రుక్మిణీదేవి .. జాంబవతి .. సత్యభామను వివాహమాడిన కృష్ణుడు, ఆ తరువాత కాళింది .. మిత్రవింద .. నాగ్నజితి .. భద్ర .. లక్షణను కూడా వివాహమాడతాడు. అష్ట భార్యలు అలగకుండగా కృష్ణుడు వాళ్లకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే సత్యభామకు మాత్రం తానంటేనే కృష్ణుడికి ఎక్కువగా ఇష్టమనీ, తనకంటే అధికంగా ఆయనను మిగతా భార్యలలో ఎవరూ ప్రేమించలేరనే భావనతో ఉంటుంది. అదే సమయంలో నరకాసుర సంహారానికి సమయం ఆసన్నమైందనే విషయం కృష్ణుడికి గుర్తుకు వస్తుంది. నరకాసురిడి మరణం సత్యభామ చేతిలో ఉందని తెలిసిన కృష్ణుడు ఆ దిశగా పావులు కదుపుతాడు.

“ప్రాగ్జోతిషపురము”ను పాలిస్తున్న నరకాసురుడు .. పరమశివుడిని గురించి కఠోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. తనకి ఎవరివలనా మరణం సంభవించకుండా ఉండేలా వరాన్ని ప్రసాదించమని నరకాసురుడు కోరతాడు. అతని తల్లి చేతిలో తప్ప అతనికి మరెవరి చేతిలోను మరణం సంభవించదని సదాశివుడు వరాన్ని అనుగ్రహిస్తాడు. తల్లి తన బిడ్డలు ఎలాంటివారైనా భరిస్తుందిగానీ .. వారి ప్రాణాలు తీయడమనేది ఎప్పటికీ చేయలేదు. అందువలన ఆ వరానికి నరకాసురుడు సమ్మతించి స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు.

శంకరుడు ప్రసాదించిన వరంతో నరకాసురుడు గర్విస్తాడు. తనకి ఎవరి చేతిలోనూ మరణమే లేనప్పుడు ఎవరిని చూసి తాను ఎందుకు భయపడాలి అనే ఉద్దేశంతో అందరిపైకి తన సైన్యంతో దండెత్తుతుంటాడు. సాధు సత్పురుషులను ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. మహర్షులు సైతం ఆయన ఆగడాలను విని తట్టుకోలేకపోతుంటారు. నరకాసురుడి దారుణాలను భరించలేకపోతున్నవారు ఆ భగవంతుడే అతనికి తగిన శిక్షను విధించాలని కోరుకుంటూ ఉంటారు. బయటికి ఒక్క మాట అనేసినా, మళ్లీ తమకి చెరసాల తప్పదనే భయంతో మౌనంగా సహిస్తుంటారు.

ఇక అమరలోక ఆధిపత్యంపై నరకాసురిడి కన్ను పడుతుంది. దేవతల వలన కూడా తనకి చావు లేదు. అందువలన తనని ఎదురించేవారికేగాని తనకేమీ కాదు. కనుక ఇక ఆలస్యం చేయడం అవివేకం అనుకుంటూ దేవలోకంపై దండెత్తుతాడు. ఇంద్రాదిదేవతలను భయకంపితులను చేస్తాడు. దేవేంద్రుడిని తన సింహాసనంపై నుంచి దింపేస్తాడు. దేవమాత అయిన “అదితి” ధరించిన కుండలాలను ఆమె దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటాడు. అలా ఆయన “అదితి” కన్నీళ్లకు కూడా కారణమవుతాడు. ఇలా నరకాసురిడి ఆగడాలు సాగుతూ ఉంటాయి.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.