అర్జునుడిని కలిసిన తరువాత కృష్ణుడు .. సుభద్రను కూడా కలుసుకుంటాడు. బలరాముడు ప్రయత్నాలు ముమ్మరమైనట్టుగా చెబుతాడు. అర్జునుడితో ఆమె పెళ్లికి తాను ఏర్పాట్లను మొదలు పెడుతున్నాననీ, తాను ఎప్పుడంటే అప్పుడు పెళ్లి పీటలనెక్కడానికి సిద్ధంగా ఉండాలని చెబుతాడు. తాను చెప్పేవరకూ జరుగుతున్న సంఘటనలను గురించి ఎవరి దగ్గర ప్రస్తావించవద్దని హెచ్చరిస్తాడు. ఆయన చెప్పినట్టుగా తాను నడుచుకుంటానని సుభద్ర అంటుంది. దాంతో కృష్ణుడు మిగతా పనులను చక్కబెట్టడానికి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

కృష్ణుడి ద్వారా తాను కౌరవులకు పంపించిన వర్తమానం వాళ్లకు చేరే ఉంటుందనీ, వాళ్లు తమ పరివారంతో బయలుదేరే ఉంటారని బలరాముడు భావిస్తాడు. వాళ్లు రాగానే తగిన మర్యాదలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు. అందుకోసం పనివాళ్లకు పనులను అప్పగించి ఆయన కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో కృష్ణుడు అక్కడికి వస్తాడు. పెళ్లివారు వస్తే అప్పటికపుడు తడుముకోకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశానని బలరాముడు చెబుతాడు. తన వైపు నుంచి కూడా అన్నీ సిద్ధం చేశానని కృష్ణుడు అంటాడు.

అంతఃపురములోనే మరొక భవనంలో బలరాముడికి తెలియకుండా వాళ్ల పెళ్లికి కృష్ణుడు ఏర్పాట్లు చేస్తాడు. అక్కడ పనులు చకచకా జరిగిపోతుంటాయి. బలరాముడిని మాటల్లో పెడుతూ కృష్ణుడు ఆయన మందిరంలో కూర్చుని ఉంటాడు. ఈ విషయాలేవీ తెలియని బలరాముడు, అంతా తాను అనుకున్నట్టుగానే జరుగుతుందనుకుంటూ, కృష్ణుడితో కాలక్షేప కబర్లు చెబుతూ ఉంటాడు. కావాలనే కృష్ణుడు కూడా సంభాషణను సాగదీస్తూ వెళుతుంటాడు. అలా బలరాముడి విశ్రాంతి మందిరంలోనే కాదు, పెళ్లి మంటపంలోను కృష్ణుడు ఉంటాడు.

కృష్ణుడు ఇచ్చిన సంకేతాల మేరకు ఒక వైపు నుంచి అర్జునుడు – మరో వైపు నుంచి సుభద్ర పెళ్లి మంటపానికి చేరుకుంటారు. ఆయన సమక్షంలోనే ఆ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలా అనుకున్నట్టుగానే అర్జునుడితో సుభద్ర పెళ్లిని జరిపిస్తాడు. వివాహమైన తరువాత ఈ విషయం బలరాముడికి తెలుస్తుంది. దాంతో ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తనతో మాటమాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసిన కృష్ణుడిపై .. తనకి ఎంతమాత్రం ఇష్టం లేని అర్జునుడిని పెళ్లాడిన సుభద్రపై ఆయన తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. అందరూ కలిసి తనని మోసం చేశారంటూ మండిపడతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.