రాత్రి శయన మందిరంలో నిద్రించిన అనిరుద్ధుడు, తెల్లవారగానే కనిపించకపోవడంతో ఆయన భార్య రుక్మలోచన ఆందోళన చెందుతుంది. ఉన్నపళంగా మనిషి మాయంకావడంతో కంగారుగా వెళ్లి రుక్మిణీ .. కృష్ణులకు విషయం చెబుతుంది. దాంతో కృష్ణుడు కూడా ఆలోచనలో పడతాడు. అనిరుద్ధుడు ఏమైపోయాడు? ఎక్కడ ఉన్నాడు? అనే ప్రశ్నలు ఆయనను వెంటాడుతూ ఉంటాయి. అంతఃపురంలో ఉన్నవాళ్లంతా రాక్షసమాయ అనుకుంటూ ఉంటారు. కృష్ణుడు తన పరివారాన్ని రప్పించి, అనిరుద్ధుడిని వెతికే పనిపై పంపిస్తాడు.
ఇలాంటి పరిస్థితుల్లోనే బాణాసురుడు దేవతలను ఓడించి తన నగరానికి చేరుకుంటాడు. దేవలోకంపై విజయాన్ని సాధించివస్తూనే, తన కోట బయట కొలువైన శివపార్వతులకు నమస్కరించుకుంటాడు. విజయం సాధించిన ఆనందం ఆయన కళ్లలో కనిపించకపోవడం గమనించిన శివుడు అందుకుగల కారణమేమిటని అడుగుతాడు. ఎంతో సైన్యంతో .. మరెంతో ఉత్సాహంతో వెళ్లిన ఆయన, విజయం లభించినప్పటికీ ఏదో వెలితిగా కనిపించడానికి కారణమేమిటో చెప్పమని అడుగుతాడు. ఆయన ఆవేదన ఏదైననూ తీర్చడానికి ప్రయత్నిస్తామని అంటాడు.
తాను ఎంతో పరాక్రమవంతుడనే అనీ, అయితే పోరాడటానికి తనకి తగిన మొనగాడు కనిపించడం లేదని బాణాసురుడు అంటాడు. తాను ఎవరిపైకి యుద్ధానికి వెళ్లినా వాళ్లు వెంటనే పరాజయాన్ని అంగీకరిస్తున్నారనీ, లేదంటే పారిపోతున్నారని చెబుతాడు. నిలబడి తనతో పోరాడే వీరులే లేకపోవడంతో పోరాటం చేయాలనే తన ముచ్చట పూర్తిస్థాయిలో తీరడంలేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. ఎదురుపడి సవాలు చేసి .. నిలిచి పోరాడే యోధుడు లేనప్పుడు తాను వీరుడై ఉండటం వలన ఒరిగేదేముంటుందని అంటాడు.
దేవలోకంపై దండెత్తినా వీరులెవరూ తనకి తగల్లేదనీ, అందువలన సరైన వీరుడితో యుద్ధం చేసి తన ముచ్చట తీర్చుకోవాలని ఉందని బాణాసురుడు అంటాడు. తనతో పోరాడగలిగిన వీరుడు .. యోధుడు శివుడేనని అనిపిస్తోందనీ, అందువలన తనతో తలపడి తన పోరాట కాంక్షను చల్లార్చమని బాణాసురుడు కోరతాడు. చిత్రమైన ఆయన కోరికను గురించి వినగానే శివుడు నివ్వెరపోతాడు. త్వరలోనే తనంతటి వీరుడితో పోరాడే అవకాశం ఆయనకి కలగనుందనీ, అందుకు గుర్తుగా కోట బురుజుపై గల జెండా నేలకూలుతుందని శివుడు చెబుతాడు. దాంతో బాణాసురుడు సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.