ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూతన ప్రవేశిచడం .. ఆ రాక్షస స్త్రీ హఠాత్తుగా మరణించడం యశోదాదేవికి ఆందోళనను కలిగిస్తుంది. ఇకపై చిన్నికృష్ణుడిని ఒంటరిగా వదిలి ఎక్కడికీ వెళ్లకూడదని నిర్ణయించుకుంటుంది. అంతేకాదు కృష్ణుడికి దిష్టి తీసి .. అతనికి మంత్రించిన తాయెత్తులు కట్టిస్తుంది. అలా చిన్నికృష్ణుడి విషయంలో ఆమె అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. గోకులంలో అంతా కూడా పూతన ఎలా మరణించిందనే విషయం అర్థంకాక అయోమయంలోనే ఉంటారు. ఆ విషయాన్ని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.

పూతన మరణించిందనే విషయం కంసుడికి తెలిసిపోతుంది. పూతన చనిపోయినప్పటికీ, తన మృత్యువు ఎవరి ఇంట పెరుగుతుందనే విషయాన్ని తెలియజేసినందుకు తనకి చాలా సంతోషంగా ఉందని కంసుడు అంటాడు. గోకులంలో .. నందుడి ఇంట పెరుగుతున్నవాడే తాను వెదుకుతున్నవాడు. తనని అంతమొందించే శక్తి కలిగినవాడు కనుకనే, బాల్యంలోనే పూతనను పైలోకానికి పంపించాడు. అందువలన అతగాడే తను ఎదుర్కోవలసిన మొనగాడు. ఇక ఆలస్యం చేయకుండా, “శకటాసురుడు”ను పంపించమని తన సైన్యాధిపతిని కంసుడు ఆదేశిస్తాడు.

“శకటాసురుడు” బండి రూపంలో తాను అనుకున్న చోటికి చేరుకుని శత్రువులకు ఎలాంటి అనుమానం రాకుండగా వాళ్లను సంహరించే మాయను తెలిసినవాడు. అలాంటి శకటాసురుడు .. కంసుడి ఆదేశం మేరకు “గోకులం” చేరుకుంటాడు. నంద యశోదల ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడికి సమీపంలోనే శకటముగా మారిపోయి, తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ చుట్టుపక్కలవారు అక్కడ ఆగిన బండిని చూస్తారుగానీ, ఎవరికివారు .. మరొకరిదేమో అనుకుంటారు. అలా అనుకునే ఎవరి పనులను వాళ్లు చేసుకుంటూ ఉంటారు.

చిన్నికృష్ణుడు తన స్నేహితులైన గోపాలకులతో బంతి ఆట ఆడుకోవడం కోసం బయటికి వస్తాడు. మిగతా గోపాలకులతో కలిసి ఆ బండికి సమీపంలో ఆడుతూ ఉంటాడు. బండి రూపంలో ఉన్న శకటాసురుడు, తగిన సమయం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటాడు. అదే సమయంలో గోపాలకులు ఆడుతున్న బంతి ఆ బండి కిందకి వెళుతుంది. ఆ బంతి కోసం వెళ్లిన చిన్నికృష్ణుడిని శకటాసురుడు అదిమివేయడానికి ప్రయత్నిస్తాడు. దాంతో కృష్ణుడు తన ఎడమకాలితో తన్నడంతో, ఆకాశంలోకి ఎగిరిన ఆ బండి ముక్కలై కిందపడుతుంది. నిజరూపాన్ని పొందిన శకటాసురుడు మరణిస్తాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.