భరతుడు పంటచేనుకి కాపలాగా ఒక చోటున కూర్చుని ఉండగా, కొంతమంది ఆటవీకులు అటుగా వస్తారు. కాళికాదేవికి “నరబలి” ఇవ్వడం కోసం వాళ్లు వెతుకుతుంటారు. భరతుడు కనిపించగానే వాళ్లు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటారు. బలీష్టమైన దేహంతో .. ఆరోగ్యంతో .. తేజస్సుతో ఉన్న ఆయనను బలి ఇస్తే బాగుంటుందనే నిర్ణయానికి వస్తారు. వెంటనే భరతుడి దగ్గరికి వెళ్లి .. ఆయనను పట్టుకుంటారు. ఆయన ఎంతమాత్రం విడిపించుకునే ప్రయత్నం చేయకపోవడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఆటవికులు అమ్మవారి ఆలయం దిశగా నడుస్తూ ఉండగా .. ఆ కొండదారిలో వాళ్లతో పాటే భరతుడు కూడా నడుస్తూ ఉంటాడు. ఎక్కడికి తీసుకెళుతున్నారు? .. ఎందుకు తీసుకెళుతున్నారు? అనే ప్రశ్నలు ఆయన వేయకపోవడం వాళ్లకు వింతగా అనిపిస్తుంది. అంతేకాదు తమని చూసి భయపడకపోవడం మరింత చిత్రంగా అనిపిస్తుంది. భరతుడు తనలో తానే నవ్వుకుంటూ ఉండటం .. ఏదో తెలియని ఆనందాన్ని పొందుతూ ఉండటం వాళ్లకి అయోమయాన్ని కలిగిస్తుంది. ఆయన గురించి మాట్లాడుకుంటూనే వాళ్లంతా అమ్మవారి విగ్రహం దగ్గరికి చేరుకుంటారు.

అది నిలువెత్తు కాళికాదేవి విగ్రహం .. రాతిలో మలచబడిన ఆ విగ్రహం భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ విగ్రహం ముందు కాగడాలు వెలుగుతూ ఉంటాయి. అమ్మవారి పూర్తి రూపాన్ని తరచూ చూసే తమకే భయం కలుగుతూ ఉంటుంది. అలాంటిది ఆ మూర్తిని చూసి కూడా భరతుడు ఎప్పటిలానే ఉండటం వాళ్లకి చిత్రంగా అనిపిస్తుంది. అక్కడ వాళ్లంతా ఏవో పూజలు చేస్తారు. ఆ తంతును చూస్తూ భరతుడు తనలో తాను నవ్వుకుంటూనే ఉంటాడు. మరి కొద్ది సేపట్లో తన ప్రాణాలు పోతాయని తెలిసికూడా ఆయన అలా ఉండటం వాళ్లకు చాలా వింతగా అనిపిస్తుంది.

కాళికాదేవి ఎదురుగా ఉన్న బలిపీఠం దగ్గరకు భరతుడిని తీసుకువెళతారు. బలిపీఠం పై శిరస్సు పెట్టమని వాళ్లు చెప్పగానే భరతుడు అలాగే చేస్తాడు. తాము చూసినప్పుడు .. తాము బంధించినప్పుడు .. తీసుకువస్తున్నప్పుడు .. బలిపీఠంపై శిరస్సు పెట్టమన్నప్పుడు భరతుడు అంతే ప్రశాంతతతో ఉండటం వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వెంటనే ఒక వ్యక్తి ఒక పెద్ద కత్తిని తీసుకుని ముందుకువచ్చి, భరతుడి తలను నరకబోతాడు. అంతే ఆ క్షణంలోనే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. మహాభక్తుడిని బలి చేయడానికి ప్రయత్నిస్తారా? అంటూ ఆ ఆటవికుల శిరస్సులను ఖండిస్తుంది. ఆ తల్లికి నమస్కరించుకుని భరతుడు వెనుదిరుగుతాడు.

గమనిక:
భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.