పూతన .. శకటాసురుడు .. గోకులానికి రావడం .. మరణించడం యశోదాదేవికి తీవ్రమైన ఆందోళనను కలిగిస్తూ ఉంటుంది. దాంతో ఆమె చిన్ని కృష్ణుడిని వదిలి వెళ్లకుండా కనిపెట్టుకుని ఉంటుంది. చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో ఆడుకునే సమయంలోను అరుగులపై కూర్చుని బిడ్డ అల్లరి పనులను కళ్లారా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఆ తరువాత నందుడు ఇంటికి రాగానే కృష్ణయ్య అల్లరి పనులను గురించి చెబుతూ సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. కృష్ణయ్యనే లోకంగా బతుకుతున్న యశోదను చూసి నందుడు ఆనందిస్తాడు.
పూతన .. శకటాసురుడు మరణించడంతో కంసుడు మరింత ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ఒక చిన్న బాలకుడు మహా మహా యోధులను .. మాయా యుద్ధంలో ఆరితేరిన వారిని సైతం అవలీలగా అంతమొందిస్తూ ఉండటం కంసుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడే ఆ పిల్లవాడి కథకి ముంగింపు పలక్కపోతే, మున్ముందు తనని తప్పక సంహరిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదని అనుకుంటాడు. అందువలన ఈ సారి మరింత మాయావి అయిన రాక్షసుడిని పంపించాలని నిర్ణయించుకుంటాడు.
కంసుడు తలచుకున్నదే ఆలస్యం అతని ఎదుట “తృణావర్తుడు” ప్రత్యక్షమవుతాడు. తనని రప్పించడానికి గల కారణమేమిటని అడుగుతాడు. పూతనకు .. శకటాసురుడికి చెప్పిన విషయమే ఆయనకి చెబుతాడు. ఎలాంటి పరిస్థితుల్లోను ఆ బాలుడిని అంతమొందించకుండా తిరిగిరావద్దని అంటాడు. కంసుడి ఆజ్ఞను అక్షరాలా అమలుచేసే వస్తానని చెప్పి “తృణావర్తుడు” అక్కడి నుంచి బయల్దేరతాడు. ఆకాశమార్గం ద్వారా గోకులానికి చేరుకున్న “తృణావర్తుడు” ఆ బాలకుడు ఎవరనేది తెలుసుకుంటాడు. యశోదాదేవి ఓ అరుగుపై కూర్చుని కృష్ణుడు మిగతా గోపాలకులతో కలిసి ఆడుతూ ఉండటం చూస్తుంటుంది. కృష్ణుడిని అంతమొందించాలని అనుకున్న “తృణావర్తుడు” .. సుడిగాలిలా మారిపోయి చిన్నికృష్ణుడి వైపు దూసుకువెళతాడు. చిన్ని కృష్ణుడిని హఠాత్తుగా చుట్టుముట్టేసి ఆకాశంలోకి ఎగరేసుకుపోతాడు.
ఏం జరుగుతుందో యశోదాదేవి గ్రహించేలోగా చిన్నికృష్ణుడు సుడిగాలిలో చిక్కుకుని ఆకాశంలో గింగిరాలు తిరుగుతుంటాడు. దాంతో యశోదాదేవి భయంతో కేకలు వేస్తుంది. గోకులవాసులంతా అక్కడికి చేరుకుంటారు. సుడిగాలి రూపం నుంచి రాక్షస రూపంలోకి మారి తృణావర్తుడు ఆకాశంలోనే కృష్ణుడిని అంతం చేయాలనుకుంటాడు. కానీ అంతకంతకూ అసాధారణ రీతిలో బరువెక్కుతున్న చిన్నికృష్ణుడిని మోయలేక నింగి నుంచి నేలకూలి చనిపోతాడు. సుడిగాలి రూపంలోని అసురుడిని సంహరించిన చిన్ని కృష్ణుడిని గోకులవాసులు ఎత్తుకుని జేజేలు పలుకుతారు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.