“బృందావనం”లో పంటలు బాగా పండటంతో, ప్రతి ఏడు మాదిరిగానే ఆ ఏడు కూడా దేవేంద్రుడికి పూజలు చేయాలని నందుడు చెబుతాడు. పాలు .. పెరుగు .. వెన్నె .. తేనె .. జున్ను .. పండ్లు .. వివిధ రకాల పిండి పదార్థాలను దేవేంద్రుడికి నైవేద్యంగా సమర్పించాలని అంటాడు. ఆయన చెప్పినట్టుగా చేయడానికి అందరూ కూడా సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏ ఇంట్లో చూసినా దేవేంద్రుడి పూజకు సంబంధించిన పనుల హడావిడి కనిపిస్తూ ఉంటుంది. ఈ తతంగం మొత్తం చూసిన కృష్ణుడు, దేవేంద్రుడిని ఎందుకు పూజించాలని తండ్రిని అడుగుతాడు.
పంటలు బాగా పండటం వలన .. పాడి బాగా ఉండటం వలన తామంతా సంతోషంగా ఉన్నామని నందుడు చెబుతాడు. అలా ఉండటానికి కారకుడు దేవేంద్రుడు అని అంటాడు. అందువల్లనే ఆయనను పూజించి .. నైవేద్యాలు సమర్పించడం చేస్తూ వచ్చామని చెబుతాడు. అలాగే ఈ ఏడాది కూడా పూజకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నామని అంటాడు. ఆ మాటల పట్ల కృష్ణుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. తమకి అవసరమైనవన్నీ ఇచ్చేది “గోవర్ధనగిరి” .. అలాంటి ఆ పర్వత రాజాన్ని పూజించాలిగానీ, ఎక్కడో ఉన్న దేవేంద్రుడిని పూజించడం సరికాదని అంటాడు.
ఆ మాటలకు నందుడు ఆలోచనలో పడతాడు. తామంతా కూడా “గోవర్ధనగిరి”పై ఆధారపడి ఉన్నామని కృష్ణుడు అంటాడు. తమ ఆవులన్నీ కూడా గోవర్ధనగిరి పైగల పచ్చికను మేసే పాలను ఇస్తున్నాయని చెబుతాడు. గో సంపదను మించిన సంపద మరొకటి లేదనీ, అలాంటి గో సంపద పెరగడంలో గోవర్ధనగిరి పాత్ర ప్రధానమైనదని అంటాడు. అందువలన పూజ ఏదైనా ఉంటే అది గోవర్ధనగిరికి చేయాలి .. కృతజ్ఞతలను గోవర్ధనగిరికి చెప్పుకోవాలని చెబుతాడు. కృష్ణుడు మాటల్లో నిజం ఉందని అంతా అనడంతో, నందుడు కూడా అందుకు అంగీకరిస్తాడు.
ఎప్పుడూ దేవేంద్రుడికి పూజలు చేసే గోపాలకులు అంతా కూడా ఆ ఏడు “గోవర్ధనగిరి”ని పూజించాలని నిర్ణయించుకుంటారు. ఆ దిశగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. గోవర్ధనగిరికి తరలివెళ్లి .. పిల్లాపాపలతో .. ఆవులమందతో ప్రదక్షిణాలు చేసి .. పూజ పూర్తయిన తరువాత నైవేద్యాలను సమర్పించి .. ఆ తరువాత ఆ నైవేద్యాలను ప్రసాదంగా స్వీకరించాలని నిర్ణయించుకుంటారు. గోపాలకులు తనని నిర్లక్ష్యం చేయడం పట్ల దేవేంద్రుడు తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.