కాళీయ మడుగులో జలాన్ని విషపూరితం చేసిన కాళీయుడికి తన శక్తి ఎంతటిదనేది కృష్ణుడు చూపుతాడు. కాళీయుడి భార్యలు .. కాళీయుడు క్షమించమని వేడుకోవడంతో వదిలేస్తాడు. కృష్ణుడు చెప్పిన ప్రకారం ఆ మడుగును వదిలి వెళ్లడానికి కాళీయుడు అంగీకరిస్తాడు. ఇదిలా ఉండగా .. కృష్ణుడు కాళీయ మడుగులోకి దూకాడనే విషయం తెలిసి, పరుగు పరుగునా యశోదాదేవి ఆ మడుగు దగ్గరికి చేరుకుంటుంది. “బృందావనం”లోని వాళ్లంతా ఆమెను అనుసరిస్తూ అక్కడికి చేరుకుంటారు.
కృష్ణుడు కాళీయ మడుగులోకి దూకి చాలాసేపు అయిందని తెలిసి యశోదాదేవి ఆందోళన చెందుతూ ఉంటుంది. అక్కడే ఉన్న బలరాముడు, కృష్ణయ్యకి ఏమీ కాదని ఆమెకి ధైర్యం చెబుతూ ఉంటాడు. నందుడు పైకి ధైర్యంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం యశోదాదేవి కంటే ఎక్కువగా కంగారుపడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే కాళీయుడి పడగలపైనే నీటి పైకి చేరుకున్న కృష్ణుడిని చూస్తూ వాళ్లంతా ఆనందంతో పొంగిపోతారు. కృష్ణుడు ఒడ్డుకు చేరుకోగానే, యశోద ఆయనను అక్కున చేర్చుకుని ముద్దాడుతుంది. బృందావన వాసులంతా ఆ ఇద్దరినీ చూస్తూ అలా ఉండిపోతారు.
కృష్ణుడికి ఇచ్చిన మాట ప్రకారం .. కాళీయుడు ఆ మడుగును వదిలేసి వెళ్లిపోతాడు. సహజంగానే ఆ మడుగు జలాలలోని విషం విరిగిపోయి, అవి పరిశుభ్రమవుతాయి. ఈ సంఘటన జరిగిన తరువాత నుంచి కృష్ణయ్య అంటే అందరిలో మరింతగా ప్రేమానురాగాలు పెరిగిపోతాయి. కృష్ణయ్యతో ఎక్కువ సమయాన్ని గడపడానికి వాళ్లంతా ఇష్టపడుతుంటారు. కృష్ణయ్యను చూడటానికీ .. ఆయనతో మాట్లాడటానికి గోపికలు కూడా ఎంతో ఆసక్తినీ .. మరెంతో ఉత్సాహాన్ని చూపుతుంటారు. ఆయన గురించిన కలలు కంటూ ఉంటారు.
కృష్ణయ్య ఎప్పటిలానే ఆవులను మేపుకు రావడానికి తన మిత్రులతో కలిసి వెళుతూ ఉంటాడు. ఆవులు .. వేణుగానం .. స్నేహితులతో ఆటపాటలతో ఆయన బృందావనానికే అందాన్ని తీసుకొస్తాడు. ఆయన పాద స్పర్శచేత ప్రకృతి పరవశిస్తూ ఉంటుంది. ఆవుల మందలతో కృష్ణయ్య ఎప్పుడు గ్రామానికి తిరిగి వస్తాడా అని తల్లిదండ్రులు ఎదురుచూసినట్టుగానే, ఆయన తిరిగి ఎప్పుడు అడవికి వస్తాడా అని అక్కడి మూగజీవులు ఎదురుచూస్తూ ఉంటాయి. అలా కాలం గడిచిపోతుండగా, కృష్ణయ్యను అంతమొందించడానికి కంసుడిచే నియమించబడిన “ప్రలంబాసురుడు” బృందావనం చేరుకుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.