ధృవుడు వడివడిగా నడచుకుంటూ వెళుతూ ఉండగా, ఆయన ఎదురుగా నారద మహర్షి వస్తాడు. ఎక్కడికి వెళుతున్నావని ధృవుడిని అడుగుతాడు. జరిగిన సంఘటన గురించి ఆ పిల్లవాడు నారద మహర్షికి చెబుతాడు. అందుకు నారదమహర్షి నవ్వేసి .. తపస్సు ఎలా చేయాలో తెలుసునా? అని అడుగుతాడు. తెలియదని ఆ పిల్లవాడు అమాయకంగా చెబుతాడు. తపస్సు ఎలా చేయాలో .. ఎంతటి భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని స్మరించాలో వివరిస్తాడు. స్వామి అనుగ్రహాన్ని పొందాలంటే ఒక మంత్రాన్ని పఠించాలనీ, ఆ మంత్రాన్ని అదే పనిగా స్మరిస్తూ ఉండమని అంటాడు.
ఆ మంత్రమేదో త్వరగా చెప్పమని ధృవుడు కోరతాడు. అప్పుడు ఆయనకి “ఓం నమోభగవతే వాసుదేవయా” అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని నారద మహర్షి ఉపదేశిస్తాడు. అనునిత్యం అందుబాటులో ఉన్న వివిధ రకాల పూలతో స్వామిని పూజిస్తూ .. వివిధ రకాల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తూ తపస్సును కొనసాగించమని అంటాడు. ఎండ .. వాన .. చలి .. ఏదైనా చలించకుండా భారమంతా ఆ స్వామిపైనే వేసి తపస్సు చేయమని చెబుతాడు. కఠోరమైన తపస్సుతో భగవంతుడిని మెప్పించవచ్చని అంటాడు.
అసలు ఏ భగవంతుడి కోసమైతే తపస్సు చేయాలనీ అనుకుంటున్నావో .. ఆ భగవంతుడి గురించి తెలుసునా? ఆయన ఎలా ఉంటాడో ఎరుగుదువా? అని నారద మహర్షి అడుగుతాడు. ఆ స్వామి పేరును తన తల్లి పలికితే వినడమే తప్ప చూడలేదని ధృవుడు చెబుతాడు. శ్రీమహా విష్ణువు శంఖు చక్రాలను .. గదను .. పట్టు పీతాంబరాలును ధరించి ఉంటాడు. తన భక్తులను అనుగ్రహించడానికి ఆయన గరుడ వాహనంపై వస్తాడు. సాధారణమైన కన్నులతో చూడలేనంత దివ్యమైన తేజస్సుతో ఆయన వెలిగిపోతూ ఉంటాడు. అలా వచ్చిన ఆ స్వామినే శ్రీహరి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని అంటాడు.
తపస్సు ఎక్కడ చేయాలని అనుకుంటున్నావని నారద మహర్షి అడుగుతాడు. మనసుకు నచ్చిన ఒక ప్రశాంతమైన ప్రదేశంలో చేయమని తన తల్లి చెప్పిందనీ, అలాంటి ప్రదేశం కోసమే వెదుకుతూ వెళుతున్నానని ధృవుడు సమాధానమిస్తాడు. యమునా నదీ తీరంలోని “మధువనం”లో తపస్సు చేయమని నారద మహర్షి చెబుతాడు. అక్కడ ఎంతోమంది గొప్పవాళ్లు తపస్సు చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందారనీ, అందువలన ఆ పవిత్రమైన ప్రదేశంలోనే తపస్సును సాగించమని సూచిస్తాడు. దాంతో ధృవుడు ఆ దిశగా నడక మొదలెడతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.