ఉష మందిరంలో అనిరుద్ధుడు ఉంటున్నాడనే విషయం బయటికి తెలియకుండా చిత్రరేఖ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆమె ఉందనే ధైర్యంతోనే వాళ్లిద్దరూ ఎలాంటి ఆందోళన లేకుండా ముచ్చట్లతో మునిగితేలుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున చిత్రరేఖ లేని సమయంలో, మరో చెలికత్తె అటుగా వస్తుంది. ఉష పరపురుషుడితో కలిసి ఉండటాన్ని గమనిస్తుంది. వాళ్లిద్దరి మాటల వలన ఉష గర్భవతి అనే విషయం తెలుసుకుంటుంది. వెంటనే పరుగులాంటి నడకతో బాణాసురుడి మందిరానికి వెళ్లి విషయం చెబుతుంది.
ఉష .. వివాహానికి ముందే గర్భవతి అయిందనే విషయం తెలియగానే బాణాసురుడు నిర్ఘాంతపోతాడు. ఉష గర్భవతి కావడానికి కారకులు ఎవరని అడుగుతాడు. ఉష తన మందిరంలో ఓ పరపురుషుడితో కలిసి ఉండటం చూశానని ఆ చెలికత్తె చెబుతుంది. ఆ మాటకి బాణాసురుడు ఆలోచనలో పడతాడు. కోటలోకి అన్యులకు ప్రవేశంలేదు .. మరో మార్గం ద్వారా ఎవరూ లోపలికి రాలేరు. ఒకవేళ వచ్చినా అడుగడుగునా కాపలాదారులు ఉన్నారు. ఒకరుకాకపోతే ఒకరైనా అతనిని చూడకుండా ఉండటం సాధ్యపడదు. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తి లోపలికి ఎలా వచ్చాడు? అని అనుకుంటాడు.
కోట వాకిట పార్వతీపరమేశ్వరులు ఉన్నారు .. వాళ్ల కళ్లుగప్పి లోపలికి రావడమనేది తనకే సాధ్యం కాదు .. ఇక వేరేవారెవరూ రాగలరు? అనుకుని అంతఃపురంలోను .. ఉద్యానవనంలోనూ కాపలాగా ఉన్న వాళ్లందరినీ పిలిపిస్తాడు. తాను అంతఃపురంలో లేని సమయంలో ఎవరో పరపురుషుడు లోపలికి వచ్చినట్టుగా తనకి తెలిసిందనీ, ఆ వ్యక్తిని ఎవరైనా గమనించారా? అని అడుగుతాడు. కాపలాదారులంతా కూడా ఆశ్చర్యపోతారు. తమని దాటుకుని ఎవరూ లోపలికి రాలేదనీ, ఇందులో ఎలాంటి సందేహం లేదని చెబుతారు.
కాపలాదారులను పంపించివేసిన బాణాసురుడు అయోమయానికి లోనవుతాడు. తాను లేని సమయంలో తన అంతఃపురములోకి ప్రవేశించినది ఎవరు? ఇంతమంది కాపలాదారుల కంటపడకుండా ఆ వ్యక్తి ఎలా తన కూతురి మందిరంలోకి ప్రవేశించాడు? అతనితో పరిచయమే లేకపోతే తన కూతురు ఈ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతుంది? ఇందులో చిత్రరేఖ ప్రమేయం లేకుండగా ఇంతకథ నడుస్తుందా? అని ఆలోచన చేస్తాడు. నిజానిజాలు ఉష సమక్షంలోనే తేల్చాలని ఆమె మందిరానికి చేరుకుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.