“బృందావనం” వచ్చిన తరువాత ఇక కృష్ణుడికి ఎలాంటి ప్రమాదం ఉండదనీ, ఇక తాము ఆనందంగా .. హాయిగా ఉండవచ్చని యశోద నందులు అనుకుంటారు. కానీ ఊహించని విధంగా మళ్లీ కృష్ణుడికి ఆపద ఎదురుకావడంతో వాళ్లు భయపడిపోతారు. ఒకరి తరువాత ఒకరుగా రాక్షసులు కృష్ణుడిని వెతుక్కుంటూ ఎందుకు వస్తున్నది తెలియక అయోమయానికి లోనవుతారు. అడవి లోపలికి వెళ్లోద్దనీ, మరింత జాగ్రత్తగా ఉండమని కృష్ణుడితో పాటు గోపాలకులకు మరీ మరీ చెబుతారు. అంతా కూడా అలాగేనని చెబుతారు.

ఎప్పటిలానే కృష్ణుడితో పాటు మిగతా గోపాలకులంతా ఆవుల మందను మేపుకు రావడానికి అడవికి వెళతారు. ఆవులు పచ్చిక మేస్తూ ఉంటాయి. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుతూ ఉంటాడు. కంసుడు పంపించగా బయల్దేరిన “బకాసురుడు” ఊరూరా వెతుకుతూ “బృందావనం” చేరుకుంటాడు. అక్కడ కృష్ణుడు .. గోపాలకులు కేరింతలు కొడుతూ ఉండటం చూస్తాడు. ఇంత చిన్న బాలుడా తనకంటే ముందుగా వచ్చిన అసురుల ప్రాణాలను తీసింది అనుకుని ఆశ్చర్యపోతాడు.

కృష్ణుడి విషయంలో తనకంటే ముందుగా వచ్చిన అసురులు చేసిన పొరపాటును తాను చేయకూడదని నిర్ణయించుకుంటాడు. ఏం జరుగుతుందనేది కృష్ణుడు గ్రహించేలోగా అతని ప్రాణాలను తీసేయాలని అనుకుంటాడు. అంతే ఆ క్షణమే “రాకాసి కొంగ”గా మారిపోతాడు. ఒక్క ఉదుటున రివ్వున దూసుకుంటూ కృష్ణుడి పైకి వస్తాడు. ఆ రాకాసి కొంగను చూసిన గోపాలకులంతా భయంతో అరుస్తూ అక్కడి నుంచి పరుగులు తీస్తారు. కృష్ణుడు ఆ రాకాసి కొంగ బారి నుంచి తప్పించుకుంటాడు. ఆ కొంగ ఆకారం చూడగానే అది రాక్షస మాయ అనే విషయం ఆయనకి అర్థమైపోతుంది.

అయితే కృష్ణుడు తేరుకునేలోగా ఆ రాకాసి కొంగ మరోసారి దాడి చేస్తుంది. రెండు .. మూడు మార్లు కొంగబారి నుంచి తప్పించుకున్న కృష్ణుడు, ఆ తరువాత దాని కాళ్లకు దొరికిపోతాడు. ఆ రాకాసి కొంగ తన పదునైన కాలు గోళ్లతో కృష్ణుడిని చిక్కించుకుని ఆకాశంలోకి వెళుతుంది. పొడవైన తన ముక్కుతో కృష్ణుడిని పొడిచి చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ కృష్ణుడు చాకచక్యంగా తప్పించుకుంటూ, ఆ రాకాసి కొంగ ముక్కు పైభాగాన్నీ .. కింది భాగాన్ని రెండుగా చీల్చేస్తాడు. ఆ బాధను తట్టుకోలేక బకాసురుడు నేల కూలి మరణిస్తాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.