చిన్నికృష్ణుడి విషయంలో వరుసగా జరుగుతున్న సంఘటనల పట్ల యశోద నందులు తీవ్రమైన భయాందోళనలకు లోనవుతారు. అదృష్టం బాగుండి కృష్ణుడు ఎప్పటికప్పుడు బయటపడుతున్నాడుగానీ, లేదంటే ఏం జరిగివుండేదోనని కంగారు పడతారు. ఇక తాము ఆ ఊళ్లో ఉంటడం అంత మంచిదికాదనీ, వేరే ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటారు. తమ నిర్ణయాన్ని ఊళ్లోవాళ్లకి తెలియజేస్తారు. అయితే వాళ్లంతా కూడా కృష్ణయ్య లేని ఆ ఊళ్లో తాము ఉండలేమనీ, తాము కూడా వాళ్లనే అనుసరిస్తామని చెబుతారు.

అయితే తామంతా కలిసి “బృందావనం” వెళదామనీ, అంతా కలిసి సుఖశాంతులతో ఉండటానికి అది అనువైన ప్రాంతంగా అనిపిస్తోందనే అభిప్రాయాన్ని నందుడు వ్యక్తం చేస్తాడు. ఆయనకి ఎలా ఇష్టమైతే అలాగే చేద్దామని అంతా అంటారు. నంద యశోదల కుటుంబాన్ని అంతా అనుసరిస్తారు. అలా వాళ్లు “బృందావనం” చేరుకుంటారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం చూడగానే చిన్నికృష్ణుడు .. అతని స్నేహితులు అంతా కూడా ఆనందంతో పొంగిపోతారు. తమ ఆటపాటలకు “బృందావనం” మరింత అనుకూలంగా ఉందని సంతోషిస్తారు.

“బృందావనం” వచ్చిన దగ్గర నుంచి కృష్ణుడు .. ఇతర గోపాలకులతో కలిసి, ఆవులమంద వెంట వెళుతుంటాడు. పచ్చిక ఏపుగా పెరిగిన ప్రదేశంలో ఆవులను వదిలేసి, స్నేహితులంతా కలిసి ఆనందోత్సాహాలతో ఆడిపాడుతుంటారు. ఇక కృష్ణుడి వేణుగానానికి ఇతర గోపాలకులంతా తమని తాము మరిచిపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లోనే కృష్ణుడి ఆచూకీని వెదుకుతూ “వత్సా సురుడు” అక్కడికి చేరుకుంటాడు. కృష్ణుడు .. “బృందావనం”లో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుని అతణ్ణి అంతమొందించడానికి సిద్ధమవుతాడు.

చిన్నికృష్ణుడిని హతమార్చడం కోసం దూడ రూపంలోకి మారిపోయి, మందలో చేరిపోతాడు. అదను కోసం ఎదురుచూస్తూ మందలోనే తిరుగుతుంటాడు. అయితే ఎప్పుడైతే అసురుడు ఆ ప్రదేశంలో అడుగుపెట్టాడో అప్పుడే కృష్ణుడికి విషయం తెలిసిపోతుంది. అందువలన ఆయన అప్రమత్తంగానే ఉంటాడు. దూడ రూపంలోని అసురుడు దాడి చేసేలోగానే కృష్ణుడు దానిపై విరుచుకుపడతాడు. “వత్సాసురుడు” నిజరూపాన్ని ధరించి కృష్ణుడితో కలబడతాడు. చివరికి ఆ రాక్షసుడిని కృష్ణుడు సంహరిస్తాడు. ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన గోపాలకులంతా ఉత్సాహంతో చప్పట్లు కొడతారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.