మొసలి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గజేంద్రుడు అలసిపోతాడు. ఇక మొసలి కారణంగా తన ప్రాణాలు పోవడం ఖాయమనే విషయం గజేంద్రుడికి అర్థమైపోతుంది. దాంతో భగవంతుడిని శరణు కోరడం వలన ఫలితం ఉంటుందనే విషయం గజేంద్రుడికి గుర్తుకు వస్తుంది. ఈ సమస్త సృష్టిని ఎవరైతే నడిపిస్తున్నారో ఆ దైవమే తనని కాపాడాలని కోరుతుంది. తన శక్తి ఉన్నంత వరకూ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాననీ, తన శక్తి పూర్తిగా సన్నగిల్లడం వల్లనే దైవాన్ని అర్ధిస్తున్నానని అంటుంది.
సమస్త జీవులకు పోషకుడిగా .. రక్షకుడిగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అన్నింటినీ సమకూర్చి పెడుతున్నారో ఆ దైవం తన ప్రాణాలను నిలబెట్టాలని వేడుకుంటుంది. దాహం తీర్చుకోవడానికి తాను సరస్సులోకి దిగవలసి వచ్చిందనీ, ఈ విధంగా తాను మొసలి నోటికి చిక్కుతానని అనుకోలేదని అంటుంది. నేలపై తనకి ప్రమాదం జరిగితే తన స్వశక్తితో పోరాడతాననీ, కానీ నీటిలో మొసలి బలం తనని నిస్సహాయుడిని చేసిందని ఆవేదన చెందుతుంది. నిస్సహాయులకు అండగా నిలిచే ఆ దైవమే తనని రక్షించడానికి రావాలని ప్రార్ధిస్తుంది.
ఒక వైపు నుంచి మొసలి .. ఏనుగును మరింత లోపలికి లాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏనుగు బలం సన్నగిల్లిందనే విషయాన్ని గ్రహించిన ఆ మొసలి, మరింతగా తన పట్టు బిగిస్తూ ఉంటుంది. దైవాన్ని ప్రార్ధించే పరిస్థితి కూడా లేకపోయినా, ఆ బాధతోనే ఏనుగు ప్రార్ధన చేస్తూ ఉంటుంది. మొసలి వలన కలిగే బాధ పెరుగుతున్నా కొద్దీ ఏనుగు ప్రార్ధనలోని ఆర్తి పెరుగుతూ ఉంటుంది. ఆర్తితో అది చేసే ఘీంకారం వింటూ, ఒడ్డున ఉన్న ఏనుగులన్నీ కూడా నిస్సహాయంగా నిలబడిపోయి చూస్తుండిపోతాయి.
ఏనుగు బలహీనపడుతుందని గ్రహించిన మొసలి, పొడవైన తన కోరలతో దాని కాలును చీరడం మొదలు పెడుతుంది. భగ్గుమంటున్న ఆ బాధకి ఏనుగు విలవిలలాడి పోతుంది. తనవారు తనని కాపాడే పరిస్థితి లేదు .. తనని తాను రక్షించుకునే స్థితిలో తాను లేడు. ఇలాంటి ఆపద సమయంలో ఆ భగవంతుడే తనని కాపాడాలని అంటుంది. అందుకు ఆయన మాత్రమే సమర్థుడిగా తనకి తోస్తున్నాడని చెబుతుంది. చివరిసారిగా పిలుస్తున్నాననీ, మళ్లీ పిలవడానికి అవసరమైన శక్తి తనకి ఉంటుందో లేదోనని ఒక్కసారిగా ఆర్తితో ఘీంకారం చేస్తుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.