ఒకసారి సింధు దేశపు రాజు తత్త్వోపదేశం పొందడానికి “కపిల మహర్షి” ఆశ్రమానికి పల్లకిలో వెళుతూ ఉంటాడు. పల్లకి అడవి మార్గంలో వెళుతూ ఉంటుంది. అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత, పల్లకి మోసే ఒక బోయి నీరసించిపోతాడు. దాంతో పల్లకిని మోసే మరో వ్యక్తి ఎవరైనా తారసపడతారేమోనని అంతా ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో భరతుడు అటుగా వస్తాడు. ఆయనను చూడగానే మిగతా బోయిలు పిలుస్తారు. రాజుగారి పల్లకి మోయాలని చెబుతారు. భరతుడు ఏమీ మాట్లాడకుండానే పల్లకీ పడతాడు.

రాజుగారి పల్లకి ముందుకు వెళుతూ ఉంటుంది .. అయితే అప్పుడప్పుడు పల్లకి కుదుపులకు గురవుతూ ఉంటుంది. దాంతో రాజుగారికి ఇబ్బంది కలుగుతుంది. పల్లకి ఎందుకు సరిగ్గా వెళ్లడం లేదని బోయిల పట్ల రాజుగారు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. కొత్తగా పల్లకి పట్టిన వ్యక్తి అందుకు కారణమని మిగతావాళ్లు చెబుతారు. భరతుడి వైపు కోపంగా చూసిన రాజుగారు, ఒళ్లు దగ్గర పెట్టుకుని పల్లకి మోయమని చెబుతాడు. లేదంటే తగిన శిక్షను అనుభవించవలసి వస్తుందని హెచ్చరిస్తాడు. మళ్లీ పల్లకీ ముందుకు కదులుతుంది.

పల్లకి పైకి .. క్రిందికి ఊగడంతో మళ్లీ రాజుగారికి కోపం వచ్చేస్తుంది. విషయమేమిటని బోయిలను అడుగుతాడు. కొత్తగా వచ్చినతను మనలో లేకుండా నడుస్తున్నాడనీ, తాము చెప్పినా అతను వినిపించుకునే పరిస్థితిలో లేడని వాళ్లు సమాధానమిస్తారు. రాజుగా ఇందాక తాను మందలించినా ఆ వ్యక్తి లెక్క చేయకపోవడం ఆయనకి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఏమైందని భరతుడిని రాజుగారు అడుగుతాడు. ఆయన మాట్లాడకుండా నడుస్తూ ఉంటాడు. ఎందుకు పల్లకిని సరిగ్గా మోయడం లేదని మళ్లీ ప్రశ్నిస్తాడు. భరతుడు సమాధానం చెప్పకుండగా ముందుకు నడుస్తాడు.

చెప్పిన మాట వినిపించుకోకపోవడం .. మాట్లాడుతున్నా పట్టించుకోకపోవడం రాజుగారికి మరింత ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఇక నీకు మాటలతో చెప్పడం వలన ప్రయోజనం లేదు .. తగిన విధంగా శిక్షను విధిస్తేనేగాని దారికిరావు అని రాజుగారు అంటాడు. ఆ మాట వినగానే భరతుడు “దేనికి శిక్ష విధిస్తారు మహారాజా .. దేహానికా? ఆత్మకా? అని అడుగుతాడు. భరతుడు ఆ మాట అనగానే .. పల్లకీ మోస్తున్నది సామాన్యుడు కాదనే విషయం రాజుకు అర్థమైపోతుంది. ఏది సత్యం? ఏది శాశ్వతం? అనే విషయాన్ని భరతుడు స్పష్టంగా చెప్పడంతో, ఆ రాజు అజ్ఞానం తొలగిపోతుంది. తనని క్షమించని రాజు కోరడంతో భరతుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.