సత్రాజిత్తు తనపై వేసిన నింద నిజం కాదని నిరూపించడం కోసం .. కృష్ణుడు తన పరివారంతో అడవుల్లోకి వెళతాడు. అలా ఆయన దట్టమైన అడవుల్లోకి వెళ్లిన తరువాత, ప్రసేనుడికి సంబంధించిన వస్త్రాలు ఒక చోట కనిపిస్తాయి. అక్కడి నుంచి సింహం పాదాల ముద్రలు కనిపిస్తాయి. ఆ తరువాత మనిషి పాదాలను పోలిన పెద్ద పాదముద్రలు కనిపిస్తాయి. ఆ పాదాల గుర్తులు పట్టుకుని వాళ్లు ముందుకు నడవడం మొదలుపెడతారు.
అలా వాళ్లు ఆ పాదముద్రలను బట్టి ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకుంటారు. గుహలోకి వెళ్లినట్టుగా పాద ముద్రలు ఉండటంతో, తన అనుచరులను అక్కడే ఉంచి కృష్ణుడు లోపలికి వెళతాడు. ఆ గుహలో ఒక యువతి శ్యమంతకమణిని ధరించి ఉండటం చూస్తాడు. ఆ మణిని తనకి ఇవ్వమని కృష్ణుడు అడుగుతాడు. ఆ యువతి భయంతో కేకలు వేయడంతో జాంబవంతుడు పరుగున అక్కడికి వస్తాడు. వస్తూ వస్తూనే కృష్ణుడికి పై యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య పోరు 28 రోజులు పాటు భీకరంగా సాగుతుంది. చివరికి జాంబవంతుడు అలసిపోయి నేలకూలుతాడు.
తనని ఎదిరించి నిలిచింది సాక్షాత్తు శ్రీరామచంద్రుడని భావించి నమమస్కరిస్తాడు. ఆయనను పోల్చుకోలేకపోయినందుకు మన్నించమని కోరతాడు. తాను ఏ పనిమీద ఆ గుహలోకి అడుగుపెట్టింది కృష్ణుడు వివరిస్తాడు. జరిగింది వివరించిన జాంబవంతుడు .. శ్యమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా అప్పగిస్తానని వాళ్లిద్దరికీ వివాహాన్ని జరిపిస్తాడు. జాంబవతిని వివాహమాడిన కృష్ణుడు ఆమెను వెంటబెట్టుకుని అక్కడ నుంచి ద్వారక చేరుకుంటాడు. సత్రాజిత్తుకు కబురుచేసి ఆయనకు మణిని అప్పగిస్తాడు.
శ్యమంతకమణిని తీసుకుని సత్రాజిత్తు తన రాజ్యానికి చేరుకుంటాడు. ఎప్పటిలానే దానిని పూజిస్తూ సిరిసంపదలను పొందుతూ ఉంటాడు. సత్యభామను తనకిచ్చి వివాహం చేయమని ఆయనను శతధన్వుడు ఒత్తిడి చేస్తూనే ఉంటాడు. దాంతో సత్రాజిత్తుకు ఏం చేయాలో పాలుపోదు. ఈ సమస్యకు తగిన పరిష్కారం చూడాలని ఆలోచనలో పడతాడు. సత్యభామను శతధన్వుడికి ఇవ్వాలా? కృష్ణుడికి కట్టబెట్టాలా? అనే విషయంలో ఆయన తర్జనభర్జనలు పడతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.