ధృవుడు తన తమ్ముడైన ఉత్తముడి మరణానికి యక్షులు కారకులని తెలుసుకుంటాడు. ఉత్తముడు తన సోదరుడు అని తెలిసికూడా వాళ్లు ఆయనను హతమార్చడం ధృవుడికి తీవ్రమైన ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. యక్షులు అహంకారంతో తన తమ్ముడిని వధించినందుకు వాళ్లకి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా సైన్యాన్ని సిద్ధం చేయమని ఆదేశిస్తాడు. తన సైనిక బలగంతో ఆయన యక్షులపైకి యుద్ధానికి వెళతాడు. తమపై సైనిక బలగంతో విరుచుకుపడుతున్న ధృవుడిపై యక్షులు యుద్ధానికి దిగుతారు.
ధృవుడికి .. యక్షులకు మధ్య భయంకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ పోరాటంలో ఇటు ధృవుడి సైనికులు నేలకూలుతూనే ఉంటారు. యక్షులు పెద్ద సంఖ్యలో గాయపడుతుంటారు. ధృవుడి శౌర్య పరాక్రమాలను చూసి యక్షులు ఆశ్చర్యపోతారు. ఆయన ఎంతటి భక్తుడో అంతటి వీరుడని తెలుసుకుంటారు. ఆయనను కట్టడి చేయడం తమ వలన కాదనే విషయం వాళ్లకు అర్థమైపోతుంది. కానీ అలా వాళ్లు వివిధ రకాల ఆయుధాలను ఆయనపై ప్రయోగిస్తూనే ఉంటారు. ధృవుడు తమపై పోరాడుతూ మున్ముందుకు వచ్చేస్తున్నాడనే విషయాన్ని కుబేరుడి దృష్టికి తీసుకువెళ్లాలని అనుకుంటారు.
అప్పటికే పోరాటంలో అలసిపోయిన ధృవుడు .. యక్షులపై “నారాయణాస్త్రం” ప్రయోగించడానికి సిద్ధమవుతాడు. అది చూసిన యక్షులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. దేవతలంతా కూడా కంగారుపడిపోతారు. అదే సమయంలో ధృవుడి తాత అయిన స్వాయంభువ మనువు ప్రత్యక్షమవుతాడు. తాను ఎవరనేది వివరించిన ఆయన .. ధృవుడు చేస్తున్న పని సరైనది కాదని చెబుతాడు. ఎంతో తపస్సు చేసి వైకుంఠవాసుడిని సైతం మెప్పించిన అతనికి ఇంతటి ఆవేశం పనికిరాదని అంటాడు. జనన మరణాలు సహజాలు అనే విషయాన్ని గ్రహించి, యుద్ధాన్ని విరమించి వెనక్కి వెళ్లమని హితవు చెబుతాడు.
తాత చెప్పిన మాట మేరకు ధృవుడు యుద్ధాన్ని విరమించి వెనుదిరుగుతాడు. ఆ తరువాత రాజ్యానికి వచ్చిన ఆయన, అనవసరమైన ఆవేశానికి దూరంగా ఉంటాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ వెళతాడు. తన కుమారులను మహావీరులుగా తీర్చిదిద్దుతాడు. తనకి వృద్ధాప్యం రాగానే రాజ్యాన్ని తన కుమారులకు అప్పగించేసి, వనాలకు వెళతాడు. అక్కడ శ్రీమన్నారాయణుడిని గురించిన ధ్యానం చేస్తూ శరీరాన్ని వదిలేస్తాడు. అలా ఆయన స్వామి ఇచ్చిన వరం మేరకు ధృవ మండలంలో స్థానం సంపాదించుకుంటాడు .. ధృవనక్షత్రమై వెలుగుతుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.