కంసుడు తన విశ్రాంతి మందిరంలో పచార్లు చేస్తుంటాడు. ఆయన మనసంతా చాలా ఆందోళనగా ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని దేవకీ వసుదేవులను కారాగారంలో వేస్తే .. వాళ్లకి జన్మించిన బిడ్డలందరినీ సంహరిస్తూ వెళుతుంటే .. తన మరణానికి కారకుడని ఆకాశవాణి పలికిన శిశువు ఎలా తప్పించుకున్నాడు? తనకి తెలియకుండా ఎక్కడ పెరుగుతున్నాడు? కంసుడి బారి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ప్రతివారికీ తెలిసేలా చేస్తాను. కంసుడి కళ్లుగప్పడం అంత తేలిక కాదని నిరూపిస్తాను అనుకుంటూ ఒక బలమైన నిర్ణయానికి వస్తాడు.
కంసుడు కబురు చేయగానే క్షణాల్లో “పూతన” అను రాక్షసి అక్కడికి వస్తుంది. కంసుడికి వినయంగా నమస్కరించి .. తనని పిలిపించడానికి గల కారణం ఏమిటని అడుగుతుంది. తన రాజ్యంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పసిపిల్లలను హతమార్చమని ఆజ్ఞాపిస్తాడు. ఈ విషయంలో ఎంత మాత్రం ఆలోచన చేయవద్దని ఆదేశిస్తాడు. అలాగేనని చెప్పి పూతన అక్కడి నుంచి బయల్దేరుతుంది. ఆకాశ మార్గాన ఆమె ప్రయాణం చేస్తూ, ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ శిశు హత్యలను చేస్తూ వెళుతుంటుంది. దాంతో పసి పిల్లలు గల తల్లితండ్రులంతా భయాందోళనలకు లోనవుతుంటారు.
పూతన అలా శిశువులను హతమారుస్తూ “గోకులం” చేరుకుంటుంది. ముందుగా ఎవరెవరి ఇంట పసిపిల్లలు ఉన్నారనే విషయం తెలుసుకోవడం కోసం ఒక అందమైన స్త్రీగా మారుతుంది. వీధుల్లో ఒక్కో ఇంటిని పరిశీలిస్తూ వెళుతున్న ఆమెకి, యశోద ఇంట్లో నుంచి పసిపిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. దాంతో నెమ్మదిగా ఆమె లోపలికి తొంగి చూస్తుంది. ఆ సమయంలో బాలకృష్ణుడు శయ్యపై పడుకుని ఉంటాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని పూతన లోపలికి అడుగుపెడుతుంది. ఆమె గడపదాటి లోపలికి అడుగుపెట్టగానే బాలకృష్ణుడు ఓరకంట గమనిస్తాడు.
పూతన తనని సమీపిస్తుందని తెలిసి .. నిద్ర నటిస్తాడు. పూతన బాలకృష్ణుడి దగ్గరికి వచ్చి,తన స్తన్యాలలో విషంతో కూడిన పాలను తాగించడానికి ప్రయత్నిస్తుంది. బాలకృష్ణుడు ఆమె స్తన్యాన్ని నోటితో పట్టుకుని ఆమె శక్తినంతటినీ లాగేస్తాడు. తన శక్తినంతటినీ హరించివేస్తూ ఉండటంతో ఆ బాధకు తట్టుకోల పూతన బాధతో పెద్దగా అరుస్తూ విలవిలలాడుతూ మరణిస్తుంది. పూతన అరుపులకు యశోద .. నందులతో పాటు చుట్టుపక్కల వాళ్లంతా పరిగెత్తుకు వస్తారు జరిగిన సంఘటనను చూసి భయాందోళనకు లోనవుతారు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.