ఒక వైపున గోకులంలోనే కాదు .. మరో వైపున ఇంట్లోను చిన్ని కృష్ణుడు చాలా అల్లరి పనులు చేస్తుంటాడు. పాలు .. పెరుగు .. వెన్న విషయంలో కృష్ణయ్యను కట్టడి చేయడం యశోదకి చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఎన్ని విధాలుగా చెబుతున్నప్పటికీ కృష్ణయ్య వినిపించుకోకపోవడంతో యశోదమ్మకి కోపం వచ్చేస్తుంది. ఇక లాభం లేదని చెప్పేసి ఒక రోజున కృష్ణయ్యను ఒక పెద్ద “రోలు”కి కట్టేస్తుంది. ఢమరుకాన్ని పోలిన ఆ రోలుకు కృష్ణయ్యను కట్టేసి, యశోదాదేవి తన పని చూసుకుంటూ ఉంటుంది.
పెద్ద రోలుకు కట్టేయడం వలన, ఇక కృష్ణుడు కదల్లేడని భావించి, నిశ్చింతగా తన పనుల్లో నిమగ్నమవుతుంది. చిన్నికృష్ణుడు ఆ రోలును లాగడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు నిలువుగా ఉన్న రోలు అడ్డంగా పడిపోతుంది. దాంతో కృష్ణుడు ముందుకు వెళుతుంటే, వెనక రోలు దొర్లుతూ వస్తుంటుంది. కృష్ణుడు ఆ రోలును వెంటేసుకుని రెండు “మద్ది”చెట్ల మధ్య నుంచి వెళతాడు. అయితే అడ్డంగా ఉన్న ఆ రోలు రెండు చెట్లకు తట్టుకుని ఆగిపోతుంది. అవతలికి వెళ్లిన కృష్ణుడు, రోలు రాకపోవడం చూసి లాగుతాడు.
దాంతో ఆ రోలు తట్టుకుని రెండు మద్ది చెట్లు ఒక్కసారిగా కూలిపోతాయి. ఆ మద్ది చెట్ల స్థానంలో కుబేరుడి కుమారులైన నలకూబరుడు .. మణిగ్రీవుడు ప్రత్యక్షమవుతారు. కృష్ణుడికి నమస్కరించుకుని, తమకి శాప విమోచనం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఆయన ఆశీస్సులు అందుకుని అదృశ్యమవుతారు. మద్ది చెట్లు పడిపోయిన శబ్దం వినగానే యశోద – నందుడు అక్కడికి పరిగెత్తుకు వస్తారు. ఆ చెట్లు కృష్ణుడిపై పడకపోవడం తమ అదృష్టంగా భావించి, ఆయన కట్లు విప్పేసి ఎత్తుకుని గారం చేస్తారు.
కుబేరుడి కుమారులు ఇద్దరూ మద్ది చెట్లుగా మారడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఒకసారి నలకూబరుడు – మణిగ్రీవుడు ఇద్దరూ కూడా స్త్రీలతో సరస సల్లాపాలాడుతూ ఉంటారు. ఆ సమయంలో అటుగా వచ్చిన నారద మహర్షిని కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంటారు. అది చూసిన నారద మహర్షి .. భూలోకంలో “మద్ది చెట్లు”గా పడి ఉండమని శపిస్తాడు. కృష్ణుడి కారణంగా వాళ్లకి మళ్లీ పూర్వరూపాలు వస్తాయని చెబుతాడు. అలా నిజ రూపాలు పొందిన కుబేరుడి కుమారులు .. తిరిగి గంధర్వలోకానికి చేరుకుంటారు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.