విదర్భలోని “కుండిన నగరం”లో రుక్మిణీ కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. శిశుపాలుడు తన పరివారంతో అక్కడికి చేరుకుంటాడు. రాజలాంఛనాలతో ఆయన పరివారానికి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మరో వైపున రుక్మిణీదేవిని పెళ్లి కూతురుగా అలంకరిస్తారు. తాను చెప్పిన సమయానికి కృష్ణుడు వస్తాడా లేదా అనే సంశయం ఆమెను బాధిస్తూ ఉంటుంది. వివాహానికి ముందుగా తమ కులదైవమైన “మంగళగౌరీ”ని దర్శించుకు రావడానికి రుక్మిణీదేవి బయల్దేరుతుంది. ఆమెతో పాటు చెలికత్తెలు కూడా ఆలయానికి బయల్దేరతారు.
రుక్మిణీదేవికి రక్షణగా కొంత సైన్యం కూడా ఆమె వెంట వస్తుంది. అలా రుక్మిణీదేవి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. కృష్ణుడితోనే తన వివాహం జరగాలని మనసులోనే అమ్మవారిని కోరుకుంటూ, ఆయన త్వరగా వచ్చి తనని తీసుకెళ్లాలని ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటుంది. అలా మనసంతా కృష్ణుడి గురించిన ఆలోచనలతోనే అమ్మవారికి నమస్కరించుకుని, ఆలయం బయటికి వస్తుంది. అక్కడి నుంచి ఆమె అలా వస్తుండగానే ఒక్కసారిగా మెరుపువలె వచ్చి కృష్ణుడి రథం ఆమె ముంగిట వాలుతుంది. సైనికులంతా ఏం జరుగుతుందో తెలుసుకునేంతలో, రుక్మిణిదేవిని కృష్ణుడు రథంపైకి లాక్కోవడం .. రథం పరుగులు తీయడం జరిగిపోతుంది.
రుక్మిణీదేవి వెంట వచ్చిన సైనికులు తేరుకునే సరికి కొంత సమయం పడుతుంది. ఆ వెంటనే వాళ్లు తమ అశ్వాలపై కృష్ణుడి రథాన్ని వెంబడించడం మొదలుపెడతారు. ఉహించని హఠాత్పరిణామానికి విస్తుపోయిన చెలికత్తెలు, ఈ విషయాన్ని మహారాజుకు చెప్పడానికిగాను అక్కడికి పరుగుతీస్తారు. అమ్మవారి దర్శనానికి వెళ్లిన రుక్మిణీదేవిని కృష్ణుడు అపహరించాడనే వార్తతో “కుండిన నగరం”లో గగ్గోలు మొదలవుతుంది. విషయం తెలియగానే రుక్మి ఆగ్రహావేశాలకు లోనవుతాడు.
కృష్ణుడికి తగిన విధంగా బుద్ధి చెప్పేసి, రుక్మిణిని తీసుకువస్తానని చెప్పి తన పరివారంతో బయల్దేరతాడు. రుక్మిణీదేవీని కృష్ణుడు తీసుకువెళుతున్న రథాన్ని తన రథంపై వెంబడిస్తాడు. కృష్ణుడిపై వివిధ రకాల ఆయుధాలను ప్రయోగిస్తూ, నానామాటలు అనడం మొదలుపెడతాడు. అప్పటివరకూ రుక్మిణీదేవి నొచ్చుకుంటుందని భావించిన కృష్ణుడు, తన విల్లుకు పనిచెబుతాడు. రుక్మిని క్షణాలలో నిరాయుధుడిని చేసి, అతని గెడ్డం … మీసం .. తల సగభాగాలు గొరిగేస్తాడు. అవమానభారంతో రుక్మి అక్కడి నుంచి వెనుదిరుగుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.