“శమీక మహర్షి” మెడలో చచ్చినపాము ఉండటం చూసిన “శృంగి”, తపోదీక్షలో ఉన్న తన తండ్రిని అవమానించింది ఎవరై ఉంటారా అని దివ్య దృష్టితో చూస్తాడు. పరీక్షిత్తు మహారాజు అందుకు కారకుడు అని తెలిసి ఆగ్రహావేశాలకు లోనవుతాడు. మహారాజుననే గర్వంతో .. అధికారం ఉందనే అహంభావంతో ఆయన అలా ప్రవర్తించాడని భావిస్తాడు. చచ్చిన సర్పాన్ని తన తండ్రి మెడలో వేసి అవమానించిన పరీక్షిత్తు, నేటికి ఏడవ రోజున “తక్షకుడు” అనే సర్పం కాటు కారణంగా మరణించుగాక అని శపిస్తాడు.
వేట నుంచి హస్తినకు తిరిగిన వచ్చిన పరీక్షిత్తుకు మనసంతా ఆందోళనగా ఉంటుంది. అడవిలో మహర్షి తపస్సులో ఉన్నాడు .. దాహం తీర్చమని ఆయనను అడగడంలో అర్థం లేదు. భగవంతుడి ధ్యానంలో ఉన్న మహర్షిని అవమానించడమంటే, భగవంతుడిని అవమానించడమే. ఎందుకు అనాలోచితంగా ఇలాంటి పనిచేశాను. రాజుననే అహంభావమా? అజ్ఞానమా?. ఊహ తెలిసినది మొదలు ఎంతోమంది మహర్షులను గౌరవించి ఆతిథ్యమిచ్చిన తాను, ఎందుకు ఇలా చేశాను? ఇది కాలమహిమా? అని ఆలోచన చేస్తుంటాడు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన మునికుమారులు, శమీక మహర్షి కుమారుడు “శృంగి” పెట్టిన శాపం గురించి పరీక్షిత్తుకు చెబుతారు. నేటికి ఏడవ రోజున తక్షకుడి కారణంగా తాను మరణిస్తానని శృంగి శపించాడని తెలుసుకుని పరీక్షిత్తు నివ్వెరపోతాడు. అవునూ .. ఇది కాలమహిమే .. అందుకే ఇలా జరిగింది అని పరీక్షిత్తు అనుకుంటాడు. తపోధనుల శాపం వృథా కాదు .. అది తప్పక జరిగి తీరుతుంది. అందువలన ఏడు రోజులలో తాను మరణించడమనేది ఖాయమైపోయింది. ఇప్పుడు తన ముందున్నది ఈ ఏడు రోజులలో ముక్తికి అవసరమైన పుణ్య ఫలాలను సంపాదించడం ఎలా? అని ప్రశ్నించుకుంటాడు.
పరీక్షిత్తు మహారాజు .. ఏడు రోజుల తరువాత ఈ నేలపై ఈ పేరు మాత్రమే ఉంటుంది .. మరి ఈ శరీరం?. ఎన్ని పదవులు పొందినా .. ఎంతటి వైభవాలను చూసినా .. ఎన్ని సుఖాలను అనుభవించినా .. అదంతా కూడా తాత్కాలికమే. గాలి దుమ్ము రానంతవరకే గూట్లో దీపం ఉన్నట్టుగా, ఆయువు తీరనంతవరకే జీవుడు ఈ శరీరంలో ఉంటాడు. ఆ తరువాత ఈ శరీరంతో జీవుడికి సంబంధం లేదు. మరి అప్పటివరకూ అనుభవించిన భోగభాగ్యాలు ఏమైపోయినట్టు? పోనీ ఇవి పర లోకంలో ఏమైనా ఉపయోగపడుతున్నాయా? అదీ లేదు. మరి జీవుడు ముక్తిని పొందడానికి ఏం చేయాలి? అని ఆలోచన చేయడం మొదలుపెడతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతో మంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.