ధృవుడికి ఐదేళ్లు వస్తాయి .. తల్లి సునీతి తన కొడుకును ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. తల్లి చెప్పినట్టు వింటూ .. తింటూ అంతఃపురంలో ఆడుకుంటూ ఉంటాడు. తండ్రి అంటే కూడా ధృవుడికి ఎంతో ఇష్టం .. అయితే ఆయన మాత్రం ధృవుడిని ఎప్పుడూ దగ్గరకి తీయడు. మనసులో ప్రేమ ఉన్నప్పటికీ, సురుచికి భయపడి దూరంగానే ఉంచుతుంటాడు. ఈ విషయాలు తెలియని ధృవుడు .. ఉత్తముడు మాదిరిగానే తండ్రితో కలిసి ఆడుకోవాలని ఆశపడేవాడు. అందుకోసం ప్రయత్నించేవాడు.
ఒక రోజున ఉత్తానపాదుడి తొడపై కూర్చుని ఉత్తముడు ఆడుకుంటూ ఉంటాడు. ఆ పిల్లాడిని ఆడిస్తూ ఆయన ఏవో ముచ్చట్లు చెబుతూ ఉంటాడు. అది చూసిన ధృవుడు .. తను కూడా తండ్రి తొడపై కూర్చోవాలని ఆశతో గబగబా ఆయన దగ్గరికి వెళ్లి ఆయన తొడపై కూర్చుంటాడు. ఉత్తానపాదుడు వారించేలోగానే ధృవుడు ఆయన తొడపై కూర్చుంటాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సురుచి ఆ దృశ్యం చూస్తుంది. తన కొడుకుతో పాటు సమానంగా తండ్రి తొడపై కూర్చున్న ధృవుడిని చూడగానే ఆమె ఆగ్రహావేశాలకు లోనవుతుంది.
కోపంగా తన భర్త దగ్గరికి వచ్చి .. ధృవుడి చేయిపట్టుకుని క్రిందకి లాగేస్తుంది. ఒక్కసారిగా తండ్రి ఒడిలో నుంచి ధృవుడు క్రిందపడతాడు. తన పిన్ని తనని ఎందుకలా చేసిందో అర్థంకాక అయోమయంగా ఆమె వైపుకు చూస్తాడు. ధృవుడిని చూసి ఉత్తానపాదుడు బాధపడతాడుగానీ, పైకి ఏమీ అనలేకపోతాడు. తన కొడుకు అదృష్టవంతుడనీ .. అందువల్లనే తన కడుపున పుట్టాడనీ, అతను దురదృష్టవంతుడు గనుక సునీతి కడుపున పుట్టాడని సురుచి అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. ఆ మాటలు అర్థంకాక ధృవుడు ఆమె వైపే చూస్తాడు.
అతను తండ్రి తొడపై కూర్చోవాలంటే తన కడుపున పుట్టాలనీ, తన కడుపున పుట్టాలంటే శ్రీమహా విష్ణువు అనుగ్రహం ఉండాలని సురుచి అంటుంది. తండ్రి ఒడిలో కూర్చున్న తనని పిన్ని లాగేయడం .. తాను దురదృష్టవంతుడినని అనడం .. శ్రీమహావిష్ణువు అనుగ్రహం కావాలని చెప్పడం ధృవుడి మనసును గాయపరుస్తాయి. ఆ మాటలు విన్న సునీతి చాలా బాధపడుతుంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ధృవుడు అక్కడికి వస్తాడు. తాను తండ్రి తొడపై కూర్చోవాలంటే శ్రీమహావిష్ణువు అనుగ్రహం కావాలా? అని అడుగుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.