స్వప్నంలో అనిరుద్ధుడిని చూసిన వెంటనే ఉష మనసు పారేసుకుంటుంది. అతణ్ణి చూడాలని ఉందనీ .. మాట్లాడాలని మనసు ఆరాటపడుతుందని అంటుంది. దాంతో తన మంత్రశక్తితో తీసుకువస్తానని చెప్పి, ద్వారకకి చిత్రరేఖ వెళుతుంది. రాత్రివేళలో అనిరుద్ధుడి శయ్యా మందిరంలోకి వెళుతుంది. సూక్ష్మరూపంలో అతణ్ణి ఆకాశ మార్గాన శోణపురం చేరుస్తుంది. ఉష అంతఃపురంలోకి ప్రవేశించగానే అనిరుద్ధుడికి మెలకువ వస్తుంది. తాను ఎక్కడ ఉన్నది అర్థంకాక ఆయన అయోమయానికి లోనవుతాడు.
ఏమీ తెలియనట్టుగా చిత్రరేఖ కనిపించి .. అతను ఎక్కడ ఉన్నది చెబుతుంది. దాంతో తాను కలలు కంటున్న ఉష దగ్గరికి రావడం ఆయనకి ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. ఏం జరిగిందో .. తాను ఎలా వచ్చాడో అనే విషయాలు ఆయనకి అంతుబట్టవు. అంతలో అక్కడికి ఉష వస్తుంది. ఆమెను చూడగానే అనిరుద్ధుడు తనని తాను మరిచిపోతాడు. అంతకుముందు ఆమె సౌందర్యం గురించి తాను విన్నది చాలా తక్కువనే విషయం ఆయనకు అర్థమవుతుంది. అలా బొమ్మలా నిలబడిపోయిన తననే చూస్తున్న అనిరుద్ధుడిని చూసి ఉష నవ్వుతుంది.
ఆ తరువాత వాళ్ల మధ్య మాటలు కలుస్తాయి. అనుకోకుండా జరిగిన తమ కలయిక పట్ల అనిరుద్ధుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. తాను కోరుకున్న అందాలరాశి చెంతకు తనని పంపిన భగవంతుడు నిజంగా చాలా గొప్పవాడని అనిరుద్ధుడు అంటాడు. కాసేపటి పరిచయమే జన్మజన్మల అనుబంధంలా అనిపిస్తోందని చెబుతాడు. ఇకపై తాము ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చేశామని అంటాడు. ఉష కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఆయనను చూడాలని తన మనసు ఆరాటపడిన మరుక్షణమే ఆయన తన ముందు నిలవడం పట్ల ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తుంది.
ప్రేమలో ఉన్న గొప్పతనం అదేనని అనిరుద్ధుడు అంటాడు. ఎవరు ఎక్కడ ఉన్నా .. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది కలిపేస్తుందని చెబుతాడు. ఇది మనసులకు పడిన బంధమనీ, మరెవరూ దీనిని విడదీయలేరని అంటాడు. ఉష .. అనిరుద్ధుల ప్రేమ – పెళ్లి చరిత్రలో నిలిచిపోతాయనీ, తాము ఎవరికీ భయపడవలసిన పనిలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఆమె తనతో కలిసి నడిస్తే చాలని చెబుతాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన చేయిని విడువనని ఉష మాట ఇస్తుంది. దాంతో అనిరుద్ధుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.