విదర్భ దేశానికి చెందిన “కుండినపురము” నుంచి రుక్మిణీదేవిని అపహరించిన కృష్ణుడు, ఆమెను వెంటబెట్టుకుని ద్వారక చేరుకుంటాడు. రుక్మిణీదేవిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించిన ద్వారకవాసులు సంతోష సంబరాల్లో మునిగిపోతారు. రుక్మిణీ కృష్ణుల కల్యాణానికి చకచకా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రజలంతా కూడా తమ ఇంట్లో పెళ్లి మాదిరిగానే సందడి చేస్తుంటారు. ప్రతి ఇల్లు .. ప్రతి వీధి మంగళ తోరణాలతో కళకళలాడుతూ ఉంటాయి. విశాలమైన భవనాలు శోభాయమానంగా వెలుగులను వెదజల్లుతూ ఉంటాయి.
రుక్మిణీ కృష్ణుల కల్యాణానికి వివిధ దేశాలకు చెందిన రాజులు .. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలి వస్తుంటారు. ద్వారకవాసులంతా పిండివంటలను సిద్ధం చేసుకోవడమే కాకుండా, ఎక్కడికక్కడ వేదికలను ఏర్పాటు చేసుకుని సంగీత నృత్య గీతాదులతో సందడి చేస్తుంటారు. కృష్ణుడి పట్ల తమకి గల ప్రేమాభిమానాలను చాటుకోవడానికి ఆయనకి ఎలాంటి కానుకలు ఇస్తే బాగుంటుందా అనే విషయంలో అంతా తర్జనభర్జనలు పడుతుంటారు. నూతన వస్త్రాలను ధరించినవారితో ద్వారక మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై రుక్మిణి కృష్ణుల కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వివిధరకాల పూలహారాలతో వేదికను అద్భుతంగా .. అపూర్వంగా అలంకరిస్తారు. ద్వారకవాసులతో పాటు .. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజలంతా ఆ వేదిక చుట్టూ ఆసీనులవుతారు. రుక్మిణి కృష్ణులు వేదికపైకి చేరుకుంటారు. లక్ష్మీదేవిలా కళకళలాడుతున్న రుక్మిణీదేవిని చూసిన ప్రజలు తమ దిష్టి తగులుతుందేమోనని అనుకుంటారు. కృష్ణయ్య సమ్మోహనమైన రూపాన్ని చూస్తూ తమని తాము మరిచిపోతారు.
ఒక శుభ ముహూర్తాన రుక్మిణి కృష్ణుల కల్యాణం అంగరంగవైభవంగా జరుగుతుంది. తాను కోరుకున్నట్టుగానే కృష్ణుడి అర్థాంగిని కాగలిగినందుకు రుక్మిణీ దేవి సంతోషంతో పొంగిపోతుంది. ఇంతకుమించి తనకి ఇక ఏ వరమూ అవసరం లేదని భావిస్తుంది. కృష్ణుడి సేవలోనే తన జీవితం ధన్యం కావాలని మనసారా కోరుకుంటుంది. ఆమె కళ్లలోని సంతోషము .. సంతృప్తి చూసి కృష్ణుడు కొంటెగా నవ్వుతాడు. సుకుమారమైన ఆమె చేతిని సున్నితంగా అందుకుని ప్రేమగా అక్కున చేర్చుకుంటాడు. ముచ్చటైన ఆ జంటను చూసి ప్రజలంతా మురిసిపోతారు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.