Ramayanam – 79 : Sita doubts over Ashwamedhayaga
అయోధ్య నగరం నుంచి లవకుశులు ఆశ్రమానికి తిరిగి వస్తారు. తాము రాముడి ఎదుట ఆయన చరితను గానం చేశామనీ, ఆయన ఎంతగానో మెచ్చుకున్నారని వాల్మీకి మహర్షితో చెబుతారు. తనకథను రచన చేసిన వాల్మీకి మహర్షికి కృతజ్ఞతలు తెలుపమన్నారని అనడంతో, వాల్మీకి మహర్షి తన జన్మ ధన్యమైందని అనుకుంటాడు. మనసులోనే ఆ రామచంద్రమూర్తికి నమస్కరించుకుంటాడు. సీతారాముల విషయంలో తాను తలపెట్టిన యజ్ఞం కొంతవరకూ సఫలీకృతమైందని తలుస్తాడు.
లవకుశులు రాముడి దర్శనం చేసుకున్నారని తెలిసి, సీతాదేవి సంతోషిస్తుంది. వాళ్ల కళ్లతో తాను అయోధ్యను దర్శించిన అనుభూతి కలుగుతుంది. చాలాకాలం తరువాత ఆమె మనసు మళ్లీ ఆనందంతో పొంగిపోతుంది. అయోధ్య నేలను తమ పిల్లలు స్పర్శించడం, అంతఃపురంలో తన పిల్లలు కాలు పెట్టడం శుభపరిణామంగా ఆమెకు అనిపిస్తాయి. ఆమె కళ్లు ఆనంద బాష్పాలను వర్షిస్తాయి. పిల్లలిద్దరినీ ఆమె అక్కున చేర్చుకుని అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతుంది.
అశ్వమేధ యాగానికి అవసరమైన సీతాదేవి స్వర్ణ విగ్రహం తయారవుతుంది. ఆ విగ్రహాన్ని రాముడికి చూపుతారు. అచ్చు సీతాదేవిలానే ఉన్న ఆ విగ్రహాన్ని చూడగానే రాముడు కన్నీళ్లపర్యంతమవుతాడు. ఆ విగ్రహాన్ని ప్రేమానురాగాలతో పదే పదే స్పర్శిస్తాడు. తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు సీతాదేవినే అనే అనుభూతిని పొందుతాడు. సీతాదేవి మూర్తి చూసి ఉద్వేగానికి లోనైన రాముడిని చూసి కౌసల్య బాధపడుతుంది. ఆ విగ్రహం కారణంగానైనా ఆయన కాస్త ఊరట చెందటం పట్ల సంతోషాన్ని పొందుతుంది.
అయోధ్యలో జరగనున్న అశ్వమేధ యాగానికి హాజరు కావలసిందిగా వాల్మీకి మహర్షికి ఆహ్వానం అందుతుంది. తప్పకుండా వస్తామని చెప్పి కబురు పంపిస్తాడు వాల్మీకి మహర్షి. ధర్మపత్ని లేకుండా యాగం తలపెట్టకూడదని తెలిసిన సీతాదేవి ఆలోచనలో పడుతుంది. అలాంటిది రాముడు ఎలా యాగాన్ని తలపెట్టాడనే అనుమానం వస్తుంది. అదే సందేహాన్ని ఆమె వాల్మీకి మహర్షి దగ్గర వ్యక్తం చేస్తుంది. అలాంటి సందేహాలేం పెట్టుకోవద్దనీ, రాముడు ఏకపత్ని వ్రతుడని ఆమెకి ఆయన ధైర్యం చెబుతాడు. దాంతో ఆమె మనసు ఊరట చెందుతుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 79 : Sita doubts over Ashwamedhayaga
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.