Sri Bhagavatam – Kartaviryarjuna mocking Parasurama
కార్తవీర్యార్జునుడి మాటలు పరశురాముడికి మరింత ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. అయినా సహిస్తూ .. తను యుద్ధం చేయాలనే ఉద్దేశముతో రాలేదనీ, తన తల్లిదండ్రులు ప్రాణసమానంగా చూసుకునే కామధేనువును తీసుకువెళ్లడానికి వచ్చానని చెబుతాడు. అది కుదరని పక్షంలో యుద్ధం చేయకుండా వెనుదిరగకూడదనే నిర్ణయంతోనే వచ్చానని అంటాడు. పరశురాముడితో యుద్ధం ఎలా ఉంటుందనేది అతనికి తెలియక అలా మాట్లాడుతున్నాడంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. అందువలన వివేకంతో ఆలోచన చేసి కామధేనువును అప్పగించమని అడుగుతాడు.
ఒక ఆశ్రమజీవి తన రాజ్యంలోకి అడుగుపెట్టి .. తన దగ్గరికి వచ్చి బెదిరిస్తే తాను చూస్తూ ఎలా ఊరుకుంటానని కార్తవీర్యార్జునుడు అంటాడు. తాను కామధేనువును మంచితనంతో అడిగితే ఇవ్వకుండా అతని తండ్రి తప్పు చేశాడనీ, దాని కోసం ఇంతదూరం వచ్చి తనపై కయ్యానికి కాలు దువ్వడం అతను చేస్తున్న తప్పు అని చెబుతాడు. సాధు జీవనం సాగించే ఒక బ్రాహ్మణుడికి తాను భయపడితే, ఇక తనని ఎదిరించడానికి బయల్దేరే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంటుందని అంటాడు. అందువలన కామధేనువును అతను చూసే అవకాశం కూడ ఇవ్వనని తేల్చి చెబుతాడు.
ఆ మాటలకు పరశురాముడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. పరశురాముడు ఎప్పుడూ కూడా ఎవరి ఎదురుగా నిలబడి ఇంతసేపు ప్రశాంతంగా మాట్లాడింది లేదు. ఇది గోవు విషయం .. అందునా కామధేనువు విషయం .. అందువలన తాను శాంతం వహిస్తున్నానని పరశురాముడు అంటాడు. ఎవరు చేసిన పాపం వాళ్లను వెంటాడుతుంది .. చేసినపనికి అనుభవించక తప్పదని తిడుతూ వెళ్లే రకం తాను కాదని చెబుతాడు. అలా చేస్తే శివప్రసాదితమైన తన గొడ్డలిని అవమానించడమే అవుతుందని అంటాడు.
పరశురాముడి మాటలకు కార్తవీర్యార్జునుడు పెద్దగా నవ్వుతాడు. వేయి చేతులతో వేయి ఆయుధాలను ఒకేసారి ప్రయోగించగల తనని, ఒక్క గొడ్డలి తీసుకుని వచ్చి ఎదిరించడం చూస్తే లోకులు నవ్వుతారని కార్తవీర్యార్జునుడు అంటాడు. వేలమంది రాజులు .. సామంతులు తన రాజ్యం పేరు చెబితే భయంతో వణికిపోతారు. తన రాజ్యంపైకి దండెత్తి రావాలనే ఆలోచన వస్తేనే వాళ్లకి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అందుకు కారణం తన బలపరాక్రమాలు. అలాంటిది తన రాజ్యంలోకి అడుగుపెట్టడానికి ముందు ఒకసారి ఆలోచన చేసి ఉంటే బాగుండేదని అంటాడు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – Kartaviryarjuna mocking Parasurama