నారద మహర్షి తెచ్చిన పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవి సిగలో కృష్ణుడు అలంకరిస్తాడు. దాంతో ఆమె ఆనందంతో పొంగిపోతుంది. తన పట్ల కృష్ణుడి ప్రేమానురాగాలకు మురిసిపోతుంది. భర్త పాదాలకు నమస్కరించుకుని, ఆయన మనసులో తనకి అంతటి స్థానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతుంది. అలా దేవలోకం నుంచి నారద మహర్షి రావడం .. అక్కడి పారిజాత పుష్పాన్ని తీసుకురావడం .. ఆ పుష్పాన్ని రుక్మిణి సిగలో కృష్ణుడు అలంకరించడం చూసిన చెలికత్తెలు, ఈ విషయాన్ని సత్యభామ చెవిన వేస్తారు.
అష్ట భార్యలలో తానంటేనే కృష్ణుడికి ఎక్కువ ప్రేమ అని తాను మురిసిపోతుంటే, ఆయన రుక్మిణి సిగలో పారిజాతాన్ని అలంకరించడం సత్యభామకి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. కృష్ణుడు ఆ విధంగా చేయడం మిగతా భార్యలందరిలో తనని అవమాన పరచడమేనని భావిస్తుంది. ఇకపై తనకంటే ఎక్కువగా మిగతా వాళ్లంతా రుక్మిణీదేవిని గౌరవిస్తారనీ, తనని చులకనగా చూస్తారని అనుకుంటుంది. తనని తక్కువగా చేసి చూడటాన్ని తాను తట్టుకోలేనని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తాను ఎంతగా బాధపడుతున్నది కృష్ణుడికి తెలియాలనే ఉద్దేశంతో అలకపాన్పు ఎక్కుతుంది.
సత్యభామ మందిరానికి చేరుకున్న కృష్ణుడు ఆమె అలకను గ్రహిస్తాడు .. అందుకుగల కారణాన్ని ఊహిస్తాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా ఆమె కోపానికి గల కారణమేమిటని అడుగుతాడు. ఆయన రుక్మిణీదేవికి పారిజాతాన్ని ఇచ్చిన విషయాన్ని గురించి సత్యభామ ప్రస్తావిస్తుంది. కృష్ణుడు చేసిన ఆ పని వలన తాను అందరికీ లోకువైపోయానని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కృష్ణుడు తన భార్యలలో సత్యభామ పట్ల మరింత ప్రేమగా ఉంటాడని చెప్పుకున్న వాళ్లంతా ఇకపై తనని చూసి చాటుగా నవ్వుకుంటారంటూ ఆవేదన చెందుతుంది.
తాను రుక్మిణికి పారిజాతం ఇచ్చినంత మాత్రాన తనకి ఆమెపై అధికంగా ప్రేమ ఉన్నట్టు కాదనీ, ఆ సమయంలో ఆమె అక్కడ ఉండటం వలన ఇచ్చానని కృష్ణుడు చెబుతాడు. సత్యభామనే తనకి లభించిన పారిజాతంగా తాను భావించాననీ, అందువలన ఆ విషయాన్ని గురించి అంతగా ఆలోచన చేయలేదని అంటాడు. ఒకవేళ ఆమెకి పారిజాత పుష్పమే కావాలని అనిపిస్తే, పుష్పమే కాదు .. వృక్షాన్నే అమరలోకం నుంచి తీసుకువస్తానని మాట ఇస్తాడు. ఆ మాటకు సత్యభామ సంతోషంతో పొంగిపోతుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.