Ugadi Rasi Phalalu 2025 “విశ్వావసు” నామ సంవత్సర ఉగాది సందర్బంగా అన్ని రాశుల వారికి కొత్త తెలుగు సంవత్సరంలో జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం ఉగాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Telugu yearly rashi phalalu 2025 for all 12 zodiac signs. viswavasu nama samvatsara rasi phalalu 2025. moonsign based telugu yearly horoscope 2025.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆదాయం – 2, వ్యయం – 14, రాజపూజ్యం – 5, అవమానం – 7

వీరికి ఈ సంవత్సరం ఏల్నాటి శని ప్రారంభం. గురువు, రాహు,కేతువుల సంచారం అనుకూలం. కొన్ని ఆటుపోట్లు, సమస్యలు ఎదురైనా మొత్తానికి అధిగమించి శుభదాయకంగానే గడుపుతారు. శని ప్రభావంతో రాబడి కంటే ఖర్చులు పెరిగి అప్పుల కోసం అన్వేషిస్తారు. ఇక మే 18 వరకు గురువు వృషభ రాశిలో సంచార సమయంలో ధన లాభాలు, స్థిరాస్తుల కొనుగోలులో అవాంతరాలు తొలగడం, సంతాన విషయంలో సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి. ఈతి బాధలు, సమస్యల నుంచి కొంత వరకూ బయటపడతారు. సోదరులు, బంధువుల నుంచి సకాలంలో ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు కృషి ఫలించి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పట్టుదలతో కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించడం ముఖ్యం. ఉదర సంబంధిత రుగ్మతలు ఇబ్బంది పెట్టవచ్చు. ఇంట వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు, తద్వారా ఖర్చులు ఉంటాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అనూహ్యంగా కొన్ని విద్యావకాశాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపంలో పెడతారు. విరివిగా తీర్థ యాత్రలు చేస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారస్తులు ఊహించని విధంగా లాభాలు పొందుతారు. పెట్టుబడులపై తుది నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. ఉద్యోగస్తులు అంకితభావంతో పనిచేస్తారు. కొందరికి బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల కృషి ఫలించి ముందడుగు వేస్తారు. రాజకీయవేత్తల యత్నాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. కళాకారులకు చేజారిన కొన్ని అవకాశాలు తిరిగి దక్కవచ్చు. వ్యవసాయదారులకు పెట్టుబడులు సమకూరతాయి. మే అక్టోబర్ మధ్య కాలం, నవంబర్ నుండి సంవత్సరాంతం వరకు సామాన్యంగానే గడుస్తుంది.

వీరు శనైశ్చరునికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామికి అర్చనలు, దుర్గా స్తోత్రాల పఠనం చేయడం ఉత్తమం.
అదృష్ట సంఖ్య – 9.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం – 11, వ్యయం – 5, రాజపూజ్యం – 1, అవమానం – 3

ఈ రాశి వారికి శని, గురుల అనుకూల సంచారం బాగా కలిసి వస్తుంది. రాహువు కూడా కొంతమేర శుభ ఫలితాలు ఇస్తాడు. ఆదాయం సమృద్ధిగా ఉండి ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులను కొంతమేర తగ్గించే చర్యలు చేపడతారు. సమాజంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. మొత్తానికి అన్ని విధాలా గతం కంటే శుభఫలితాలు అధికం. బంధువుల ద్వారా సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు నడిపే వారు జాగ్రత్తలు పాటిస్తే మంచిది. కొన్ని ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొన్ని సంఘటనలు మీలో ఆలోచనలు కలిగిస్తాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి విశేష గుర్తింపు, విదేశీ పర్యటనలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని విధంగా అవకాశాలు రాగలవు. ఇంటి నిర్మాణాలకు ద్వితీయార్థంలో శ్రీకారం చుడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడులపై దృష్టి పెట్టి కొత్త సంస్థల ఏర్పాటు పై నిర్ణయాలు తీసుకుంటారు. లాభాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగవర్గాలకు బాధ్యతల నిర్వహణలో అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది. మే అక్టోబర్ మధ్య మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాల చిరకాల స్వప్నం ఫలిస్తుంది. కళాకారుల శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ఏడాది మధ్యలో ఘన విజయాలు చూస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ సానుకూలం. అక్టోబర్, నవంబర్, జనవరి నెలల్లో కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చికాకులు, ధన వ్యయం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి.

వీరు కేతువుకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
అదృష్ట సంఖ్య – 6.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం – 14, వ్యయం – 2, రాజపూజ్యం – 4, అవమానం – 3

ఈ రాశి వారికి మే 15 నుండి గురువు అనుకూలిస్తాడు. శని, రాహు కేతువులు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. ఆదాయంతో పాటు, సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. మరోవైపు ఖర్చులు కూడా అధిగమించాల్సి వస్తుంది. బంధువర్గం వారు సాయం అందించడంలో పాటు వారి నుండి ఒత్తిడులు కూడా పెరుగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. కుటుంబ సభ్యుల కంటే స్నేహితుల సాయమే ఎక్కువగా లభిస్తుంది. ఆర్థికపరమైన హామీలకు మాత్రం దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలు సైతం చికాకు పరుస్తాయి. ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. జీవిత భాగస్వామి తరఫు నుండి ఎంతో కొంత ధన లేదా ఆస్తి లాభం కలుగుతుంది. వారసత్వ ఆస్తి కూడా లభించవచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు ప్రథమార్ధంలో పూర్తి కాగలవు. వివాహాది శుభకార్యాలతో హడావిడిగా గడుపుతారు. తరచూ తీర్థయాత్రలు, దైవదర్శనాలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలతో పాటు కొద్దిపాటి ఆటుపోట్లు సైతం చూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. ద్వితీయార్థంలో పదోన్నతులకు అవకాశం. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు, కొత్త సంస్థల స్థాపనకు శ్రీకారం. రాజకీయవర్గాల వారు అనూహ్యమైన కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు అవకాశాలు మరింతగా దక్కించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యవసాయదారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఏప్రిల్, జూలై, నవంబర్ నెలలు సామాన్యంగా ఉండవచ్చు.

వీరు తరచూ ఆంజనేయ స్వామికి అర్చనలు చేయడం ఉత్తమం. అదృష్టసంఖ్య – 5

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం – 8, వ్యయం – 2, రాజపూజ్యం – 7, అవమానం – 3

వీరికి మే 14వరకు గురుడు విశేషమైన యోగకారకుడు. తదుపరి అక్టోబర్18 వరకు ఖర్చులు, కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. సంపాదన అంతా వివిధ రూపాల్లో ఖర్చులు చేయాల్సిన పరిస్థితి, ఆ తరువాత నవంబర్ 11 వరకు కర్కాటరాశిలో సంచారం శుభకరం. ఇది గురునికి ఉచ్ఛస్థితి కావడం కలిసివచ్చే అంశం. ఇంతవరకూ ఇబ్బందులు పెట్టిన అష్టమ శని దోషం తొలగినా మే 19 నుండి అష్టమ రాహువు, కుటుంబ స్థానంలో కేతు సంచారం ప్రతికూలం. మొత్తానికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాబడి ఉన్నా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు నెమ్మదిస్తాయి. ఎంతగా కష్టించినా ఫలితం ఆశించినస్థాయిలో ఉండదు. ఆప్తుల ద్వారా వివిధ విషయాలపై ఒత్తిడులు ఎదుర్కొంటారు. కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు అవకాశం. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అక్టోబర్ నవంబర్ నెలలో అనుకూలిస్తాయి. అష్టమ రాహు దోషం వల్ల వాహనాల విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తత అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఉదర, ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రథమార్థంలో బంధువుల హడావిడితో కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు వివాహయోగం. ఆస్తుల వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు కొనసాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు, స్వల్పంగా ఇంక్రిమెంట్లు రావచ్చు. కొంత అదనపు బాధ్యతలు మీదపడి సతమతం కాగలరు. పారిశ్రామికవర్గాలకు అనుకున్న కార్యాలలో అడ్డంకులు కొంత తొలగుతాయి. రాజకీయవర్గాల వారికి మిశ్రమంగా ఉంటుంది. కళాకారులు అనుకున్నది సాధించినా కొంత కష్టపడాలి. విద్యార్థుల విదేశీ విద్యావకాశాల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యవసాయదారులలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

వీరు గురు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం మంచిది. నిత్యం హనుమాన్నామస్మరణ మంచిది.
అదృష్టసంఖ్య – 2

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఆదాయం – 11, వ్యయం – 11, రాజపూజ్యం – 3, అవమానం – 6

వీరికి గురువు అక్టోబర్18 నుండి నవంబర్ 11 మధ్య కర్కాటక రాశిలో సంచారం మినహా, మిగతా కాలమంతా శుభుడే. అష్టమ శని మాత్రం ప్రభావం చూపుతుంది. అలాగే, రాహుకేతువులు మిశ్రమంగా ఫలితాలు ఇస్తారు. గురుని ప్రభావంతో ఆదాయం తగినంత సమకూరినా శని ప్రభావంతో కొన్ని అదనపు ఖర్చులు వచ్చిపడతాయి. అలాగే, కుటుంబంలో కలహాలు, మానసిక సంఘర్షణ మధ్య గడుపుతారు. అయితే గురుబలం వల్ల కొంత గట్టెక్కుతారు. ఇక కేతువు ప్రభావం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అధికంగా దృష్టి సారిస్తారు. సప్తమ రాహువు కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, వైరుధ్యాలు నెలకొనవచ్చు. కొంత సంయమనం పాటిస్తూ ముందుకు సాగడం ఉత్తమం. అలాగే, ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడుతూ, సమయానుసారం ఆహారవిహారాదులు పూర్తి చేయడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో మీరు నమ్మిన వ్యక్తులే సాయానికి వెనుకంజ వేయవచ్చు. సమాజంలో మాత్రం విశేష గౌరవం పొందుతారు. అయితే కుటుంబంలో మాత్రం వ్యతిరేక పరిస్థితులు చూస్తారు. వివాహయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యవహారాలు కొంత ఆలస్యంగానైనా పూర్తి కాగలవు. వాహనాలు, కొత్త ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు ద్వితీయార్థంలో సఫలం. కోర్టు వ్యవహారాలు కొనసాగుతూనే ఉంటాయి. వ్యాపార, వాణిజ్యరంగాల వారికి పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు. అయితే సరైన గిరాకీ లేకపోవడంతో కాస్త ఆందోళన చెందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు అధికమై విధుల పట్ల విరక్తిభావం కలుగుతుంది. అయితే అనూహ్యంగా జరిగే మార్పులు ఉపకరిస్తాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి మంచి గుర్తింపు లభించే కాలం. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. రాజకీయవర్గాలకు ఒక పిలుపు ఊరటనిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులు శ్రమానంతరం ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. అక్టోబర్ నవంబర్ మధ్య అన్నింటా మరింత అప్రమత్తతో మెలగాలి.

వీరు శనికి పరిహారాలు చేయించుకోవాలి. శ్రీ నరసింహ స్తోత్రాలు పఠించండి.
అదృష్ట సంఖ్య – 1

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

ఆదాయం – 14, వ్యయం – 2, రాజపూజ్యం – 6, అవమానం – 6

ఈ సంవత్సరం విశేష గురు బలంతో విజయాల బాటలో దూసుకువెళతారు. సప్తమంలో శని కొంత ప్రతికూలం కాగా, షష్టమంలో రాహువు, వ్యయంలో కేతువు ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. మొత్తానికి వీరు ఎదురులేని విధంగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో మరింత ప్రగతి సాధిస్తారు. ఒకరి ద్వారా ఆశలు వదులుకున్న ధనం కూడా అందుతుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పులకు అవకాశం. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు ఆచరిస్తారు. కొన్ని సమస్యలు వీడి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆస్తులు కొనుగోలులో ముందుంటారు. ఈ ఏడాది గృహ యోగం, వివాహాది శుభకార్యాల నిర్వహణ వంటి వాటికి ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. విద్యార్థులు ఊహించని ర్యాంకులు సాధిస్తారు. వ్యాపార, వాణిజ్యరంగాల వారికి ఇతోధికంగా లాభాలు రాగలవు. అలాగే, భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు తాము ఊహించిన దానికంటే అధికంగా లబ్ధి చేకూరుతుంది. పారిశ్రామికవర్గాల నూతన ప్రాజెక్టులు చేపడతారు. ఐటీ నిపుణులకు చెప్పుకోతగిన మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలకు పదవులు రావచ్చు. కళాకారులు అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యవసాయదారుల ఆశలు నెరవేరతాయి. అయితే సప్తమ శని, వ్యయంలో కేతువు ప్రభావం వల్ల చర్మ, నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. అలాగే, భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు నెలకొంటాయి. తొందరపాటు మాటలు లేకుండా, ఆచితూచి వ్యవహరిస్తూ సాగడం మంచిది. మే 18 వరకు ప్రయాణాలు, ఇతర ముఖ్య వ్యవహారాలలో మరింత జాగ్రత్తలు పాటించాలి. మిగతా నెలలు అనుకూలమే.

వీరు శని, కేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. శ్రీ దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు పఠించండి.
అదృష్ట సంఖ్య – 5.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం – 11, వ్యయం – 5, రాజపూజ్యం – 2, అవమానం – 2

వీరికి మే14 నుండి అష్టమ గురు దోషం తొలగిపోనుంది. ఇక అంతా మంచిరోజులే. ప్రధాన గ్రహాలైన గురు, శని అనుకూల సంచారం శుభదాయకం. ఇక రాహు, కేతువులు సామాన్య ఫలితాలు ఇస్తారు. మొత్తానికి గతం కంటే అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా పరిపుష్ఠి సాధిస్తారు. ఇతరుల వద్ద నిలిచిపోయిన ధనం చేతికందుతుంది. స్థిరాస్తులు సైతం సమకూరతాయి. ముఖ్యంగా తండ్రి ద్వారా రావలసిన ఆస్తులు దక్కవచ్చు. కుటుంబంలోనూ ప్రశాంతత చేకూరుతుంది. సుదీర్ఘకాలంగా భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగి సమన్వయంతో ముందుకు సాగుతారు. సంతాన విషయంలో మీ అంచనాలు నిజం కాగలవు. శత్రువులుగా మారిన బంధువులు కొందరు తప్పిదాన్ని తెలుసుకుంటారు. వివాహాది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. కొన్ని సమస్యలు వాటంతట అవే తీరి ఊరట చెందుతారు. సమాజంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వాహన, గృహ యోగాలు కలుగుతాయి. కాంట్రాక్టర్లకు మరిన్ని టెండర్లు దక్కవచ్చు. తరచూ తీర్థ యాత్రలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తల ఆశలు ఫలిస్తాయి. విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. పై స్థాయి వారి సహకారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు చిక్కులు తొలగనున్నాయి. వీరికి ఒక అవకాశం ఊహించని రీతిలో రానుంది. రాజకీయ నాయకులు గతం కంటే మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆశయాలు ఫలించే శుభకాలం. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. శాస్త్ర సాంకేతిక రంగాల వారు పరిశోధనల్లో విజయాలు సాధిస్తారు. మే వరకూ ఆరోగ్య, కుటుంబసమస్యలు. వృథా ఖర్చులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఈ సమయంలో గురునికి పరిహారాలు చేయించుకోవాలి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం మంచిది.

వీరు నిత్యం ఆంజనేయ దండకం పఠించడం ఉత్తమం.
అదృష్ట సంఖ్య – 6.

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం – 2, వ్యయం – 14, రాజపూజ్యం – 5, అవమానం – 2

ఈ సంవత్సరం గురు, రాహువులతో పరీక్షా కాలంగా ఉంటుంది. మే 14 నుండి అక్టోబర్18వరకు, తిరిగి నవంబర్11 నుండి అష్టమ గురు దోషం. అలాగే, మే 19 నుండి సంవత్సరమంతా అర్థాష్టమ రాహు దోషం ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు లేకున్నా ఖర్చులు అధికమై సతమతం కాగలరు. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు సైతం చేజారి నిరాశ చెందుతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మీ మాటకు కుటుంబంలో సానుకూలత రాకపోవచ్చు. ప్రతి వ్యవహారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఏ నిర్ణయమైనా ఆప్తుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం. మిత్రులు, సన్నిహితులతో అకారణంగా వైరం. వాహనాలు, భూములు కొనాలన్న ఆలోచన కలిగి ఆ దిశగా అడుగులు వేస్తారు. అయితే కష్టసాధ్యమైనా ప్రయత్నం ఫలిస్తుంది. చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపడతారు. అక్టోబర్ నవంబర్ మధ్య గురు బలం వల్ల ఆకస్మిక ధన లబ్ధి. మానసిక ప్రశాంతత, పరిపూర్ణ ఆరోగ్యం సమకూరతాయి. శాస్త్ర సాంకేతిక రంగాల వారుతమ ప్రతిభను చాటుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలను సమస్థాయిలో పొందుతారు. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు విధుల్లో కొన్ని అవాంతరాలు వచ్చిన అధిగమిస్తారు. కొన్ని బదిలీలు నిలిచిపోయే అవకాశం ఉంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు, కొత్త సంస్థలకు అనుమతుల కోసం యత్నిస్తారు. రాజకీయవర్గాలకు సరైన గుర్తింపు దక్కవచ్చు. కళాకారులకు అనుకోని అవకాశాలు కొంత ఊరటనిస్తాయి. విద్యార్థుల యత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. గురుని అష్టమ స్థితి, రాహువు అర్థాష్టమ స్థితి వల్ల మానసిక ఆందోళన. చికాకులు. ఇతరులతో మాటపడాల్సిన పరిస్థితి ఉంటుంది.

వీరు కనకధారా స్తోత్రాలు పఠిస్తే మంచిది.
అదృష్ట సంఖ్య – 9.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ఆదాయం – 5, వ్యయం – 5, రాజపూజ్యం – 1, అవమానం – 5.

కొన్ని సమస్యలు ఎదురైనా కఠోర శ్రమ, చాకచక్యంగా అధిగమిస్తారు. మనోబలమే వీరికి ఆయుధం. ఏ మాత్రం దిగాలు చెందక దీక్షగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. వీరికి అర్థాష్టమ శనితో పాటు, అక్టోబర్ నవంబర్ మధ్య అష్టమ గురువు దోషకారులు. రాహు,కేతువులు శుభదాయమైన ఫలితాలు ఇస్తారు శని, అష్టమ గురుడు ఆరోగ్యం పై ప్రభావం చూపుతారు. ఆయా కాలాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే, నేత్ర, ఉదర, హృదయ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. పేరుప్రతిష్ఠలకు కూడా భంగం కలుగుతుంది. ఎవరినీ అతిగా విశ్వసించకుండా దైవం పై భారం మోపి ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల్లోనూ విలువైన వస్తువులు చేజారే వీలుంది. కుటుంబంలో సమస్యలు పెరిగి సవాలుగా నిలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో పట్టువిడుపు ధోరణి మంచిది. ఇక డిసెంబర్ నుండి గురువు శుభఫలితాలు ఇస్తాడు. ఆదాయం పెరిగి అవసరాలకు లోటు రాదు. అలాగే, మానసిక ప్రశాంతత, ఒడిదుడుకుల నుండి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. వ్యాపార, వాణిజ్య రంగాలలో లాభనష్టాలను సమానంగా స్వీకరించాల్సి వస్తుంది. అయితే పెట్టుబడుల అన్వేషణ ఫలిస్తుంది. భాగస్వాముల చేయూతతో సమస్యలు తీరతాయి. ఉద్యోగస్తులకు పని భారం మరింతగా పెరిగినా కొంత కీర్తి కూడా దక్కుతుంది. అయితే సంవత్సరాంతంలో పదోన్నతులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు చేసే యత్నాలు ముందుకుసాగని పరిస్థితి. అధికారుల నుండి సమస్యలు రావచ్చు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి నెలకొన్నా గౌరవానికి లోటు రాదు. కళాకారులు అనుకున్న అవకాశాలు సాధించేందుకు శ్రమపడాలి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు ద్వితీయార్థంలో అనుకూల స్థితి. వీరు శని, గురువులకు తగిన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి.

రుద్రాభిషేకాలు చేయించుకుంటే మంచిది.
అదృష్ట సంఖ్య – 3.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)

ఆదాయం – 8, వ్యయం – 14, రాజపూజ్యం – 4, అవమానం – 5

వీరికి మే 14 వరకు, తిరిగి అక్టోబర్ నవంబర్ మధ్య గురువు యోగకారకుడు, మిగతా కాలమంతా దోషకారి. అలాగే, శని సంవత్సరమంతా శుభఫలితాలు ఇస్తాడు. ఇక రాహు, కేతువుల సంచారం మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడతారు. ఖర్చులు అధికమై అప్పులు విపరీతంగా చేస్తారు. అయితే సమాజంలోనూ, కుటుంబంలోనూ మీ పై నమ్మకం సడలిపోదు. మీమాటే నెగ్గవచ్చు. ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్న వ్యక్తులు దగ్గరకు చేరి సాంత్వన చేకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి చేరువుగా ఉంటాయి. ఆపన్నులకు చేతనైన సహాయం అందించేందుకు ముందుంటారు. ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించి పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో సఫలత చెందుతారు. భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత నెలకొంటుంది.
బంధుమిత్రులతో మీ అభిప్రాయాలను పంచుకుంటారు. కొన్ని సేవాకార్యక్రమాలు చేపడతారు. తరచూ ప్రయాణాలు సంభవం. విదేశీ ప్రయాణాలు కూడా ఉండవచ్చు. శుభకార్యాల నిర్వహణకు సమాయత్తమవుతారు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం కూడా తరచూ ఇబ్బంది కలిగిస్తుంది. వైద్యసేవలు అవసరం కావచ్చు. కుంభంలో రాహువు, మే, అక్టోబర్, డిసెంబర్ తరువాత మిథునంలో గురువు ప్రభావంతో కొన్ని హఠాత్తు పరిణామాలు, సంఘటనలు ఎదురుకాగలవు. రక్త, నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు కలిగే అవకాశం. మొత్తానికి వీరు మనోనిబ్బరంతో గడపడం ఉత్తమం. ఇక వ్యాపార, వాణిజ్య రంగాలలో సమతుల్యత పాటించాలి. లాభాలు దక్కినా వాటిని సద్వినియోగం చేయాలి. ఉద్యోగస్తులు విధుల పట్ల అంకితభావం చూపుతారు. సరైన గుర్తింపు ఇంతకాలానికి దక్కుతుంది. పారిశ్రామికవర్గాలకు ఊహించని విధంగా అనుమతుల దక్కి అగ్రిమెంట్లు కుదురుతాయి. రాజకీయవేత్తలకు నవంబర్నెల అత్యంత శుభదాయకంగా ఉంటుంది. కళాకారులు స్వయంగా నిర్ణయాలు తీసుకుని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు ఆశించిన విధంగా ఫలితాలు రావచ్చు. వ్యవసాయదారుల కృషి, యత్నాలు ఫలిస్తాయి.

వీరు గురు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం, దుర్గాదేవిని ఆరాధించడం మంచిది.
అదృష్ట సంఖ్య – 8.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఆదాయం – 8, వ్యయం – 14, రాజపూజ్యం – 7, అవమానం – 5

వీరికి ఏల్నాటి శని చివరి దశకు చేరుకుంది. అయితే శని సువర్ణమూర్తి కావడం శుభకరం. గురు సంచారం కూడా శుభదాయకమే. ఇక జన్మ రాశిలో రాహువు, సప్తమంలో కేతువు సంచారం ప్రతికూల అంశాలు. మొత్తానికి వీరికి శని, గురులు మంచి ఫలితాలు ఇస్తారు. ధనానికి లోటు రాదు. ఎవరిపైనా ఆధారపడకుండా వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. ఒక సమాచారం మీకు విశేష లాభాన్నిస్తుంది. ఇంట్లో శుభకార్యాల హడావిడి పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న అపోహలు తొలగుతాయి. వాహనాలు, ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరే కాలం. సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఎక్కువ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశముంది. అక్టోబర్ నవంబర్ మధ్య కాలంలో ఆరోగ్యం ముఖ్యంగా నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. వ్యాపార, వాణిజ్య రంగాలు క్రమేపీ పుంజుకుని లాభాలు ఊరటనిస్తాయి. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉంటాయి. అదనపు పని భారం తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే సూచనలు. వీరి మాటకు తిరుగు ఉండదు. కళాకారుల కలలు ఫలిస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. విద్యార్థులకు రెండుమూడు అవకాశాలు దక్కవచ్చు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభసాటిగా ఉంటుంది.

శనికి తైలాభిషేకాలు, దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయడం ఉత్తమం. నిత్యం ఆదిత్యహృదయ పఠననం మంచిది.
అదృష్ట సంఖ్య – 8.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం – 5, వ్యయం – 5, రాజపూజ్యం – 3, అవమానం – 1

వీరికి జన్మరాశిలో శని సువర్ణమూర్తి కావడం, రాహువు, కేతువులు కూడా సువర్ణమూర్తులుగా సంచారం, మే 14 తరువాత గురువు ప్రభావంతో అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండానే సర్దుబాటు కాగలదు. అప్పులు చేసినా వెనువెంటనే తీరుస్తారు. ఇష్టమైన వ్యక్తులు మరింత దగ్గరవుతారు. తీర్థ యాత్రలు విరివిగా చేసి ఆధ్యాత్మికతను పెంచుకుంటారు. సంవత్సర ప్రారంభంలో కొన్ని సమస్యలు, కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురైనా మనోబలంతో అధిగమిస్తారు. అలాగే, ఆరోగ్యం కొంత సహకరించక ఇబ్బంది పడతారు. అయితే త్వరగానే స్వస్థత చేకూరుతుంది. చేసే పనిపై ఏకాగ్రత కలిగి సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. బలమైన ప్రత్యర్థులు కూడా మీ మంచితనానికి విధేయులై మసలుకుంటారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగార్ధులు తమ ప్రయత్నాలలో సఫలం చెందుతారు. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు సన్నద్ధమవుతారు. సోదరులు, సోదరీల నుంచి శుభవార్తలు అందుతాయి. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ద్వితీయార్థంలో మరింత లబ్ధి పొందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొత్త పెట్టుబడులు అంది ముందడుగు వేస్తారు.
సంస్థలను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరిగినా అధిగమిస్తారు. పై స్థాయి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయవర్గాలకు ప్రజాదరణ పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలతో గడుపుతారు. కళాకారులకు అవకాశాలతో పాటు విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు శ్రమానంతరం మంచి ఫలితాలు రాగలవు. వ్యవసాయదారులు రెండవ పంటలో లాభాలు పొందుతారు.

వీరు శని, రాహు, ప్రథమార్థంలో గురువు కి పరిహారాలు చేయాలి. నృసింహ స్తోత్రాలు పఠనం మంచిది.
అదృష్ట సంఖ్య – 3.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Ugadi rasi phalalu 2025 content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2025 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2025 – Panchangam – App on Apple App Store

Categorized in: