కృష్ణుడి సూచనమేరకు అంతా కూడా “గోవర్ధనగిరి”ని పూజించాలని నిర్ణయించుకుంటారు. అన్ని ఏర్పాట్లను చేసుకుని గోవర్ధనగిరి దగ్గరికి చేరుకుంటారు. అయితే గోపాలకులంతా తనని విస్మరించి .. గోవర్ధనగిరికి పూజలు చేయడానికి సిద్ధపడటం పట్ల దేవేంద్రుడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. తనని పూజించకపోవడం అంటే .. తనని అవమానపరచడమేనని ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తన అనుగ్రహమే కాదు .. తన ఆగ్రహం కూడా ఎలా ఉంటుందనేది వాళ్లకు తెలిసేలా చేయాలనుకుంటాడు.
“గోవర్ధనగిరి”పై కుంభవృష్టిని కురిపించి .. గోపాలకులందరిని చెల్లాచెదురు చేయాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే తన మాయతో మేఘాలను సృష్టించి గోవర్ధనగిరి వైపుకు పంపిస్తాడు. దాంతో ఒక్కసారిగా గోవర్ధనగిరి ప్రాంతంలో వాతావరణం మారిపోతుంది. చూస్తుండగానే కారుమేఘాలు కమ్ముకొస్తాయి. భయంకరమైన వర్షం కురవబోతుందనే విషయాన్ని బలరామకృష్ణులు గ్రహిస్తారు. కానీ వాళ్లకు ఏం చేయాలో పాలుపోదు. ఈ లోగానే గాలిదుమ్ము మొదలవుతుంది.
విపరీతమైన ఆ గాలికి చెట్లు ఊగిపోతుంటాయి. ఆవుల మందలు ఎటుపడితే అటు పరుగులు తీస్తూ ఉంటాయి. పిల్లలు .. పెద్దలు అంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. అంతలోనే వాన మొదలవుతుంది. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక అంతా అలా వానలో నిలబడిపోతారు. ఇదంతా ఆ దేవేంద్రుడి పన్నాగం అనే విషయం కృష్ణుడికి అర్థమవుతుంది. తనని నమ్ముకుని వచ్చిన వాళ్లంతా అంతలా ఇబ్బంది పడుతుండటం చూసిన కృష్ణుడు, వాళ్లను కాపాడవలసిన బాధ్యత తనపైనే ఉందని భావిస్తాడు.
ఎంతమాత్రం ఆలోచన చేయకుండా “గోవర్ధనగిరి”ని పైకెత్తి గొడుగులా పడతాడు. ఎవరూ భయపడవలసిన అవసరం లేదనీ, అందరూ కూడా దాని కిందికి వచ్చేయమని చెబుతాడు. పిల్లలు .. పెద్దలు .. పశువులు అన్నీ కూడా గోవర్ధనగిరి కిందకి చేరుకుంటారు. గోవర్ధనగిరిని చిటికెన వ్రేలుపై పైకెత్తిన కృష్ణుడు .. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేననే విషయం దేవేంద్రుడికి అర్థమవుతుంది. దాంతో అహంభావంతో తాను చేసిన తప్పును మన్నించమని కోరతాడు. కృష్ణుడు శాంతించడంతో దేవేంద్రుడి మనసు స్థిమితపడుతుంది. కృష్ణుడు ఉండగా ఇక తమకి ఎలాంటి ఆపదలు .. భయాలు ఉండవనే విషయం గోపాలకులకు మరోసారి అర్థమవుతుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.