అంబరీషుడు ఎన్ని రకాలుగా నచ్చజెబుతున్నప్పటికీ, దుర్వాసుడు చల్లబడడు. అంబరీషుడు శాంతివచనలు పలుకుతున్నా కొద్దీ ఆయన ఆగ్రహంతో రగిలిపోతుంటాడు. పండితులు .. ఇతర రుషుల సమక్షంలో తనని అవమానపరిచిన అంబరీషుడిని అంతం చేయాలనే ఆయన నిర్ణయించుకుంటాడు. ఆ క్షణమే తన జుట్టులోని ఒక పాయను తీసి విసురుతాడు. ఆ జట నుంచి “కృత్య” అనే రాక్షసి పుడుతుంది. భయంకరమైన ఆకారంతో సృష్టించబడిన ఆ రాక్షసి .. అతి పొడవైన శూలాన్ని ధరించి అంబరీషుడిపైకి వస్తుంటుంది.

అక్కడ ఉన్న పండితులు .. మహర్షులు అంతా కూడా ఆశ్చర్యపోతారు .. ఆందోళన చెందుతారు. అంబరీషుడు మహా భక్తుడనీ .. అహంభావమనేది ఆయనలో తాము మచ్చుకు కూడా చూడలేదని చెబుతారు. ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేశాడని అంటారు. ద్వాదశి ఘడియలు దాటిపోతున్నా మంచినీళ్లు తీసుకోవడానికి కూడా ఆయన అంగీకరించలేదనీ, తామే ఒప్పించామని చెబుతారు. అందువలన అదో తప్పుగా భావించి అంతటి ఆవేశానికి లోనుకావద్దని అంటారు. కృత్యను ఉపసంహరించుకోమని కోరతారు.

ఎర్రగా రక్తం చిందే కళ్లతో .. పొడవైన కోరలతో .. పదునైన గోళ్లతో .. శూలాన్ని పట్టుకుని కృత్య ముందుకు కదులుతూ ఉంటుంది. ఆ రాక్షసి దృష్టి అంతా కూడా అంబరీషుడిపైనే ఉంటుంది. ఆయన వైపే తీక్షణంగా చూస్తూ ముందుకు వెళుతూ ఉంటుంది. భయంకరమైన ఆ ఆకారం వైవు చూస్తూ, అంబరీషుడు ఒక అడుగు వెనక్కి వేస్తాడు. తాను ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేయడం .. ఎంతో ఆప్యాయంగా దుర్వాసుడిని భోజనానికి ఆహ్వానించడం .. ఆయన ఆలస్యంగా రావడమే కాకుండా తనపై ఆగ్రహించడం .. రాక్షసిని సైతం ప్రయోగించి తనని హతమార్చడానికి ప్రయత్నించడం విడ్డూరంగా అనిపిస్తుంది.

పండితులు .. మహర్షులు అంతా కూడా కృత్యను వెనక్కి పిలవమని దుర్వాసుడిని కోరుతుంటారు. ఆయన మాత్రం ఎంతమాత్రం వినిపించుకోడు. ఆ దుష్టశక్తి అంబరీషుడిపై శూలాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతుంది. దాంతో అంబరీషుడి ఇంటనే ఉన్న సుదర్శన చక్రంలో ఒక్కసారిగా కదలిక మొదలవుతుంది. దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ దూసుకువస్తున్న సుదర్శన చక్రాన్ని అందరూ విస్మయంగా చూస్తుంటారు. అందరూ చూస్తుండగానే అది కృత్య శిరస్సును ఖండిస్తుంది. భీకరమైన దాని మొండెం తాటిచెట్టులా నేల కూలుతుంది.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.