బృందావన వాసులంతా కూడా తమ ఊళ్లో భయంకరంగా రంకెలు వేస్తూ ఎద్దు రూపంలో తిరిగింది రాక్షసుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ఆ ఎద్దును కృష్ణయ్య హతమార్చాడని తెలిసి ఆనందిస్తారు. ఆ ఎద్దును అంతకుముందు ఎక్కడా చూడకపోవడం వలన తమకి అనుమానం వచ్చిందనీ, అయితే దానికి భయపడి బయటికి వెళ్లే సాహసం చేయలేకపోయామని అంటారు. ఆ ఎద్దు అడుగుల చప్పుడును తాము ఇంకా మరిచిపోలేకపోతున్నామని చెబుతారు. ఏదేమైనా కృష్ణయ్య మరో గండం నుంచి బయటపడినందుకు యశోద నందులు సంతోషిస్తారు.

కృష్ణుడిని అంతం చేయడానికి వెళ్లిన అరిష్టాసురుడు కూడా హతమైపోయినట్టు తెలుసుకున్న కంసుడు కంగుతింటాడు. అరిష్టాసురుడు ఎంతో తెలివైనవాడు .. మహా మాయావి. అలాంటి అసురుడు కాలుదువ్వితే నియంత్రించడమే కష్టం .. అలాంటిది అతణ్ణి అవలీలగా హతమార్చడమా? అని నివ్వెరపోతాడు. బాహుబలం .. బుద్ధి బలం .. మాయాబలం .. ఇవన్నీ కూడా కృష్ణుడిని ఏమీ చేయలేకపోతున్నందుకు నీరసపడిపోతాడు. వెళ్లినవాళ్లు వెళ్లినట్టే పరలోకానికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని పంపించాలి? అనే ఆలోచనలో పడతాడు.

“కేశి” .. దేవేంద్రుడిని సైతం ఎదిరించి నిలిచిన అసురుడు. ఎంతటి బలశాలినో .. అంతటి మాయావి. అలాంటి “కేశి”ని పంపించడం వలన ప్రయోజనం ఉండవచ్చని చెప్పేసి అనుకుంటాడు. కంసుడు తలచుకున్నదే ఆలస్యం .. “కేశి” ఆయన ఎదుట ప్రత్యక్షమవుతాడు. అత్యవసర పరిస్థితుల్లో ఆయనను పిలిచినట్టుగా కంసుడు చెబుతాడు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదీ .. ఎవరిని అంతం చేయడానికి ఆరాటపడుతున్నది వివరిస్తాడు. ఈ విషయమై ఇంకా ఆందోళన చెందవలసిన అవసరం లేదనీ, తాను చూసుకుంటానని “కేశి” బయల్దేరతాడు.

“కేశి” .. గుర్రం రూపాన్ని ధరించి బృందావనంలోకి ప్రవేశిస్తాడు. పెద్దగా సకిలిస్తూ జనంపైకి దూసుకురావడం మొదలుపెడతాడు. బలమైన అశ్వం అలా ఒక్కసారిగా మీదకి దూసుకువస్తుండటంతో బృందావన వాసులంతా కేకలు పెడుతూ పరుగులు తీయడం మొదలుపెడతారు. ఆ గగ్గోలు విన్న కృష్ణుడు బయటికి వస్తాడు. అతణ్ణి చూడగానే గుర్రం మరింత వేగంగా దూసుకువస్తుంది. తనపైకి వస్తున్నది ఎవరనేది కృష్ణుడికి అర్థమైపోతుంది. అశ్వరూపంలో ఉన్న అసురుడిని అంగుళం కూడా కదలనివ్వక పట్టుకున్న కృష్ణుడు, దానిని గిరగిరా తిప్పేసి నేలకి కొడతాడు. అంతే నిజరూపాన్ని పొందిన “కేశి” .. పైకి లేవడానికి ప్రయత్నించి కూలిపోతాడు. అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతాయి.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.