“విదర్భ” రాజ్యాన్ని భీష్మకుడు అను రాజు పరిపాలిస్తూ ఉంటాడు .. ఆయన కుమార్తెనే “రుక్మిణీ దేవి”. ఆమె సౌందర్యాన్ని గురించి తెలిసిన దగ్గర నుంచి ఆమెనే పెళ్లి చేసుకోవాలని కృష్ణుడు అనుకుంటాడు. ఇక కృష్ణుడి రూపం .. ఆయన వీరోచిత కార్యాలను గురించి వినిన రుక్మిణీదేవి కూడా ఆయననే వివాహమాడాలని నిర్ణయించుకుంటుంది. ఒకరికి సంబంధించిన ఊహలతో మరొకరు కాలం గడుపుతూ ఉంటారు. రుక్మిణీ దేవి కృష్ణుడిని ఆరాధిస్తోందని తెలుసుకున్న భీష్మకుడు, ఆమె ఇష్ట ప్రకారమే వివాహం జరిపించాలని భావిస్తాడు.
అయితే మొదటి నుంచి కూడా రుక్మిణీదేవి సోదరుడు రుక్మి, కృష్ణుడి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉంటాడు. అందువలన కృష్ణుడికి రుక్మిణిని ఇవ్వడానికి వీల్లేదని అడ్డుచెబుతూ ఉంటాడు. తన స్నేహితుడైన శిశుపాలుడే రుక్మిణికి తగినవాడని వాదిస్తూ ఉంటాడు. రుక్మిణికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆమె వివాహం అతనితోనే జరగాలని పట్టుపడతాడు. భీష్మకుడికి ఇష్టం లేకపోయినా, రుక్మి మాటను కాదనలేకపోతాడు. దాంతో రుక్మిణీదేవి ఆందోళన చెందుతూ ఉంటుంది. తన మనసులోని కోరికను ఎవరూ పట్టించుకోకుండగా పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో కన్నీళ్ల పర్యంతమవుతుంది.
ఏడుస్తూ కూర్చోవడం వలన కాలం వృథా అవుతుంది .. ముహూర్త సమయం దగ్గర పడుతుంది. అందువలన ఏదైనా ఉపాయం చేత ఈ గండం నుంచి బయటపడాలని రుక్మిణీదేవి నిర్ణయించుకుంటుంది. వెంటనే తనకి బాగా తెలిసిన “అగ్నిద్యోతనుడు” అనే బ్రాహ్మణుడిని రహస్యంగా రప్పిస్తుంది. కృష్ణుడి పట్ల తనకి గల ప్రేమను గురించి వివరిస్తుంది. తన మనసులో ఆయనకి మాత్రమే స్థానం ఉందని చెబుతుంది. తన భర్తగా ఆయనను మాత్రమే ఊహించగలనని ఆవేదన వ్యక్తం చేస్తుంది. వెంటనే కృష్ణుడిని కలిసి తన పరిస్థితిని వివరించమని కోరుతుంది.
రుక్మిణీదేవి ఆవేదనను .. కృష్ణుడిపట్ల ఆమెకి గల ప్రేమను అగ్నిద్యోతనుడు అర్థం చేసుకుంటాడు. క్షణకాలమైననూ వృథాచేయక “ద్వారక” చేరుకుంటాడు. కృష్ణుడిని కలుసుకుని తాను వచ్చిన పనిని గురించి చెబుతాడు. శిశుపాలుడితో ఆమె వివాహానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయనీ, రుక్మిణీదేవి క్షణమొక యుగంలా గడుపుతోందని అంటాడు. తనని కాపాడే విధానాన్ని కూడా రుక్మిణీదేవి సెలవిచ్చిందని అంటూ ఆమె మనసులోని ఉద్దేశాన్ని కృష్ణుడికి వివరిస్తాడు. ఆ విధంగా చేయడానికి కృష్ణుడు అంగీకరిస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.