భవించిన మహిమాన్విత క్షేత్రమే “ర్యాలి”. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పరిథిలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఈ కథకి తగినట్టుగానే శివకేశవులు చాలా దగ్గరలో ఒకరికి ఎదురుగా ఒకరు కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు.
జగన్మోహినీ కేశవస్వామిగా విష్ణుమూర్తి .. ఉమా కమండలేశ్వరుడిగా శివుడు పూజాభిషేకాలు అందుకుంటున్నారు. 11వ శతాబ్దంలో విక్రమదేవుడు అనే చోళరాజుకి స్వామి స్వప్న దర్శనం ఇచ్చాడట. అతని రథం సీల రాలి పడిన చోటున తన మూర్తి బయటపడుతుందనీ, ఆ మూర్తికి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు నిర్వహించమని చెప్పాడట. స్వప్నంలో స్వామి చెప్పినట్టుగానే జరిగిందట. సీల రాలి పడిన ప్రదేశంలో స్వామివారి మూర్తి లభించడం వలన “ర్యాలి” అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.
ఇక్కడి జగన్మోహిని కేశవస్వామి సాలిగ్రామ ఏకశిల. ఇలాంటి మూర్తి ఇది ఒక్కటి మాత్రమునే ఉందని అంటూ ఉంటారు. ముందువైపున చతుర్భుజుడైన కేశవుడు .. వెనుకవైపున పద్మిని జాతి స్త్రీ లక్షణాలతో కూడిన జగన్మోహిని వెనుకభాగం కనిపిస్తూ ఉంటుంది. మోహిని రూపంలోని లావణ్యం ఆశ్చర్యచకితులను చేస్తుంది. దశావతార మూర్తులతో మలచబడిన స్వామివారి రూపం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. స్వామివారి పాదాల మధ్యలో గంగ ఉంటుంది. అక్కడి నుంచి నిరంతరం నీరు ఊరుతుంటుంది.
ఇక ఉమా కమండలేశ్వరస్వామికి అభిషేకం చేసిన నీరు పానవట్టం దాటి బయటికి రాదు. ఆ నీరంతా ఏమైపోతుందని ఎవరికీ తెలియదు. కేశావస్వామికి “బదిలీ”ల దేవుడనే పేరు ఉంది. తమకి కావలసిన చోటికి బదిలీ కావాలనుకునేవారు ఈ స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. శైవ సంబంధమైన పర్వదినాల్లోనూ .. విష్ణు సంబంధమైన పర్వదినాల్లోను ఈ క్షేత్రానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చైత్ర శుద్ధ నవమినాడు జహన్మోహిని కేశవస్వామి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజున ఉమా కమండలేశ్వరుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రావులపాలెం బస్టాండు నుంచి ఈ క్షేత్రానికి ఆటోలు నడుస్తూనే ఉంటాయి.
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.