ఇలా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ సుధాముడు ముందుకు సాగుతుంటాడు. తనని కృష్ణుడు చాలా ప్రేమగా చూసుకున్నాడు .. ఎంతగానో అభిమానించాడు. ఎంతో గౌరవ మర్యాదలతో చూశాడు. కానీ మరి ఇంటిదగ్గర తన భార్య బిడ్డల పరిస్థితి ఏమిటి? తనపట్ల కృష్ణుడు చూపుతున్న అనురాగాన్ని చూసిన తరువాత, తనకి ఇది కావాలని అడిగితే బాగుండదని తాను ఊరుకున్నాడు. తమ స్నేహాన్ని గుర్తుపెట్టుకుని వచ్చానని కృష్ణుడు భావిస్తున్నప్పుడు, తాను వచ్చింది సాయం కోసమని ఎలా చెప్పగలడు? అలా చెబితే తన గురించి కృష్ణుడు తక్కువగా అనుకోడా?
కానీ తన భార్య తనని కృష్ణుడి దగ్గరికి పంపించిందే ఆయనను సాయం అడగమని. తాను కృష్ణుడి నుంచి ఎంతో కొంత సాయాన్ని పొంది వస్తానని ఆమె ఆశ పెట్టుకుంటుందేమో .. నేను అసలు అడగనే లేదంటే ఆమె ఏమంటుందో కదా? పిల్లలు ఆకలితో బాధపడుతున్నారని తెలిసి కూడా తాను మాత్రమే విందుభోజనం చేసి రావడం ఎంతవరకూ సమంజసం? అయినా అంత ప్రేమతో చూసిన కృష్ణుడు .. తాను అడిగితే కాదంటాడా? అడగకపోవడం తన తప్పే. తన మొహమాటమే తన పిల్లల ఆకలికి కారణం కాబోతోందని అనుకుంటాడు.
అయినా తాను కష్టాల్లో ఉన్నాననే విషయం తనని చూస్తే తెలియడం లేదూ. తన వస్త్రాలు .. తన తీరు .. తన కళ్లలోని జీవం ఇవన్నీ చూసిన తరువాత కృష్ణుడు గ్రహించకుండా ఎలా ఉంటాడు? తనకి సంపదలు ఇస్తే ఆయనను మరిచిపోతానేమోననే ఉద్దేశంతో అలా చేసి ఉంటాడు. అవును మరి .. అనంతమైన సిరిసంపదలతో తులతూగుతున్నప్పటికీ కృషుడిలా ఒక పేద స్నేహితుడిని ఆదరించేవాళ్లు ఎవరుంటారు? అందువల్లనే కృష్ణుడు తనకి ఏమీ ఇవ్వలేదేమోనని అనుకుంటాడు. తన భార్య కొన్ని రోజులుగా ఉపవాసం ఉంటోంది .. అలాంటి ఆమెకి తాను ఎలా ముఖం చూపించాలి?
ఇప్పటికే పిల్లల విషయంలో తనకంటే ఆమె ఎక్కువగా కష్టపడుతోంది. ఎక్కడి నుంచో ఎలాగో అలా ఏదో ఒకటి తెచ్చిపెడుతోంది. తనని నమ్మి తనకి ఆమె అప్పగించిన పని ఇదొక్కటే. అది కూడా తాను సక్రమంగా నెరవేర్చలేకపోయాడు. ఆకలితో ఎదురుచూస్తున్న ఆమె రూపం తలచుకుంటేనే తన మనసు భారమవుతోందే. అలాంటిది ఆమె ఎదురుగా వస్తే తన పరిస్థితి ఏమిటి? తాను ఏదో తేవడానికి వెళ్లానని పిల్లలకు ఆమె చెప్పే ఉంటుంది. వాళ్లు ఆశతో ఎదురు వస్తే ఎలా తట్టుకోవడం? ఇలా పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.