కృష్ణయ్య సమ్మోహన రూపం .. ఆయన లీలా విశేషాలు గోపకాంతలకు కుదురులేకుండా .. కునుకు లేకుండా చేస్తుంటాయి. వాళ్లంతా కూడా ఆయన ఆలోచనలతోనే కాలం గడుపుతుంటారు. కృష్ణయ్యను కలుసుకునే క్షణాల కోసం .. ఆయనతో మాట్లాడే సమయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వాళ్లంతా కూడా ఆ కృష్ణుడినే తమ భర్తగా పొందాలని భావిస్తుంటారు. అందుకోసం అంతా కలిసి తమ మనసులోని మాటను “కాత్యాయనీ దేవి”కి చెప్పుకుంటారు. తమ కోరిన నెరవేరేలా చేయమని అడుగుతారు.

ఆ తరువాత ఓ రోజున వాళ్లంతా కలిసి స్నానం చేయడానికి గాను, యమునా నదిలోకి దిగుతారు. అదే సమయంలో కృష్ణయ్య అటుగా వస్తాడు. వాళ్లంతా తమ వస్త్రాలను ఒడ్డునే వదిలి .. నీళ్లలో మొలలోతుకి దిగేసి స్నానమాడుతూ ఉండటం చూస్తాడు. ఆ గోపికల వస్త్రాలను తీసుకుని అక్కడి చెట్టుపైకి ఎక్కేసి కూర్చుంటాడు. గోపికలు స్నానం చేస్తూనే, ఒడ్డున తమ వస్త్రాలు లేకపోవడం చూసి బిత్తరపోతారు. చెట్టుపై ఉన్న కృష్ణుడిని చూసి సిగ్గుతో ముడుచుకుపోతారు. తమ వస్త్రాలను తమకి ఇవ్వమని ఆయనను కోరతారు.

తనకి తెలియని మర్మాలు ఏముంటాయని కృష్ణుడు వాళ్లను ఆటపట్టిస్తాడు. అందరూ కూడా రెండు చేతులెత్తి తనకి నమస్కరిస్తే, అప్పుడు వాళ్ల వస్త్రాలను ఇస్తానని కృష్ణుడు చెప్పడంతో అలాగే చేస్తారు. కృష్ణుడు ఇచ్చిన వస్త్రాలను ధరించి .. ఆ విషయాన్ని యశోద చెవిన వేస్తారు. కృష్ణయ్య ఈ విధంగా చేయడం ఆమెకి ఎంతో బాధను కలిగిస్తుంది. మరోసారి అలాంటి పనులు చేయవద్దని కృష్ణయ్యను కోరుతుంది. వాళ్లంతా పూర్వజన్మలో మహామునులనే విషయం ఆమెకి తెలియదు గనుక కృష్ణుడు నవ్వుకుంటాడు. తల్లి మాట వింటున్నట్టుగా తలాడించి ఆమె మనసుకు ఊరటకలిగిస్తాడు. రోజులు గడిచిపోతుంటాయి .. బృందావనంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో .. సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు.

కృష్ణయ్య పట్ల యశోదాదేవి ప్రేమానురాగాలు అంతకంతకూ పెరుగుతూ ఉంటాయి. మరో వైపున ఆయన పట్ల గోపికల ఆరాధన భావం కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. కృష్ణయ్యను విడిచి ఆయన స్నేహితులు క్షణకాలం కూడా ఉండలేకపోతుంటారు. ఇక ఆవులన్నింటి చూపూ కృష్ణయ్య ఉన్న ఇంటివైపునే. అలా అందరి మనసులను దోచుకున్న కృష్ణయ్య బృందావనాన్ని ఆనందమయం చేస్తుంటాడు. అలాంటి సమయంలోనే .. ఆ ఏడు పంటలు బాగా పండటంతో, దేవేంద్రుడిని పూజించి .. కృతజ్ఞతలు చెప్పుకోవాలని బృందావన వాసులు భావిస్తారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.