గజేంద్రుడు ఒక సరస్సులోకి దిగేసి దాహం తీర్చుకుని, ఆ తరువాత ఆ నీటితో తపన తీర్చుకుంటూ ఉంటాడు. మిగతా ఏనుగులు తాము కూడా ఆ సరస్సులోకి దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. గజేంద్రుడు ఆ సరస్సులోని నీటిని తన తొండంతో అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు. ఆ సరస్సులో చాలాకాలం నుంచి ఒక మొసలి ఉంటూ ఉంటుంది. ఆ సరస్సును తనదిగానే అది భావిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తన సరస్సు అల్లకల్లోలంగా ఉండటం గమనించి ఆ మొసలి నీటిపైకి చేరుకుంటుంది. ఒక ఏనుగు సరస్సులోకి దిగి తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తుండటం చూస్తుంది.

వెంటనే నీటి అడుగు నుంచి వేగంగా దూసుకెళ్లి, ఏనుగు కాలు పట్టేసుకుంటుంది. ఒక్కసారిగా ఏనుగు విపరీతమైన బాధతో తూలిపడబోతుంది. కానీ వెంటనే నిగ్రహించుకుని, తన తొండంతో మరింత అల్లకల్లోలం చేస్తుంది. మొసలి నోటి నుంచి తన కాలుని వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మొసలి తన తోకని నీటిలో అటూ ఇటూ తిప్పుతూ మరింత పట్టు చిక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. గజేంద్రుడు ప్రమాదంలో పడ్డాడనే విషయాన్ని ఒడ్డున ఉన్న ఇతర ఏనుగులు గ్రహిస్తాయి. దానిని కాపాడటమెలాగో తెలియక, ఆందోళనతో కూడిన మనసుతో ఒడ్డునే పచార్లు చేస్తూ ఉంటాయి.

ఏనుగు పెద్దగా ఘీంకరిస్తూ ఒడ్డుకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సరస్సును దాటి ఏనుగు బయటికి వెళ్లకూడదనే పట్టుదలతో మరింత లోపలికి లాగడానికి మొసలి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఫలితంగా సరస్సు అల్లకల్లోలం అవుతూ ఉంటుంది. ఏనుగు కాలును మొసలి పట్టుకున్న చోటున రక్తంతో నీళ్లు ఎర్రగా మారుతూ ఉంటాయి. భరించలేని బాధతో ఏనుగు ఘీంకారం చేస్తూ ఉంటుంది. ఒడ్డున ఉన్న ఏనుగులు దిక్కుతోచనివై అటూ ఇటూ పరుగులు పెడుతుంటాయి. ఏనుగు చేస్తున్న ఘీంకారానికి కారణం తెలియని ఇతర జంతువులు తమ గుహల్లోకి వెళ్లిపోతాయి .. పక్షులు తమ గూళ్ల దిశగా ఎగిరిపోతాయి.

సరస్సులో నుంచి బయటపడటానికి ఏనుగు ప్రయత్నించినప్పుడల్లా మొసలి మరింత లోపలికి లాగుతూ ఉంటుంది. ఆ సమయంలో దాని పొడవైన కోరలు ఏనుగు కాల్లోకి మరింత లోతుగా దిగుతూ ఉంటాయి. ఆ బాధను తట్టుకోలేక ఏనుగు కళ్ల నుంచి నీరు కారుతుంటుంది .. దాని చూపు మసకబారుతుంది. మొసలి తన కాలును వదిలినా తాను ఒడ్డు వైపుకు అడుగులు వేయగలనా లేదా అనే సందేహం దానికి కలుగుతుంది. తన శక్తి సన్నగిల్లుతుందనీ .. ఇక ఎంతో సేపు తాను పోరాడలేననే విషయం ఏనుగుకు అర్థమవుతుంది.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.