తమిళనాడులోని ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో “తిరువొట్రియూర్” ఒకటిగా కనిపిస్తుంది. చెన్నై నగరానికి సమీపంలో మహిమాన్వితమైన ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడ త్యాగరాజస్వామి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. పొడవైన ప్రాకారాలు .. ఎత్తైన గాలి గోపురాలు .. విశాలమైన మంటపాలు .. అందంగా తీర్చిదిద్దబడిన పుష్కరిణి .. అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఈ క్షేత్రం అలరారుతూ ఉంటుంది. పవిత్రతకు .. ప్రశాంతతకు అద్దంపడుతూ ఉంటుంది. అలాంటి ఈ క్షేత్రం స్వామివారి లీలావిశేషాలకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది.

ఈ క్షేత్రంలో తన భక్తుడైన సుందరమూర్తి నాయనార్ వివాహాన్ని పరమశివుడు దగ్గరే ఉండి జరిపించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఆ భక్తుడికి స్వామివారు రెండు మార్లు వివాహాన్ని జరిపించడం ఇక్కడి విశేషం. అందుకు కారణంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. కైలాసంలో సదాశివుడి సేవలో ఉన్న సుందరుడు .. పార్వతీదేవి సేవలో ఉన్న ఇద్దరు కన్యలను ప్రేమిస్తాడు. తమ ప్రేమ విషయాన్ని ఆయన పార్వతీ పరమేశ్వరులకు తెలియజేస్తాడు. తమ వివాహాన్ని జరిపించమని కోరతాడు.

అందుకు పరమశివుడు నవ్వి .. ముగ్గురూ కూడా భూలోకంలో జన్మిస్తారనీ, ఆ తరువాత ఆ ముగ్గురినీ కలిపి తాను వివాహం జరిపిస్తానని శివుడు మాట ఇస్తాడు. సుందరుడు .. ఆ కన్యలు వేరు వేరు ప్రదేశాల్లో జన్మిస్తారు. గతం గుర్తుకు లేని సుందరుడు వేరే యువతిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడతాడు. అప్పుడు వృద్ధుడి రూపంలో శివుడు వచ్చి ఆ వివాహాన్ని అడ్డుకుంటాడు. సుందరమూర్తిని అక్కడి నుంచి “తిరువారూరు” తీసుకుని వెళ్లి, “పరవయ్యారు” అనే యువతిని పరిచయం చేస్తాడు. ఆ యువతి కుటుంబ సభ్యులను ఒప్పించి ఆమెతో వివాహం జరిపిస్తాడు.

ఆ తరువాత కొంతకాలానికి “తిరువొట్రియూరు” క్షేత్రానికి వచ్చిన సుందరమూర్తి అక్కడ “సంగిలియర్” అనే కన్యను చూస్తాడు. అక్కడి స్వామికి పూమాలలు సమర్పించే కుటుంబానికి చెందిన ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. త్యాగరాజస్వామి ఆలయంలోని ఒక చెట్టు క్రింద ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. కానీ తనకి మొదటి పెళ్లి చేసిన వృద్ధుడికి ఈ విషయం తెలిస్తే ఆయన కోప్పడతాడని ఆలోచన చేస్తుంటాడు. అదే సమయంలో ఆ వృద్ధుడు అక్కడికి రావడం చూసి కంగారు పడతాడు. అప్పుడు ఆ వృద్ధుడు తన నిజ రూపాన్ని ధరిస్తాడు.

సాక్షాత్తు శివుడే తన మొదటి పెళ్లిని జరిపించాడనీ .. రెండవ పెళ్లి జరిపించడానికి వచ్చాడని తెలిసి సుందరమూర్తి నాయనార్ పొంగిపోతాడు. అప్పుడు తనకీ అతనికి గల అనుబంధాన్ని గురించి .. ఆ కన్యలను అతను వివాహం చేసుకోవడానికి గల కారణం గురించి పరమశివుడు చెబుతాడు. సుందరమూర్తి వివాహాన్ని శివుడు దగ్గరుండి జరిపించిన ఆ వృక్షాన్ని ఈ క్షేత్రంలో ఇప్పటికీ చూడొచ్చు. ఇక్కడ అమ్మవారు “వడివుడైయమ్మన్” పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది. గణపతి .. సుబ్రహ్మణ్యస్వామితో పాటు చాలా ఉపాలయాలు దర్శనమిస్తుంటాయి. శైవ సంబంధమైన పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు .. సేవలు .. ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.