Pithapuram – Puruhutika Devi Temple

ఆంధ్రప్రదేశ్ లోని ప్రాచీనమైన .. మహిమాన్వితమైన .. అనేక విశేషాల సమాహారంగా కనిపించే క్షేత్రాలలో “పిఠాపురం”(Pithapuram) ఒకటిగా అనిపిస్తుంది. ఈ క్షేత్రాన్ని ఒక ఆలయంగా చూసేసి బయటికి రాలేము. అడుగడుగునా ఇక్కడ అనేక విశేషాలు .. ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఇంత గొప్ప క్షేత్రాన్ని ఇప్పటివరకూ చూడలేకపోయామే అనిపిస్తుంది. ఇది కాకినాడ జిల్లా పరిధిలో .. “సర్పవరం” అనే భావనారాయణ స్వామి క్షేత్రానికి చాలా సమీపంలో దర్శనమిస్తుంది. కాకినాడ నుంచి ఆటోల్లో కూడా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

సతీదేవి “పీఠభాగం” ఇక్కడ పడటం వలన ఈ క్షేత్రానికి “పీఠికాపురం” అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది “పిఠాపురం”గా(pithapuram) మారింది. శక్తి పీఠాల లో ఒకటిగా వెలుగొందే ఈ క్షేత్రంలో అమ్మవారు “పురుహూతికాదేవి” పేరుతో పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇక పరమేశ్వరుడు “కుక్కుటేశ్వరుడు”గా కొలువైన క్షేత్రంగాను .. “పాదగయ” క్షేత్రంగాను .. దేవేంద్రుడు ప్రతిష్ఠించిన “కుంతీమాధవ”క్షేత్రంగాను .. శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన దత్త క్షేత్రంగాను పిఠాపురం విలసిల్లుతోంది.

గయాసురుడు చేసిన యజ్ఞయాగాల వలన ఇంద్ర పదవి అతని సొంతమవుతుంది. దాంతో ఆయన అండ చూసుకుని మిగతా అసురులు చెలరేగిపోతారు. ఆ కారణంగా సాధు సజ్జనులు నానా అవస్థలు పడుతుంటారు. ఈ విషయాన్ని త్రిమూర్తులకు విన్నవించిన దేవేంద్రుడు, తన పదవిని కూడా తనకి ఇప్పించమని కోరతాడు. బ్రాహ్మణుల రూపాల్లో గయాసురుడి దగ్గరికి వెళ్లిన త్రిమూర్తులు. లోక కల్యాణం కోసం ఒక యజ్ఞం చేయాలనీ, అందుకు అతని శరీరమే యజ్ఞవేదిక కావాలని కోరతారు.

అందుకు గయాసురుడు ఆనందంగా అంగీకరిస్తాడు. అయితే యజ్ఞం వారం రోజుల పాటు జరుగుతుందనీ .. కోడి కూతలు లెక్కించుకోమని అంటారు. వారం రోజులు పూర్తయ్యే వరకూ కదలరాదనీ .. అలా జరిగితే అవే అతనికి చివరి క్షణాలు అవుతాయని అంటారు. అలా గయాసురుడి దేహంపై యజ్ఞం మొదలవుతుంది. వారం రోజులు కావొస్తున్నా గయాసురుడు కదలడు. దాంతో శివుడు కోడిగా మారిపోయి తెల్లవారినట్టుగా కూస్తాడు. ఏడు రోజులు పూర్తయినట్టుగా భావించి గయాసురుడు కదులుతాడు.

ఆ తరువాత వచ్చింది త్రిమూర్తులని తెలుసుకుని నమస్కరిస్తాడు. వారి చేతుల్లో మరణించడం కన్నా తనకి కావాల్సింది ఏముంటుందని అంటాడు. కాకపోతే తన పేరుతో .. “పాదగయ”గా ఈ క్షేత్రం విలాసిల్లేలా చేయమని కోరతాడు. అందుకు త్రిమూర్తులు అనుగ్రహిస్తారు. పరమశివుడు కోడిగా మారిన కారణంగానే ఇక్కడి శివయ్యని కుక్కుటేశ్వరుడిగా కొలుస్తుంటారు. ఎంతోమంది రాజుల ఏలుబడిలో వైభవాన్ని చూసిన ఈ క్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం పూర్వజన్మ పుణ్య విశేషం వల్లనే కలుగుతుందనేది మహర్షుల మాట.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Pithapuram – Puruhutika Devi Temple