గోపాలకులంతా ఎప్పుడు తెల్లవారుతుందా .. ఎప్పుడు ఆవులను మేపడానికి పొలిమేరల్లోకి వెళతామా అని ప్రతిరోజూ ఎదురుచూస్తుంటారు. ప్రతి రోజూ వాళ్లతో కృష్ణుడు కూడా చద్ది కట్టుకుని వెళ్లడమే అందుకు ప్రధాన కారణం .. ఆ వెనకే బలరాముడు అనుసరించడం మరో కారణం. ఆవులను మేపడానికి వెళ్లే చోటున రోజూ సాగే ఆటపాటలు వాళ్లలో అంతటి ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తమతో కృష్ణుడు ఉన్నాడనే ధైర్యం వాళ్లలో మరింత ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటుంది.
ఎప్పటిలానే గోపాలకులతో కలిసి బలరామకృష్ణులు ఆవులను మేపడానికి అడవికి బయల్దేరతారు. అందరూ చద్ది కట్టుకుని తాము అనుకున్న ప్రదేశానికి చేరుకుంటారు. ఆవుల మంద మేస్తూ ఉంటుంది .. ఆడుకునే వాళ్లు ఆడుతుంటారు .. పాడుకునే వాళ్లు పాడుతుంటారు. మిగతావాళ్లు వేణువు వాయించే కృష్ణుడు చుట్టూ చేరి పరవంశంలో మునిగితేలుతుంటారు. అలా కొంతసేపు గడిచిన తరువాత వాళ్ల దృష్టి అక్కడికి కాస్త దూరంలో ఉన్న తాటిచెట్లపై పడుతుంది. ఆ చెట్ల నుంచి చాలా తాటిపండ్లు రాలిపడుతూ ఉంటాయిగానీ, తీసుకోవడం కుదరదని గోపాలకులు బలరామకృష్ణులకు చెబుతారు.
ఆ తాటిచెట్ల సమూహంలో ఒక రాక్షసుడు ఉంటాడనీ, గాడిద రూపంలో అతను అక్కడ తిరుగుతూ ఉంటాడని అంటారు. ఆ దిశగా వెళితే ఎంతటివారినైనా అంతం చేస్తాడనీ, అందువలన అటుగా ఎవరూ వెళ్లరని చెబుతారు. ఆ కారణంగానే అక్కడ రాలిపడిన తాటిపండ్లు అలాగే ఉంటాయని అంటారు. ఏదేమైనా ఆ తాటిపండ్లు తెచ్చుకోవలసిందేనని బలరాముడు అంటాడు. బలరామకృష్ణులపై గల నమ్మకంతో మిగతా గోపాలకులు అందుకు ప్రోత్సహిస్తారు. అందరూ కలిసి ఆ దిశగా నడక సాగిస్తారు.
బలరామకృష్ణులు .. గోపాలకులు ఎప్పుడైతే ఆ తాటిచెట్ల సమూహంలోకి అడుగుపెట్టారో, అప్పుడే “ధేనుకాసురుడు” పసిగట్టేస్తాడు. వాళ్లంతా తాటిపండ్లను ఏరుకుంటూ ఉండగా అక్కడికి చేరుకుంటాడు. ఒక్కసారిగా వాళ్ల వైపుకు దూసుకువస్తాడు. గాడిద రూపంలోని ధేనుకాసురుడిని బలరాముడు ఎదిరించి నిలుస్తాడు. బలరాముడి నుంచి తప్పించుకోవడానికీ .. ఆయనను గాయపరచడానికి ధేనుకాసురుడు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ బలరాముడి పిడి గుద్దులను తాళలేక .. ఆయన ధాటికి తట్టుకోలేక ధేనుకాసురుడు ప్రాణాలు విడుస్తాడు. ఆ వనానికి పట్టిన పీడ విరగడైనందుకు గోపాలకులు సంతోషంతో గెంతులు వేస్తారు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.