నారద మహర్షి సూచనమేరకు ధృవుడు యమునా నదీ తీరంలోని “మధువనం” అనే ఒక విశాలమైన వృక్షం క్రింద కూర్చుని తపస్సు చేయడం మొదలుపెడతాడు. నారదమహర్షి చెప్పినట్టుగానే ధృవుడు తపస్సును కొనసాగిస్తూ ఉంటాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ తన తపస్సును తీవ్రతరం చేస్తూ ఉంటాడు. అలా ఆయన తపస్సు ఐదు నెలలపాటు సాగుతుంది. ఆయన తపస్సులోని తీవ్రత కారణంగా లోకాలన్నీ కదిలిపోతుంటాయి. దాంతో ఇంద్రాది దేవతలు .. మహర్షులు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి పరిస్థితిని విన్నవిస్తారు.

బాలకుడైన తన భక్తుడు ధృవుడు .. తన దర్శనం కోసం తపస్సు చేస్తున్నాడనీ. ఆయన భక్తిలోని ఉధృతి కారణంగా లోకాలు కదిలిపోతున్నాయని శ్రీహరి చెబుతాడు. కంగారుపడవలసిన పనిలేదనీ, తాను వెళ్లి విషయం తెలుసుకుంటానని విష్ణుమూర్తి అంటాడు. ఒక బాలభక్తుడు .. స్వామివారి దర్శనం కోసం అంతటి తీవ్రంగా తపస్సు చేయడం దేవతలను సైతం ఆశ్చర్యచకితులను చేస్తుంది. అదే విషయాన్ని వాళ్లు స్వామి దగ్గర ప్రస్తావిస్తారు. జరగబోయేది చూస్తుండమని చెప్పి, స్వామి గరుడవాహనంపై బయల్దేరతాడు.

గరుడవాహనంపై స్వామివారు రావడంతో మధువనంలో సుడిగాలి మాదిరిగా వస్తుంది. దాంతో ఆ గాలికి చెట్లన్నీ ఊగిపోతుంటాయి. తన ఎదురుగా ఒక దివ్యమైన తేజస్సు నిలిచిన అనుభూతి ధృవుడికి కలుగుతుంది. “ధృవా” అనే పిలుపు వినగానే ఆ బాలుడు కళ్లు తెరుస్తాడు. ఎదురుగా మహా తేజస్సు .. ఆ తేజస్సుకు కళ్లు అలవాటు పడటానికి ఆయనకి కొంతసేపు పడుతుంది. ఆ తరువాత గరుడవాహనధారి అయిన శ్రీహరి ఆ పిల్లవాడి కళ్లకు కనిపిస్తాడు. స్వామివారి పాదాల నుంచి తల వరకూ ధృవుడు పరిశీలనగా చూస్తాడు.

ధృవుడి ముఖం ఒక్కసారిగా ఆనందాశ్చర్యాలతో వెలిగిపోతుంది. అచ్చు నారద మహర్షి చెప్పినట్టుగానే ఉన్నాడు. శంఖ చక్ర గదలను .. పట్టు పీతాంబరాలను ధరించి ఉన్నాడు. పైగా గరుడవాహనంపై వచ్చాడు. సందేహం లేదు వచ్చింది శ్రీమన్నారాయణుడేనని అనుకుంటాడు. వెంటనే లేచి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. ఆ పిల్లవాడి వినయవిధేయతలకు స్వామి ముచ్చటపడతాడు. ఇంత చిన్న వయసులో తన అవసరం ఏమి వచ్చిందనీ, ఎందుకు ఇంతటి కఠోరమైన తపస్సు చేయవలసి వచ్చిందని అడుగుతాడు. దాంతో తన తపస్సుకు గల కారణాన్ని ధృవుడు వివరంగా చెబుతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.