Sri Bhagavatam – Sri Krishna death .. The end of the incarnation of Lord Krishna

ఎప్పుడైతే పొదల చాటు నుంచి అరుపు వినిపించిందో, వేటగాడు అక్కడికి పరుగున వెళతాడు. తాను వేసిన బాణం కృష్ణుడి కాలు బొటనవ్రేలు లోకి దిగి ఉండటం చూసి నివ్వెరపోతాడు. తాను లేడిని వేటాడుతూ అటుగా వచ్చాననీ, పొదల మాటున ఉన్నది లేడి అనుకునే బాణం వదిలానని తనని క్షమించమని వేటగాడు కృష్ణుడిని కోరతాడు. ఈ రోజున తన అదృష్టం బాగోలేదని తాను అనుకుంటూనే ఉన్నాననీ, అందువల్లనే తాను వేసిన బాణం ఆయనకి తగిలిందని అంటాడు.

ఇంతటి ఘోరం చేయాలని రాసి ఉండటం వల్లనే ఎప్పుడూలేనిది ఒక లేడి కోసం తాను ఇంత దూరం వచ్చానని చెబుతాడు. తనతో ఈ పాపం చేయించడానికే ఆ లేడి తనని ఈ దిశగా తీసుకువచ్చిందని ఆవేదన చెందుతాడు. తనకి బాణం వేయడం వచ్చుగానీ .. ఆ బాణం దిగడం వలన కలిగే బాధ నుంచి ఉపశమనం కలిగించడం చేతకాదని కన్నీళ్లు పెట్టుకుంటాడు. స్వామి బాధను తాను చూడలేక పోతున్నాననీ, అతనికి తెలిసిన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. ఆయన చెప్పినట్టుగానే చేస్తానని అంటాడు.

కృష్ణుడు ఆ వేటగాడి వైపు చూసి అదోలా నవ్వుతాడు. ఎంతటివారైనా కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు .. బాధపడొద్దని అంటాడు. త్రేతాయుగంలో తాను రాముడిగా ఉన్నప్పుడు, చెట్టు చాటు నుంచి బాణం వేసి “వాలి”ని అంతం చేశానని చెబుతాడు. ఆ వాలి ఎవరో కాదు .. నువ్వే .. ఈ జన్మలో వేటగాడిగా పుట్టి పెరిగి, పొదలమాటు నుంచి బాణంతో కొట్టావు అంటాడు. గతంలో తాను చేసిన పనికి ఇది ఫలితం .. అనుభవించక తప్పదు అంటాడు. ఆ మాటలు అర్థంకాక వేటగాడు అయోమయంగా చూస్తాడు.

తనకి అదంతా తెలియదనీ .. ఏం చేస్తే ఆయన బాధ తగ్గుతుందో చెప్పమని వేటగాడు అడుగుతాడు. ఇక ఈ బాధకు విరుగుడు లేదు .. ఈ బాణం తనతో దేహత్యాగం చేయించడానికి వచ్చిందని కృష్ణుడు అంటాడు. అయ్యో తాను ఎంత పని చేశాను అంటూ ఆ వేటగాడు ఆవేదన చెందుతూ ఉంటాడు. ఇది కాలం చేసుకువెళుతున్న పని .. కారకుడిగా నిన్ను చూపించింది .. చింతించకు అని చెబుతూ శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేసి, విష్ణుమూర్తిగా తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు. అలా కృష్ణుడి అవతార పరిసమాప్తి జరుగుతుంది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Sri Krishna death .. The end of the incarnation of Lord Krishna